హైదరాబాద్: ఆస్పత్రిలో చేరిన యువ మహిళా న్యాయవాది చికిత్స పొందుతూ చనిపోయారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, న్యాయవాదులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వివరాలు..
మల్కాజ్‌గిరికి చెందిన సుధీర్‌కుమార్, గాయత్రిదేవిల కుమార్తె, న్యాయవాది ఐశ్వర్య (28) 40 రోజుల క్రితం పట్టాభి అనే యువకుడితో ఆమెకు వివాహం జరిగింది. కిడ్నీలో రాళ్లు ఉండడంతో ఆమె ఈ నెల 6న సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రిలో చేరారు. కాగా, కేవలం 2 మిల్లీమీటర్ల (ఎంఎం) రాళ్లు ఉన్న ఆమెకు అవసరం లేకున్నా శస్త్రచికిత్స చేశారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బ్రెయిన్‌డెడ్‌కు గురైందని చెబుతున్నారని నిరసనకు దిగారు. బాధ్యులైన డాక్టర్లను అరెస్టు చేయాలని, ఆస్పత్రిని సీజ్ చేయాలని న్యాయవాదులు నినాదాలు చేశారు. దీంతో గోపాలపురం, మార్కెట్, తుకారాంగేట్ పోలీసులు ఆస్పత్రి వద్ద మోహరించారు. పోలీసులు నచ్చచెప్పడంతో వెళ్లిపోయారు.
ఐశ్వర్య కిడ్నీలో 16 మిల్లీమీటర్ల రాళ్లు ఉన్నాయని, ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స తర్వాత కిడ్నీలో పెద్దఎత్తున చీము ఉందని, ఆ తర్వాత తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గాయని, రక్తపోటులో మార్పులు వచ్చాయని పేర్కొన్నాయి. మెదడులో రక్తస్రావం జరిగిందని సీటీ స్కాన్‌లో తేలడంతో న్యూరాలజీ వైద్యులు చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. ప్లేట్లెట్ల సంఖ్య అత్యంత తక్కువగా, శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండటంతో శస్త్ర చికిత్స సురక్షితం కాదని విరమించినట్లు చెప్పారు. దీంతో ఆమె బ్రెయిన్‌డెడ్‌కు గురైందని తెలిపారు.


