ప్రధానిగా 16 ఏళ్ల అమ్మాయి

International Day Of The Girl Girls Take Over - Sakshi

అక్టోబర్‌ 11 ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ది గర్ల్‌

 ఈ ఏడాది కాన్సెప్ట్‌ ‘గర్ల్స్‌ టేకోవర్‌’.

టేకోవర్‌ అనే మాటలోనే ఏదో పవర్‌ ఉన్నట్లుంది. పగ్గాలు చేతుల్లోకి తీసుకోవడం, దిగ్గజాలను కలిపేసుకోవడం, చేజిక్కించుకోవడం, స్వాధీనం, హస్తగతం.. ఇలాంటివన్నీ గన్‌ చేతుల్లోకి వచ్చినట్లుండే టేకోవర్స్‌. ఎట్లా ఉంటుంది గన్‌ చేతుల్లోకి వస్తే! చేతి నిండా పట్టుకోవాలనిపిస్తోంది. కళ్ల నిండుగా చూసుకోవాలనిపిస్తుంది. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్చాలనిపిస్తుంది. కాల్చాక గన్‌ని ప్యాంట్‌ వెనుక షర్ట్‌ కింద దోపుకోవాలనిపిస్తుంది. సినిమాల్లో మహేష్‌ బాబును చూడట్లేదేంటి! అమ్మాయిలైనా అంతే. గన్‌ చేతికి వస్తే.. ‘ఈ తొక్కలో లవ్వేంట్రా!’ అని ధన్‌ ధన్‌ మని కనీసం ఇద్దరు ముగ్గురిని లేపేస్తారు. ఎక్కువ టైమ్‌ తీసుకోనివ్వదు గన్‌ అయినా, టేకోవర్‌ అయినా.

మీడియాతో మాట్లాడుతున్న ఆవాముర్తో

గర్ల్స్‌ ఈ లోకాన్ని టేకోవర్‌ చేయడాన్ని కాసేపు ఊహించండి. పవర్‌ ఆడవాళ్ల చేతుల్లోకి వచ్చినట్లు. జిల్లా ఎస్పీతో మొదలవుతుంది సెల్యూట్‌ కొట్టడం. డీజీపీ కొడతాడు. డిఫెన్స్‌ మినిస్టర్‌ కొడతాడు. త్రివిధ దళాలు లైన్‌గా తల ఓ పక్కకి తిప్పి నడుస్తాయి. ఒకేసారి అనేకచోట్ల ఐటీ దాడులు జరిగినట్లు దేశమంతటా ఏరివేతలు మొదలవుతాయి. గూండాలు సరెండర్‌ అవుతుంటారు. మాఫియా గ్యాంగులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాయి. ఆడవాళ్లను వేధించేవాళ్లు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని రోడ్లపై పరుగులు తీస్తుంటారు. భలే ఉంటుంది సీన్‌. పసిపాప పకపకమని నవ్వుతున్నట్లు. ఓ పదహారేళ్ల అమ్మాయి ప్రైమ్‌ మినిస్టర్‌ సీట్లో కూర్చున్నట్లు కూడా ఊహించండి.

ఆవా ముర్తో కి 16 ఏళ్లే. ఫిన్లాండ్‌ ప్రధానిగా ఒకరోజు దేశాన్ని చేతుల్లోకి తీసుకునే ఛాన్స్‌ వచ్చింది ఆ అమ్మాయికి. ఆ ఛాన్స్‌ ఇచ్చింది ఎవరంటే సనా మారిన్‌ అనే 35 ఏళ్ల అమ్మాయి. ఫిన్లాండ్‌ చరిత్రలోనే ఎంగెస్ట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌. ‘గర్ల్స్‌ టేకోవర్‌’ అని ఇప్పుడో గ్లోబల్‌ క్యాంపెయిన్‌ నడుస్తోంది. బాలికల హక్కుల్ని ప్రమోట్‌ చెయ్యడానికి. ఆవాను అందుకే తన సీట్లో కూర్చోబెట్టుకున్నారు సనా. పీఎం సీట్లో కూర్చోగానే ఆవా చెప్పిన మొదటి మాట.. అబ్బాయిలెంత ముఖ్యమో దేశానికి అమ్మాయిలూ అంతే ముఖ్యం. దేశాన్ని నడిపించేవారు ఈ సంగతి గ్రహించాలి.. అని!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top