Street Child World Cup 2022: వీధి బాలికల టీమ్‌ ఆడుతోంది చూడండి

Street Child World Cup 2022: 9 Chennai Girls Represent India At The Street Child World Cup in Doha - Sakshi

రియల్‌ ఝుండ్‌

కతార్‌లోని దోహాలో వీధి బాలికల ఫుట్‌బాల్‌ ఉత్సవం జరుగుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వీధి బాలికలు తమ పేదరికాన్ని, దురదృష్టాన్ని, కష్టాలను, ఆకలిని దాటి తామేంటో నిరూపించుకోవడానికి కసిదీరా బంతిని కాలితో తంతున్నారు. మన దేశం నుంచి టీమ్‌ వెళ్లింది. వారిలో 9 మంది చెన్నై వీధి బాలికలు. కెప్టెన్‌ కూడా. ‘గెలవడం ఓడటం కాదు... మేము కూడా దేశంలో భాగమే అని చెప్పగలుగుతున్నాం’ అంటున్నారు వారు. ఇటీవల ఇదే అంశం పై ‘ఝుండ్‌’ సినిమా వచ్చింది. ఇది నిజం ఝుండ్‌.

కతార్‌లోని దోహాలో ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌. అక్టోబర్‌ 6 నుంచి 15 వరకు. దాని పేరు ‘స్ట్రీట్‌ చైల్డ్‌ వరల్డ్‌ కప్‌ 2022’. 25 దేశాల వీధి బాలికలు ఈ కప్‌ కోసం హోరాహోరీ ఆడుతున్నారు. మన దేశం నుంచి టీమ్‌ వెళ్లింది. ఎవరెవరి తో తలపడుతున్నదో తెలుసా? అమెరికా, మెక్సికో, జింబాబ్వే, పెరు, బంగ్లాదేశ్‌. వీటన్నింటిని దాటితే అక్టోబర్‌ 15న ఫైనల్స్‌. గెలుస్తారో లేదో తర్వాతి సంగతి. కాని చెన్నైలోని మురికివాడలకు చెందిన అమ్మాయిలు ఫుట్‌బాల్‌ నేర్చుకుని, ప్రతిభ చూపి, విమానం ఎక్కి, విదేశి గడ్డ మీద, విదేశీ టీమ్‌లతో– వాళ్లూ వీధి బాలికలే– తలపడటం ఉందే... అదే అసలైన గెలుపు. మిగిలింది లాంఛనం.

2010లో లండన్‌లో వీధి బాలల ఫుట్‌బాల్‌ మొదలయ్యింది. పేదరికం వల్ల, అయినవారు లేకపోవడం వల్ల, ఇళ్ల నుంచి పారిపోవడం వల్ల దిక్కులేని వారిగా ఉన్న వీధి బాలలు నేరస్తులుగా, డ్రగ్‌ ఎడిక్ట్‌లుగా మారకుండా వారికి ఆరోగ్యకరమైన ఒక వ్యాపకం ఉండేందుకు ‘స్ట్రీట్‌ చైల్డ్‌ యునైటెడ్‌’ అనే సంస్థ ఈ ఫుట్‌బాల్‌ తర్ఫీదును మొదలెట్టింది.  అది క్రమంగా ఇవాళ 25 దేశాలకు పాకింది. వీధి బాలలతో మొదలైన ఫుట్‌బాల్‌ వీధి బాలికలకు చేరింది.

మన దేశంలో అనేక నగరాలలో వీధి బాలికల ఫుట్‌బాల్‌ టీమ్స్‌ ఉన్నాయి. వీటన్నింటి నుంచి 12 మంది సభ్యుల నేషనల్‌ జట్టును తయారు చేసి దోహాకు పంపారు. ఈ జట్టులో చెన్నైకు చెందిన ‘కరుణాలయ’ అనే వీధి బాలికల సంస్థకు చెందిన 9 మంది బాలికలు ఉన్నారు. కెప్టెన్‌ కూడా చెన్నై నుంచే. వీరంతా దోహాలో ఇప్పుడు మ్యాచ్‌లు ఆడుతున్నారు.

