కరాచీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలైంది. బంగ్లాదేశ్ కళాకారులు 18 ఏళ్ల అనంతరం పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా వీరు కరాచీలో బుధవారం ప్రదర్శన ఇచ్చారు. నిహారికా ముంతాజ్ సారథ్యంలోని బంగ్లాదేశ్ బృందంలో కొందరు హిందూ కళాకారులు సైతం ఉండటం విశేషం. షిరీన్ జవాద్ పాడిన బెంగాలీ పాటలు ఆహూతులను అలరించాయి. అక్టోబర్ 30వ తేదీన మొదలైన వీరి ప్రదర్శనలు డిసెంబర్ 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈ ఉత్సవాల్లో 140 దేశాలకు చెందిన కళాకారులున్నారు. రెండు దేశాల నడుమ తలెత్తిన దౌత్యపరమైన రాజకీయ విభేదాల కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు పదేళ్లపాటు కొనసాగలేదు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కనిష్టస్థాయిలో కొనసాగాయి. 2024లో విద్యార్థుల సారథ్యంలో కొనసాగిన ఉద్యమంతో హసీనా ప్రభుత్వం పడిపోయింది. యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్‌తో సంబంధాలు తిరిగి గాడినపడ్డాయి.


