Suraj Bhai Meena Real Story: అడవిలో ఆడపులి.. అక్కడ 80 పులులు.. అన్నింటి పేర్లు ఆమెకు తెలుసు!

Interesting Story Suraj Bhai Meena Tourist Guide In Ranthambore Tiger Reserve - Sakshi

Suraj Bhai Meena- దాదాపు 1300 చదరపు కిలోమీటర్లు ఉండే రణథమ్‌బోర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చాలా ఆడపులులు ఉన్నాయి. వాటిని చూపి ఉపాధి పొందే మగ టూరిస్ట్‌లూ ఉన్నారు. కాని వారందరి మధ్య ఇంకో ఆడపులి కూడా ఉంది. సూరజ్‌బాయి మీనా. ఆ అడవి దాపున పల్లెలో పుట్టి పెరిగిన మీనా మొదటిసారి ఆ ప్రాంతంలో మహిళా టూరిస్ట్‌గైడ్‌గా మారింది. మగవాళ్లు వద్దన్నారు. ఊరు వద్దంది. కాని ఇప్పుడు ఆమెకు వస్తున్న పేరు చూసి ఊరే మారింది. ఆడపిల్లలను ఆమెలా మారమని చెబుతోంది.

రాజస్థాన్‌లోని సవాయి మధోపూర్‌ టౌన్‌ చుట్టుపక్కల బనస్‌ నదిని చుట్టుముడుతూ ఉండే అతి పెద్ద టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ రణథమ్‌బోర్‌ 1980 ల నుంచి టూరిజంలో చురుగ్గా ఉంది. అప్పటి నుంచి ఎందరో గైడ్‌లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే టూరిస్ట్‌లను అడవిలో గైడ్‌ చేస్తూ ఉంటారు. వారికి పులిని చూపుతూ ఉంటారు. ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. అదంతా పురుషుల పనే 2007 వరకూ.

కాని ఆ సంవత్సరం మొదటిసారి ఒక మహిళా గైడ్‌ అడవిలోకి వచ్చింది. సూరజ్‌బాయి మీనా. ఆ అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు రెండురోజులు ఉండి పారిపోతుంది అనుకున్నారు. కాని ఇవాళ్టి వరకూ సూరజ్‌బాయి మీనా అక్కడ పని చేస్తూనే ఉంది. తనలాంటి మరో నలుగురు మహిళా గైడ్‌లను తయారు చేసి వారికీ ఉపాధి చూపింది. 

Tourist Guide Suraj Bhai Meena Story

పల్లె కట్టుబాటును దాటి...
సూరజ్‌బాయి మీనాది రణథమ్‌బోర్‌ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న భురి పహడి అనే కుగ్రామం. ఏడుగురు అన్నదమ్ముల్లో మీనా ఒక్కతే ఆడపిల్ల. ఆ ఊళ్లో ఎవరికీ చదువు లేదు. ఆడపిల్లలకు అసలే లేదు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల చదువుకుంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల చెప్పే చదువులో 8వ తరగతి తర్వాతే ఏబిసిడిలు నేర్పిస్తారు. అలాంటి చోటు నుంచి బయలుదేరింది మీనా. ‘మా అన్నయ్య హేమరాజ్‌ మొదట రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చేరాడు. నేను అప్పుడప్పుడు వాడితో కలిసి అడవిలోకి వచ్చేదాన్ని. అడవి నాకు చాలా నచ్చేది. నేను కూడా అన్నయ్యలాగే గైడ్‌ అవ్వాలనుకున్నాను.

కాని అది అంత సులభం కాదని నాకు తెలుసు’ అంది మీనా. తల్లిదండ్రులను ఒప్పించి టెన్త్‌ చదివిన మీనా ఒకటి రెండేళ్ల తర్వాత గైడ్‌గా మారడానికి నిశ్చయించుకుంది. కాని ఈ విషయం ఊళ్లో ఎవరికీ నచ్చలేదు. వచ్చి అందరూ ఆమె తల్లిదండ్రులను తిట్టారు. ‘ఆ ఫారిన్‌ వాళ్లు వచ్చి నిన్నేమైనా చేస్తే? వాళ్ల మధ్యన పడి నువ్వు మా పరువు తీస్తే’ అని తల్లి ఆందోళన చెందింది.

మీనా అన్నయ్యల్లో హేమరాజ్‌ తప్ప మిగిలిన వారు కూడా మద్దతు ఇవ్వలేదు. కాని హేమరాజ్‌ ఆమెకు అండగా నిలిచాడు. చెల్లెలు ఉద్యోగస్తురాలవ్వాలని ఒప్పించాడు. సవాయి మధోపూర్‌కు తీసుకెళ్లి ఫారెస్ట్‌ వాళ్ల ట్రైనింగ్‌కు అప్లికేషన్‌ పెట్టించాడు. చెల్లెలు అక్కడ ట్రైనింగ్‌ తీసుకునేందుకు ఏర్పాటు చేశాడు. అక్టోబర్‌ 2007లో మీనా తొలి మహిళా గైడ్‌గా అడవిలో ప్రవేశించింది.

పులినీ... విమర్శనూ
ఇప్పుడు మీనాకు రెండు సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి ఫారెస్ట్‌లో పని చేస్తున్న పురుష గైడ్ల సమ్మతి పొందడం. రెండు టూరిస్ట్‌లతో ఇంగ్లిష్‌ మాట్లాడటం. మీనా పనికి వచ్చిన కొత్తల్లో పురుష గైడ్లు ‘నీకిక్కడ ఏం పని?’ అన్నట్టుగా చూసేవారు. ఆమె కూడా యూనిఫామ్‌ వేసుకుని సఫారీలో టూరిస్ట్‌లను ఎక్కించుకుని అడవి చూపించడానికి బయలుదేరితే కోపంగా చూసేవారు.

ఇంకోవైపు ఫారిన్‌ టూరిస్ట్‌లకు అడవిలో చెట్ల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు ఇంగ్లిష్‌లో చెప్పాల్సి వచ్చేది. అన్న సాయంతో మీనా ఆ పేర్లన్నీ హిందీ లిపీలో రాసుకుని ఇంగ్లిష్‌ని సాధన చేసి నేర్చుకుంది. చిన్న పెద్ద వాక్యాలు పలకడం తెలుసుకుంది. ఖాళీగా ఉన్నప్పుడు అడవంతా తిరుగుతూ పక్షుల్ని గుర్తించేది. ఆమెకు సరదాగా మాట్లాడటం వచ్చు. టూరిస్ట్‌లను నవ్వించేది. క్రమంగా ఆమె అందరికీ నచ్చింది.

పులితో భేటి
రణథమ్‌బోర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఇప్పుడు 80 పులులు ఉన్నాయి. అన్నింటికీ పేర్లు ఉన్నాయి. అన్ని పులులనూ మీనా గుర్తించగలదు. ‘పులి కనిపిస్తే టూరిస్ట్‌లకు దాని పేరు చెప్తాను. అన్ని పులులు ఒక్కలాగే ఉంటాయి. దాని పేరే అదేనని నీకెలా తెలుసు అని చాలామంది టూరిస్ట్‌లు అడుగుతారు. ఏం చెప్పమంటారు’ అంటుంది. ఫారెస్ట్‌కు వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు, బర్డ్‌ వాచర్స్, ప్రకృతి ప్రేమికులు చాలామంది వస్తుంటారు.

మీనా అడవి చూపిస్తుంటుంది. ‘ఒక ఫోటోగ్రాఫర్‌ పులిని ఫోటో తీస్తూ జిప్సీ నుంచి కింద పడ్డాడు. నేను వెంటనే జిప్సీ దిగి అతనికి, పులికీ మధ్య నిలబడ్డాను. లక్కీగా అది ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంది మీనా. కొన్నిసార్లు పులి జిప్సీ బానెట్‌ మీదకు లంఘిస్తూ ఉంటుంది. కాని ఎప్పుడూ ఎలాంటి అపాయం జరగలేదు. ‘పులి కనిపించకపోతే టూరిస్ట్‌లు విసుక్కుంటారు. పులిని చూపించు అంటారు.

అది నేను రమ్మంటే రాదు కదా. అంతగా కచ్చితంగా చూడాలంటే జూకు వెళ్లండి అని చెప్తుంటాను’ అని నవ్వుతుంది మీనా. జీవితం పులిలా వెంటబడితే మనిషికి పులి కంటే ఎక్కువ ధైర్యం వస్తుంది. తన జీవితాన్ని మలుచుకోవడానికి మీనా సివంగిలా మారింది. ఇద్దరు పిల్లలు, భర్తతో ఆమె సంతోషంగా ఉంది. అన్నట్టు బి.ఇడి వరకూ చదివేసింది కూడా. కలవాలంటే ఈ వేసవిలో రణథమ్‌బోర్‌ ట్రిప్‌ వేయండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top