Viraj Mithani: ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో

Indian Artist Viraj Mithani Successful Journey In Telugu - Sakshi

గ్లోబల్‌ ఆర్టిస్ట్‌ 

‘మా అబ్బాయి బొమ్మలు భలే వేస్తాడు’ అని ఫ్రెండ్స్‌తో చెప్పుకొని మురిసిపోయేవాడు ఆ తండ్రి. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక ‘నేను ఆర్టిస్ట్‌ కావాలనుకుంటున్నాను’ అన్నాడు. ఇది తండ్రికి నచ్చలేదు. ఎందుకంటే ఆర్ట్‌ అనేది ఆయన దృష్టిలో అనేకానేక అభిరుచుల్లో ఒకటి మాత్రమే. ‘నువ్వు నాలా బిజినెస్‌ చేయాల్సిందే’ అన్నాడు నాన్న.

అలా అని శాసించలేదు. ఆ తరువాత కుమారుడి మనసును అర్థం చేసుకొని ‘నీ ఇష్టం నాన్నా’ అన్నాడు. ఆ ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలాన్ని గ్రహించి ఆర్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాడు 28 సంవత్సరాల విరాజ్‌ మిథాని...

మూడో క్లాస్‌లో ఏ4 పేపర్‌లపై బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు విరాజ్‌ మిథాని. పదవతరగతికి వచ్చేసరికి ‘భవిష్యత్‌లో ఇదే నా వృత్తి’ అనే స్థాయికి వెళ్లాడు. కాలేజీ రోజుల్లో ఎక్కడ చిత్రకళ పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తనకు అక్షరాలు కనిపించేవి కాదు. బొమ్మలు మాత్రమే కనిపించేవి!

కట్‌ చేస్తే...
‘నేను ఆర్టిస్ట్‌ కావాలనుకుంటున్నాను’ అని విరాజ్‌ తన మనసులో మాట బయటపెట్టినప్పుడు అది తండ్రికి నచ్చలేదు. అయితే ‘బొమ్మరిల్లు’ సినిమాలో కొడుకులా ‘మొత్తం మీరే చేశారు. నేను కోల్పోయింది చాలు. ప్లీజ్‌’ అని విరాజ్‌ అనక ముందే, కొడుకు మనసును గ్రహించి ‘సరే నీ ఇష్టం’ అన్నాడు.

దీంతో విరాజ్‌ యూఎస్‌లోని ‘రోడ్‌ ఐలాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌’లో మాస్టర్స్‌ కోర్స్‌ చేశాడు. అంతకుముందు యూనివర్శిటీ ఆర్ట్స్, లండన్, స్కూల్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్, చికాగోలో చదువుకున్నాడు.

సంప్రదాయ చిత్రకళారూపాలను చూస్తూ పెరిగిన విరాజ్‌కు విదేశాల్లో చదువు వల్ల కొత్త ప్రపంచం పరిచయం అయింది. మిక్స్‌ ఆఫ్‌ పెయింటింగ్, ప్రింట్‌ మేకింగ్, శిల్పకళ, త్రీడీ ప్రింటింగ్‌లో పట్టు సాధించాడు. ఆధునిక సాంకేతికత, సంప్రదాయ కళారూపాలను మేళవించే ఆర్ట్‌లో తనదైన శైలిని సృష్టించుకున్నాడు. ఆర్టిస్ట్‌గా తన ఆర్ట్‌తో సరిహద్దురేఖలను చెరిపేశాడు. ‘ఫోర్బ్స్‌30 అండర్‌ 30’ (2022) జాబితాలో చోటు సంపాదించాడు.


PC: Viraj Mithani Instagram

విరాజ్‌ తాత మాత్రం
విరాజ్‌ వ్యాపార కుటుంబంలో కళ గురించి అవగాహన ఉన్నవారులేరు. అయితే విరాజ్‌ తాత మాత్రం చక్కగా ఫొటోలు తీసేవాడు. బొమ్మలు కూడా వేసేవాడు. అయితే అతడికి అవి కాలక్షేపం అభిరుచులు మాత్రమే!

ఆర్ట్‌ లవర్‌గా విరాజ్‌ ఎన్నో గ్యాలరీలలో ఎందరో ఆర్టిస్ట్‌ల బొమ్మలను చూశాడు. వాటితో మౌనంగా మాట్లాడాడు. విరాజ్‌ దృష్టిలో ఒక చిత్రాన్ని అర్థం చేసుకోవడం అంటే ఆ చిత్రకారుడి వ్యక్తిత్వం, భావజాలాన్ని కూడా అర్థం చేసుకోవడం.

‘ఒకప్పుడు ఎవరి ప్రపంచం వారిది అన్నట్లుగా ఉండేది. అంతర్జాలంతో ప్రపంచమంతా ఒకే వేదిక పైకి వచ్చింది. మాటలు, చర్చలు, భావాలతో భిన్న సంస్కృతుల మధ్య ఐక్యత వర్థిల్లుతోంది. అది చిత్రకళలో ప్రతిఫలిస్తుంది’ అంటున్నాడు విరాజ్‌.

తన ప్రొఫెషన్‌లో భాగంగా విరాజ్‌ కొన్ని రోజులు యూఎస్, కొన్ని రోజులు యూకేలో ఉంటాడు. ‘గ్లోబల్‌ ఆర్టిస్ట్‌’గా పేరు తెచ్చుకున్న విరాజ్‌ ఏ దేశంలో ఉన్నా సరే మన దేశంతోనే ఉంటాడు. అదే తన బలం! 

చదవండి: Dhanteras- Gold: గోల్డ్‌ గురించి బోలెడు విషయాలు తెలుసుకొని మరీ కొంటున్న యువత! ఈ ఆసక్తి ఎందుకంటే?!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top