మన దేశం నుంచి వెళ్లిన వీధిబాలికల జట్టులో ఒక్కొక్కరిది ఒక్కో కథ. సంధ్య అనే అమ్మాయి చెన్నైలోని కూరగాయల మార్కెట్‌లో దిక్కులేక తిరుగుతుంటే కరుణాలయలో చేర్చారు. అక్కడే ఉండి చదువుకుంటోంది. ఇప్పుడు ఫుట్‌బాల్‌ మేటి ఆటగత్తె అయ్యింది. ‘నేను జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు. కరుణాలయ వాళ్లు నా పాస్‌పోర్ట్‌ను సిద్ధం చేస్తున్నారని విన్నానుగాని జట్టులో చోటు దొరుకుతుందని అనుకోలేదు. తీరా విమానం ఎక్కాక తెలిసింది నేనే ఈ జట్టుకు కెప్టెన్‌ అని’ అని సంబరపడుతోంది ఆమె దోహ నుంచి ఇంటర్వ్యూ ఇస్తూ.

జట్టులో ఉన్న మరో ప్లేయర్‌– 17 ఏళ్ల ప్రియకు తల్లిదండ్రులెవరో తెలియదు. ఎలాగో కరుణాలయకు చేరి అక్కడే ఉంటోంది. ఇప్పుడు జాతీయ జట్టులో స్థానం పొందిన ప్లేయర్‌గా ఆమె ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పగా ఉంది. వీరిద్దరే కాదు జాతీయ జట్టుకు ఎంపికైన ఈ చెన్నై ‘కరుణాలయ’ బాలికల్లో పవిత్ర, దివ్య, దర్శిని, గోల్‌కీపర్‌ సదా... వీరందరివీ ఇలాంటి కథలే.

అయితే ఈ వరల్డ్‌ కప్‌కు ఆషామాషీగా వెళ్లారా మనవాళ్లు? కాదు. ఆరు నెలలుగా సాధన చేస్తున్నారు. కరుణాలయ ఉన్న తొండియర్‌పేట్‌ నుంచి పెరంబూర్‌లో ఉన్న గ్రౌండ్‌ వరకూ రోజూ వెళ్లి ప్రాక్టీసు చేశారు. అల్‌డ్రోయ్‌ అనే వ్యక్తి వీరికి కోచ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ టీమ్‌తో ఒక మేనేజర్, ఒక సహాయకురాలు, కోచ్‌ వెళ్లారు.
‘దోహాలో అంతా క్రమశిక్షణ. ఉదయం ఐదింటికల్లా మేమంతా లేచి బ్రేక్‌ఫాస్ట్‌లు చేసి ఏడున్నర ఎనిమిది నుంచి మ్యాచ్‌లకు సిద్ధమైపోతున్నాం’ అని చెప్పారు ఈ బాలికలు ఫోన్‌ ఇంటర్వ్యూలో.
అయితే వీరు ఈ సంతోషం పొందడం వెనుక నిర్వాహకుల శ్రమ చాలా ఉంది. ఏమంటే వీరికి సరైన చిరునామాలు లేవు, తల్లిదండ్రుల వద్ద సరైన పత్రాలు లేవు. అందువల్ల వీరి పాస్‌పోర్టులు చాలా కష్టమయ్యాయి. కాని సాధించారు. ‘ఝుండ్‌’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ ఇలాగే వీధి బాలలకు సాకర్‌ నేర్పిస్తే వరల్డ్‌ కప్‌కు పాస్‌పోర్ట్‌ల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. వీరి కథ వింటే ఆ సినిమా గుర్తుకొస్తుంది.
ఈ బాలికలు గెలిచి వచ్చినా ఓడి వచ్చినా వీరు వచ్చి చెప్పే అనుభవాలు ఎందరో వీధి బాలికల మనసులో స్ఫూర్తిని నింపుతాయనడంలో సందేహం లేదు.
 
దోహాలో మన టీమ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top