అప్పు తీర్చిన చీమ

Jharkhand Woman Saving Ten Per Week Now Runs Own Business - Sakshi

జార్ఖండ్‌లో పాలము అనే జిల్లా ఉంది. పాలములో మెదినీనగర్‌ అనే బ్లాక్‌ ఉంది. మెదినీనగర్‌లో తన్వా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో హస్రత్‌ బానో అనే చీమ ఉంది. ఆ చీమ ఇప్పుడైతే బాగుంది కానీ, ఏడేళ్ల క్రితం అస్సలేం బాగోలేదు. చీమ భర్త కూలి పనికి వెళ్లేవాడు. చీమ ఇంట్లోనే ఉండేది. చీమ భర్త ఏదో అవసరం మీద ఓ ఏనుగు దగ్గర అప్పు చేస్తే ఆ అప్పు వడ్డీమీద వడ్డీగా పెరుగుతూ 10000 రూపాయలు అయింది! ఊళ్లో వాళ్లకు అప్పులిచ్చి, వడ్డీల వసూల కోసం రోజంతా ఘీంకరిస్తూ తిరుగుతుండే ఏనుగులలో ఓ ఏనుగు దగ్గర ఈ భర్త చీమ అప్పు చేసింది. తీర్చలేకపోయింది. పదివేలు అయిందంటే అది ఇక ఎప్పటికీ తీరే అప్పుకాదని భార్య చీమకు అర్థం అయింది. అదొక్కటే కాదు, వడ్డీ వసూలుకు ఏనుగు వచ్చిన ప్రతిసారీ భర్త చీమ తను ఇంట్లో లేనని భార్య చీమతో చెప్పిస్తోంది.

‘ఆయన ఇంట్లో లేరు’ అని భార్య చీమ తలువు చాటు నుంచి చెబుతున్న ప్రతిసారీ భార్య చీమను ఏనుగు అదోలా, ఏదోలా చూస్తోంది. ఆడవాళ్లు మాత్రమే గ్రహించగలిగే అదోలా లు, ఏదోలా లు అవి. భర్త చీమకు ఆ సంగతి చెప్పలేదు భార్య చీమ. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ వాళ్ల దగ్గర అప్పు తీసుకుని ఏనుగు అప్పు మొత్తం తీర్చేసింది. తీర్చాక, ‘ఆ అప్పులవాడు ఇక మన ఇంటికి రాడు’ అని భర్త చీమకు చెప్పింది. భర్త చీమ సంతోషించింది. ‘ఇక మీదట అప్పు చెయ్యను’ అని భార్య చీమ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చింది. భర్త కళ్లల్లో ఆనందం చూసి భార్య చీమ కళ్లకు నీళ్లొచ్చాయి. తర్వాత భార్య చీమ అదే సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు దగ్గర 80000 అప్పు చేసింది.

మొదటి అప్పు తీర్చడానికి రోజుకు ఐదు రూపాయలు చొప్పున ఆరేళ్లు పట్టింది రెండు చీమలు. అప్పు కట్టినట్లే లేదు, అప్పంతా తీరిపోయింది. ఆ ధైర్యంతోనే భార్య చీమ ఈసారి ఎనభై వేలు అప్పు తీసుకుంది. ఆ డబ్బుతో ఒక పిండి మిల్లు పెట్టింది. చెప్పుల దుకాణం పెట్టుకుంది. నెలకు ఇప్పుడు 20 వేలు సంపాదిస్తోంది! జార్ఖండ్‌ లోని మారుమూల గ్రామాల్లో సొంత చేతులపై కుటుంబాన్ని నిలబెట్టిన ఇలాంటి డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ ఉమన్‌ చీమలు 30 లక్షల వరకు ఉన్నాయి! ఆ చీమలదండుకు బాస్‌ లెవరూ లేరు. ‘అజ్విక’ అనే గ్రూప్‌ పేరుతో వాళ్లలో వాళ్లే ఎవరు దాచుకున్న డబ్బుతో వాళ్లు ఒకరికొకరు హెల్ప్‌ చేసుకుంటున్నారు.

మెడలో తళతళ మెరిసే గోల్డ్‌ చైన్‌ వేసుకుని ధడ్‌ ధడ్‌ ధడ్‌ మని బులెట్‌ బండి మీద అప్పులు ఇవ్వడానికి వచ్చే ఏనుగులు ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. భర్త చీమలు ఇంటికి ఇచ్చిన దాంట్లోంచే కొంత తీసి కొండల్ని కూడబెట్టే భార్య చీమలకు ఇంటి బయటికి వచ్చి సంపాదించే సహకారాన్ని ఇంట్లోవాళ్లు మనస్ఫూర్తిగా అందిస్తే డబ్బుల కొండపై ఇల్లు కట్టుకున్నట్లేనని చెప్పే ఒకానొక చీమ కథ.. హస్రత్‌ బానో కథ ఇది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top