హాట్సాఫ్‌ రమ్య.. మానవత్వంపై ఆశ కోల్పోయిన వారిలో ఆశలు రేకెత్తించావు

Kerala woman cop breastfeeds infant separated from mother - Sakshi

తల్లికి దూరమైన పన్నెండు రోజుల పసిపాప ఆకలితో ఏడుస్తోంది. ఆ ఏడుపు ఎక్కువై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ‘పాపకు ఏమైనా అవుతుందేమో’ అనే భయం ఆవరించింది. అలాంటి విపత్కర సమయంలో దేవుడు పంపిన మనిషిలా వచ్చింది కానిస్టేబుల్‌ రమ్య...

ఒక మహిళ గట్టిగా ఏడుస్తూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. ‘ఏమైంది?’ అని అడిగే లోపే తన బిడ్డను భర్త ఎత్తుకెళ్లిపోయాడని గుండెలు బాదుకుంది. తనకూ, భర్తకు మధ్య తగాదాలు జరుగుతున్నాయి. అతడి కోసం వెదికితే జాడలేదు.
‘పాప ఎన్ని ఇబ్బందులు పడుతోందో!’ అనే ఆందోళన అందరిలో మొదలైంది.
ప్రాథమిక దర్యాప్తులో అతడు బెంగళూరుకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడని తెలుసుకున్నారు. చెక్‌పోస్ట్‌ల దగ్గర నిఘా పెట్టారు.


వయనాడ్‌ (కేరళ) సరిహద్దుల దగ్గర చెక్‌పోస్ట్‌లో బాధితురాలి భర్తను పట్టుకున్నారు పోలీసులు. అతడి చేతుల్లో పాప ఉంది. ఎప్పటి నుంచి ఏడుస్తుందో ఏడుస్తూనే ఉంది. పాపను తల్లి దగ్గరకు చేర్చాలంటే చాలా సమయం పట్టేట్లు ఉంది.
ఈలోపు పాప పరిస్థితి ఆందోళనకరంగా మారింది, పాప బతకాలంటే పాలు పట్టాలి. తల్లి ఎక్కడో దూరంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడు పంపిన మనిషిలా ముందుకు వచ్చింది పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంఆర్‌ రమ్య.
పాప పరిస్థితి చూసి చలించిపోయింది. ఇంటి దగ్గరున్న తన పిల్లలు గుర్తువచ్చారామెకు. ఈ పాప తన మూడో పాప అనుకుంది. అక్కున చేర్చుకుని అమ్మలా పాలు పట్టింది. దాంతో ప్రమాదం తప్పింది. 

‘పాపను తల్లికి అప్పగించి ఊరికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. విపరీతమైన ఆకలి. ఏదైనా తిందామంటే ఒక్క దుకాణం కూడా తెరిచి లేదు. ఆ భయానకమైన ఆకలి కాస్తా ఈ రోజు నేను ఒక మంచిపని చేశాను అని గుర్తు తెచ్చుకోవడంతో మాయమైపోయింది’ అంటుంది రమ్య. రమ్య చేసిన మంచిపని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారామెను సత్కరించి ప్రశంసించారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్‌ దేవన్‌ రామచంద్రన్‌ రమ్యను ప్రశంసిస్తూ ఉత్తరం రాశారు. 

అందులో ఇలా ఉంది...
‘నువ్వు చేసిన మంచి పని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ మానవతా దృక్పథానికి అద్దం పడుతుంది. నిబద్ధత ఉన్న ఉద్యోగిగా, చల్లని మనసు ఉన్న తల్లిగా ఒకే సమయంలో రెండు విధులు నిజాయితీ గా నిర్వహించావు. మానవత్వంపై ఆశ కోల్పోయిన వారిలో ఆశలు రేకెత్తించేలా చేశావు...’ కోళికోద్‌కు చెందిన రమ్యకు ఇద్దరు పిల్లలు. భర్త స్కూలు టీచర్‌. ఒకప్పుడు రమ్య పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే పాపకు పాలు పట్టిన వార్తతో ఆమె పేరు అందరికీ సుపరిచితం అయింది. ఎక్కడికి వెళ్లినా ‘చల్లగా జీవించు తల్లీ’ అనే దీవెనలు లభిస్తున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top