Joycy Lyngdoh: నిరుపేద మహిళ.. తొలుత స్కూల్‌ బస్‌ డ్రైవర్‌గా.. ఇప్పుడేమో!

Joycy Lyngdoh: Meghalaya Woman 1st Female Amazon India Truck Driver - Sakshi

అమేజింగ్‌ డ్రైవర్‌

ప్రతి పనిలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు నేటితరం మహిళలు. గరిటే కాదు స్టీరింగ్‌నూ తిప్పేస్తామని అనేక సందర్భాల్లో స్టీరింగ్‌ను చాకచక్యంగా తిప్పిచూపించిన వారెందరో. తాజాగా ఈ జాబితాలో చేరిన జాయిసీ లింగ్డో.. అతిపెద్ద సంస్థ అమెజాన్‌లో ట్రక్‌ స్టీరింగ్‌ తిప్పుతూ ఔరా అనిపిస్తోంది.

ఒకచోటనుంచి మరోచోటుకు అమెజాన్‌ గూడ్స్‌ను రవాణా చేస్తూ అమెజాన్‌ ఇండియాలో తొలి మహిళా ట్రక్‌ డ్రైవర్‌గా నిలిచింది . తనలాంటి వారెందరికో డ్రైవింగ్‌ కూడా ఒక ఉపాధి మార్గమంటూ చెప్పకనే చెబుతోంది. 

మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన 35 ఏళ్ల నిరుపేద మహిళే జాయిసీ లింగ్డో. ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో అమ్మ, ముగ్గురు చెల్లెళ్ల భారం జాయిసీ భుజాలపైన పడింది.

దీంతో చదువుని త్వరగా ముగించేసి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించసాగింది. గువహటీలోని స్టీల్‌ కంపెనీతోపాటు ఇతర కంపెనీలు, స్థానిక షాపుల్లో స్టోర్‌ మేనేజర్‌గా పనిచేసేది.

సరదాగా ప్రారంభించి...
ఒకపక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క తన స్నేహితుల సాయంతో సరదాగా డ్రైవింగ్‌ నేర్చుకుంది. స్టీరింగ్‌ తిప్పడం బాగా వచ్చాక ఓ స్కూల్‌ బస్‌కు డ్రైవర్‌గా చేరింది. కొంతకాలం పని చేశాక అమెజాన్‌లో ట్రక్‌ డ్రైవర్స్‌ను తీసుకుంటున్నారని తెలిసి దరఖాస్తు చేసుకుంది.

ఆరేళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉండడంతో అమెజాన్‌ కంపెనీ జాయిసీని తీసుకుంది. దీంతో అమెజాన్‌ ఇండియాలో తొలి మహిళా ట్రక్‌ డ్రైవర్‌ గా నిలిచింది. గువహటీ వ్యాప్తంగా అమెజాన్‌ గూడ్స్‌ను సమయానికి డెలివరీ చేస్తూ మంచి డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

మహిళా ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ, తనలాంటి మహిళలెందరికో కొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తోన్న జాయిసీ అమేజింగ్‌ డ్రైవర్‌గా పేరు తెచ్చుకుంటోంది. 
 
మనసుంటే మార్గం ఉంటుంది
వివిధ ప్రాంతాలకు తిరుగుతూ కొత్త ప్రాంతాలు, కొత్త మనుషుల్ని కలవడం బాగా నచ్చింది. అందుకే డ్రైవింగ్‌ మీద ఉన్న ఆసక్తిని వృత్తిగా మార్చుకుని రాణించగలుగుతున్నాను. డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకోవాలనుకునేవారు ముందు మిమ్మల్ని మీరు నమ్మండి.

కొత్త ఉపాధి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి వాటిని అందిపుచ్చుకునేందుకు ఆరాటపడాలి. కొత్తదారిలో నడిచేటప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయి. సాధించాలన్న మనస్సుంటే మార్గం తప్పకుండా దారి చూపుతుంది. – జాయిసీ లింగ్డో 

చదవండి: Viraj Mithani: ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో
Street Child World Cup 2022: వీధి బాలికల టీమ్‌ ఆడుతోంది చూడండి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top