లాయర్‌ అవుతా.. | International human rights lawyer Navi Pillay won the Nobel Peace Prize | Sakshi
Sakshi News home page

లాయర్‌ అవుతా..

Oct 11 2026 3:53 AM | Updated on Oct 11 2026 3:53 AM

 International human rights lawyer Navi Pillay won the Nobel Peace Prize

నాడు... పదకొండేళ్ల బాలిక దృఢ నిశ్చయం

నేడు... ఆ బాలిక ప్రపంచం గర్వించదగిన శాంతి కపోతం

ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం. ..ఎంతో మంది బాలికలకు స్ఫూర్తినిచ్చే చైతన్య తేజం పేరు... నవీ పిళ్లై దశాబ్దాల క్రితం... పదకొండు సంవత్సరాల బాలిక ‘నేను లాయర్‌ అవుతాను’ అని టీచర్‌తో సంతోషంగా చెప్పింది.  ‘గుడ్‌’ అనలేదు టీచర్‌. అదోలా చూసి కళ్లతోనే వెక్కిరించారు. ‘లాయర్‌ కావాలంటే చాలా డబ్బు ఉండాలి. నీవల్ల కాదు’ అన్నట్లుగా మాట్లాడారు. ఆ బాలికకు డబ్బు లేదు. ధైర్యం ఉంది. బాలికలకు ధైర్యం ఉంటే చరిత్ర సృష్టించగలరని నిరూపించింది. ఆనాటి ఆ బాలిక పేరు... నవీ పిళ్లై. నోబెల్‌ శాంతి బహుమతితో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన,  భారతీయ మూలాలు ఉన్న నవీ పిళ్లై అంతరంగ కథనం...

మా నాన్న బస్సు డ్రైవర్‌
‘నేను లాయర్‌ అవుతాను’ అని మా టీచర్‌తో చెప్పినప్పుడు ‘నువ్వు లాయర్‌ కావాలంటే, మీ నాన్న ధనవంతుడై ఉండాలి. లా చదవడానికి చాలా డబ్బులు కావాలి’ అన్నారు. మా నాన్న బస్సు డ్రైవర్‌. టీచర్‌ మాట నన్ను బాగా కుృంగదీసింది. సమాజ నిర్మాణం, పెద్దలు మనతో చెప్పే మాటలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ అడ్డంకులను అధిగమించడం పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాలను అధిగమించి లా చదివాను. 

లా పట్టా పుచ్చుకున్న తరువాత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలు పెట్టాను. న్యాయసంస్థ(లా ఫర్మ్‌)లలో పనిచేసే వారంతా ఎక్కువగా  శ్వేతజాతీయులే. ‘సారీ... నిన్ను ఉద్యోగంలోకి తీసుకోలేము’ అనేది వారి నుంచి వచ్చే మొదటి మాట. ‘ఎందుకో తెలుసుకోవచ్చా?’ అని అడిగితే... ‘బ్లాక్‌ పర్సన్‌ నుండి వైట్‌ సెక్రటరీ ఆదేశాలు అందుకోవడం ఎంతమాత్రం బాగుండదు’ అని చెప్పేవారు. ఇంత కంటే జాతివివక్ష ఏముంటుంది! 

జాతివివక్ష–వర్గవివక్ష
కేవలం జాతివివక్షే కాదు వర్గవివక్ష కూడా ఎదుర్కొన్నాను. ‘ఒక వేళ నీకు ఉద్యోగం ఇస్తే ఎలాంటి క్లయింట్‌లను తీసుకురాగలవు? మీ నాన్న వ్యాపారం చేస్తాడా?’ అని అడిగేవారు. ‘నాన్న బస్సు డ్రైవర్‌’ అనగానే వెటకారంగా మాట్లాడేవారు.

‘నాకు ఈమధ్యే పెళ్లయింది’ అని చెప్పినప్పుడు... ‘ఒకవేళ నువ్వు ప్రెగ్నెట్‌ అయితే పరిస్థితి ఏమిటి!’ అనేవాళ్లు. దీంతో నేనే సొంతంగా లా ఫర్మ్‌ను ప్రారంభించాను. అప్పుడు కూడా వివక్ష తప్పలేదు. ‘ఎంత అహంకారం ఉంటే సొంతంగా లా ఫర్మ్‌ను ప్రారంభిస్తుంది! ఇది ఎంత కాలం నిలుస్తుంది?’ అనేవాళ్లు.

వేరే మార్గం లేదు...ఉన్నది ఒకే మార్గం!
నా ధైర్యమే నన్ను నిలబెట్టింది. గృహహింస కేసులలో నైపుణ్యం ఉన్న న్యాయవాదిగా పేరు తెచ్చింది. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలకు అండగా నిలబడి వారి తరపున ఎన్నో కేసులు వాదించాను. నేను వాదించిన కేసులు రాబెన్‌ ద్వీపంలోని ఖైదీల హక్కులను కాపాడడానికి సహాయపడ్డాయి. దక్షిణాఫ్రికా చట్టాలు నాకు అన్యాయంగా అనిపించేవి. 

