సేద్య కళ

An Inspirational story of Chatla Akhila - Sakshi

చదువుకుంటూ పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేసే యువత గురించి మనకు తెలుసు. అలాగే, చదువుకుంటూనే తమ అభిరుచులకు పదును పెట్టుకునేవారినీ మనం చూస్తుంటాం. అయితే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం, పెన్న బద్వేల్‌వాసి అయిన చాట్ల అఖిల మాత్రం హాస్టల్‌లో ఉండి బయోటెక్నాలజీలో డిగ్రీ చేస్తూనే, ఖాళీ సమయంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. తనకున్న ఇష్టం వల్ల సేద్యంలో రకరకాల ప్రయోగాలు సొంతంగా చేయగలుగుతున్నాను అని చెబుతున్న అఖిల తన కలనే కాదు కళను కూడా పండిస్తోంది.

‘‘మాది వ్యవసాయ కుటుంబం అవడంతో చిన్నప్పటి నుంచి ఇంటి పనులతో పా టు పొలం పనులు కూడా తెలుసు. అమ్మ పద్మ, నాన్న గురువయ్య. అమ్మానాన్నలకు అన్న, నేను సంతానం. డిగ్రీ మూడవ సంవత్సరం నెల్లూరు టౌన్‌లోనే హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాను. డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు నేనుగా స్థిరపడాలంటే ఏది ఎంచుకుంటే బాగుంటుంది అని చాలా ఆలోచించాను.

కరోనా కాలంలో రెండేళ్లు ఇంటి వద్దే ఉన్నప్పుడు ఎక్కువ సమయం పొలంలోనే గడిపేదాన్ని. అలా వ్యవసాయంలోని కష్టం, ఇష్టం రెండూ అలవాటయ్యాయి. అయితే, ఊళ్లో వ్యవసాయం చేస్తూ, కాలేజీకి వెళ్లి చదువుకోలేను. ఇంటి వద్దే ఉండి నాకు నచ్చిన రీతిలో వ్యవసాయం చేయాలంటే అందుకు అమ్మానాన్నలను ఒప్పించడం కష్టమనుకున్నాను. ‘చదువుకుంటున్నావు కదా ఎందుకింత కష్టం’ అంటారు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండానే ఎక్కడైనా కొంత భూమి కౌలుకు తీసుకోవాలని వ్యవసాయం చేయాలని, కరోనా టైమ్‌లోనే తెలిసివారి ద్వారా చాలా వెతికాను.

సాగులో లేని భూమి.. 
నేనున్న హాస్టల్‌కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లిపా డులో ఒక ఎన్‌ఆర్‌ఐ భూమి ఉందని తెలిసింది. వారి వివరాలు కనుక్కొని, ఫోన్‌లో సంప్రదించి, రెండెకరాల భూమి కౌలుకు తీసుకున్నాను. అది ఏ మాత్రం సాగులో లేని భూమి. అందుకు చాలా కష్టపడాలి. మొదట కష్టమవుతుందేమో అనుకున్నాను. కానీ, ఇష్టమైన పని కావడంతో సాగు చేయాలనే నిశ్చయించుకున్నాను. 

మట్టితో పిచికారి
భూమిని చదును చేయించాను. ఆకు కూరలు, కూరగాయల సాగు చేస్తున్నాను. సాగులో వచ్చే ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు వెదుక్కుంటూ నా ఎఫర్ట్‌ను పెడుతున్నాను. ఓ వయసుపైబడిన వ్యక్తి ఉంటే, అతనికి అవసరాలకు డబ్బు ఇచ్చి పొలానికి కాపలాకు పెట్టాను. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజులు ఈ పనికి ఎంచుకున్నాను. ఉదయం ఫార్మ్‌ దగ్గరకు వెళతాను. సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. మొక్కల ఏపుగా పెరగడానికి మట్టి ద్రావకంతో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. పెన్నానది పక్కన ఉండటంతో అక్కణ్ణుంచి మోటార్‌ ద్వారా నీటి సదుపా యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. 

తక్కువ పెట్టుబడితో..
ఇప్పుడు పా లకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, బెండ, చిక్కుడు, స్వీట్‌కార్న్, వంగ, దోస, సొరకాయ వంటివి సాగుచేస్తున్నాను. ఆకుకూరలు 15 రోజులకొకసారి కోతకు వస్తాయి. వీటన్నింటిని వాతావరణం బట్టి నా పనిలో మార్పులు చేసుకుంటాను. తెలిసినవాళ్లే వాటిని స్వయంగా వచ్చి తీసుకెళుతుంటారు. భూమిని చదును చేయించడానికి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టాను. అన్ని ఖర్చులు పోను రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. అయితే, ఈ మొత్తాన్ని కూడా భూమిలో సేంద్రీయ పద్ధతులను అమలు చేయడానికి ఖర్చు పెడుతున్నాను. 

మా ఫ్రెండ్స్‌ కూడా అప్పుడప్పుడు వచ్చి సరదాగా వర్క్‌ చేస్తుంటారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్నానని ఎవరికైనా చెబితే ‘చదువుకుంటున్నావు కదా, ఆడపిల్లవు కదా! ఎందుకంత కష్టం, ఇంకేం పని దొరకలేదా’ అని నవ్వుతున్నారు. అందుకే ఎవరికీ చెప్పడం లేదు. ఇంకొంత భూమి తీసుకుని సాగు చేయాలనేది తర్వాతి ప్లాన్‌. ‘మా భూమిలో కూడా ఇలా మట్టిని కాపా డుతూ సేద్యం చేయండి..’ అని అడిగేవాళ్లున్నారు. ఏషియన్, మిల్లెట్‌ ఫార్మింగ్‌ను పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది’’ అని వివరించింది అఖిల.

– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top