
నది పాడే గీతాన్ని ఎప్పుడైనా విన్నారా?
నది మౌనాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? సముద్రంలో కలిసే నది చెప్పే జీవిత సత్యం ఏమిటి?..నది అనేది తత్వశాల. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ప్రవాహంలోనే జవాబులు ఉంటాయి. ఆరుగురు మహిళా ఆర్టిస్ట్‌లు... అలము కుమరెసన్, అపరాజిత జైన్ మహాజన్, డా. సవిత, హన్సిక శర్మ, లక్ష్మీ మాధవన్, మీనాక్షి నిహలాని ‘వేర్ ది రివర్ మీట్స్ ది సీ’ పేరుతో ముంబైలోని ఆర్ట్ గ్యాలరీ ‘అనూప్ మెహతా కాన్‌టెంపరరీ ఆర్ట్’లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు.
ఫైబర్, క్లాత్, ఎంబ్రాయిడరీలకు ఆధునిక కళారీతులను జోడించి కన్నుల పండగ చేశారు. ‘జీవన ప్రయాణానికి నది ప్రతీకలాంటిది’ అంటారు ఆ ఆరుగురు ఆర్టిస్ట్‌లు. ఈ చిత్రాలలో మన వారసత్వ సంపద, సంస్కృతి కనిపిస్తాయి. స్త్రీవాద గొంతుక వినిపిస్తుంది.
టెక్స్‌్టటైల్ ఆర్ట్‌కు కాలం చెల్లుతుందా? అనుకునే రోజుల్లో అది ప్రపంచవ్యాప్తంగా పునరుజ్జీవించింది. సమకాలీన అంశాలతో మమేకం అవుతూ కొత్త కాంతులు విరజిమ్ముతోంది. ఈ ఆరుగురు ఆర్టిస్ట్‌ల ‘వేర్ ది రివర్ మీట్స్ ది సీ’ వస్త్రకళను మరింత కొత్తగా చూపే ప్రయత్నం.