వర్ణవివక్ష చట్టాలకు సంబంధించి నిష్పాక్షిక విచారణ జరిగేది కాదు. వర్ణవివక్ష పాలకుల పాలనలో నా చర్మరంగు కారణంగా న్యాయమూర్తి గదిలోకి ప్రవేశించకుండా నన్ను నిషేధించారు. 1995లో నెల్సన్‌ మండేలా నన్ను సుప్రీంకోర్టులో నియమించారు. అలా దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి శ్వేతజాతీయేతర మహిళా న్యాయవాదిగా గుర్తింపు పొందాను.

మానవ హక్కుల న్యాయవాదిగా నా వృత్తిజీవితాన్ని ప్రారంభించడానికి కారణం... నేను ఎదుర్కొన్న వర్ణవివక్ష. శ్వేతజాతీయుల కోసం ఏర్పాటైన పార్క్‌లు, బీచ్‌లలోకి నేను అడుగు పెట్టలేకపోయేదాన్ని. అందుకే... నేను వర్ణవివక్ష వ్యతిరేక కార్యకర్తల తరఫున కోర్టులో వాదించే రోజులలో...‘మీరు ఏదో చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉండనివ్వండి. సమస్యలు తేకండి’ అని చాలామంది నాతో అనేవారు. నేను మాత్రం... పరిస్థితులు ఇలాగే ఉంటే ఇదే సహజం, నల్లజాతీయులను అలా చూడడం సరిౖయెనదే అనుకుంటారు. అందుకే...పరిస్థితులను మార్చాలనుకుంటున్నాను అని వారితో చెప్పేదానిని.

గృహహింసకు వ్యతిరేకంగా...
నేను న్యాయశాస్త్ర పాఠాలను యూనివర్శిటీలో కంటే నిజజీవిత అనుభవాల నుంచే ఎక్కువగా చదువుకున్నాను. ఎంతోమంది మహిళలు ఎన్నో రకాలుగా నా కళ్లు తెరిపించారు. వారి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోగలిగాను. 1960 దశకంలో ఎంతోమంది మహిళలు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు. వారు గృహహింస బాధితులు. వారికి అనేక రకాలుగా ధైర్యం చెప్పేదానిని. నిజానికి గృహహింస అనేది వ్యక్తిగత కేసులకు అతీతమైనది. ఈ సమస్యపై ప్రచారం చేయడానికి నడుం బిగించాను.

దారుణంగా గృహహింసకు గురైన ఒక మహిళను టీవీలో చూపించిన మొదటి వ్యక్తిని నేనే. భర్త ఆమెను కత్తితో పొడిచాడు. నానా రకాలుగా హింసించాడు. ఇలాంటి ఎన్నో అనుభవాలు నా పోరాటానికి ప్రేరణ ఇచ్చాయి.‘ఈక్వాలిటీ నౌ’ అనే ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ రైట్‌ ఆర్గనైజేషన్, గృహహింస నిరోధక స్వచ్ఛంద సంస్థ ‘అడ్వైస్‌ డెస్క్‌ ఫర్‌ ది అబ్యూజ్‌డ్‌’ ప్రారంభించడానికి కారణం అయ్యాయి. హింసకు గురైన మహిళలకు రక్షణగా నిలిచే చట్టంలోని లోపాలను ఈ సంస్థలు దృష్టి పెట్టాయి. గృహహింస నిరోధక చట్టాలను గట్టిగా అమలు చేయాలని ఈ సంస్థల ద్వారా ఉద్యమించాం.

తల్లుల గర్భశోకం
ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ ట్రిబ్యూనల్‌ ఫర్‌ రువాండ(ఐసీటీఆర్‌)కు సంబంధించిన ఎన్నికల కోసం నన్ను జడ్జీగా ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీకి నామినేట్‌ చేశారు ప్రెసిడెంట్‌ నెల్సన్‌ మండేలా. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీకి ఎంపికైన ఆరుగురు న్యాయమూర్తులలో ఒకరిగా ఉండడం గొప్ప గౌరవం. ఆ ఆరుగురిలో నేను ఒక్కరినే మహిళను. 

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు దక్షిణ సుడాన్‌కు అధికారిక పర్యటనకు వెళ్లాను. హెలికాప్టర్‌లో బ్లూ నైల్‌ ప్రాంతానికి వెళ్లాను. అది గ్రామీణ, కరడుగట్టిన సంప్రదాయాలు వేళ్లూనుకున్న ప్రాంతం. స్థానికులైన పదిహేను మంది మహిళలతో మాట్లాడాను. వారు వేర్వేరు  తెగలకు చెందినవారు. కొందరి ముఖాలపై వారి తెగను గుర్తించేలా పచ్చబొట్లు కనిపించాయి. కొందరు మహిళలకు వారి తెగను గుర్తించేలా చేయడానికి ముందు పళ్లు తీస్తారు! 

తమ కంటే చాలా ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు తన భర్త, కుమారుడి చేతిలో పన్నెండేళ్ల కుమార్తె ఎలా హత్యకు గురైందో ఒక మహిళ హృదయ విదారకంగా వివరించింది. ఇలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. తమ కుమార్తెలను ఇంటికి సమీపంలో పాతిపెట్టినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. నేను వారికి హక్కులు, చట్టాల గురించి చెప్పాను. అక్కడి నుండి బయలుదేరేటప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను. నిస్సహాయతకు లోనయ్యాను. నేను మాట్లాడిన ఆ మహిళలు తమ హక్కుల కోసం సంఘటితమై పోరాడడం అనేది నాకు ఊరట కలిగించింది.

– యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement