Sakshi Malik Life Story: 60 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్స్‌.. ఇంతకీ ఆమె ఏం చేస్తుంది?

Influencer Actress Sakshi Malik Inspirational Journey In Telugu

సోషల్‌ స్టార్‌

బమ్‌ డిగి డిగి బమ్‌ సాక్షిగా... 

ప్రతికూల పరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగేవారు కొందరైతే, తమ అభిరుచులను కెరియర్‌గా మలుచుకుని ఉన్నత స్థాయికి చేరి స్ఫూర్తిగా నిలుస్తుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే ప్రముఖ మోడల్‌ సాక్షి మాలిక్‌. సాంకేతిక విద్యనభ్యసించి, కార్పొరేట్‌ ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ తనకిష్టమైన ఫ్యాషన్‌  ప్రపంచంలో అడుగుపెట్టి మంచి మోడల్‌గా రాణిస్తోంది.

తన శరీర ఆకతిని ఫిట్‌గా ఉంచుకోవడమేగాక, అందంగా ఫిట్‌గా ఉండేందుకు ఏం చేయాలో చెబుతూ లక్షలాది వీక్షకులను ఆకట్టుకోవడమేగాక, తన ప్రతిభతో ఫ్యాషన్‌ , బ్యూటీ, లైఫ్‌స్టైల్‌ ఇన్‌ ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది.

ఖాన్‌పూర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో సాక్షి పుట్టింది. ఈమెకు ఒక సోదరి కూడా ఉంది. స్కూలు చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్యకోసం న్యూఢిల్లీ వెళ్లింది. అక్కడే బీటెక్‌ పూర్తిచేసింది. చిన్నప్పటినుంచి మోడలింగ్‌ అంటే బాగా ఇష్టం. దీంతో స్కూలు, కాలేజీలలో జరిగే వివిధ రకాల ఫ్యాషన్‌  షోలలో చురుకుగా పాల్గొంటుండేది. బీటెక్‌ అయ్యాక ఎమ్‌బీఏ చేద్దామనుకున్నప్పటికీ.. ఫ్యాషన్‌ పై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేక ముంబై వెళ్లి మోడల్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది.  

ఆకర్షణీయమైన రూపం, మెరిసిపోయే మేనిఛాయ, తీరైన ఆకృతితో మోడలింగ్‌ ఏజెన్సీలను సంప్రదించింది. సాక్షి రూపం నచ్చిన వారంతా మోడలింగ్‌ చేసేందుకు అవకాశాలు ఇవ్వడంతో వాణిజ్య ప్రకటనలు, సౌందర్య ఉత్పత్తుల యాడ్స్‌లో నటించింది. వీటిలో నైకా, పీసీ జ్యూవెలర్స్, ఫ్రెష్‌బుక్, అడిడాస్, ఫేసెస్‌ కెనడా వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి. హిందీ, పంజాబీ, ఇంగ్లీష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సాక్షి ఆయా భాషల్లో మోడల్‌గా విజయవంతంగా రాణిస్తోంది. 

సోనుకీ టిటు..
యాడ్స్‌లో మంచి గుర్తింపు వచ్చిన తరువాత మ్యూజిక్‌ వీడియోలలో నటించడం మొదలు పెట్టింది సాక్షి. దీనిలో భాగంగానే పంజాబీ మ్యూజిక్‌ వీడియో ‘కుడియే స్నాప్‌చాట్‌ వాలియే’ నటించింది. ఈ పాటకు ఆరు మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. దీని తరువాత 2018లో విడుదలైన బాలీవుడ్‌ సినిమా ‘‘సోను కీ టిటు కీ స్వీటీ’లో ‘బమ్‌ డిగి డిగి బమ్‌ బమ్‌’ పాటలో నటించింది. దీంతో ద్వారా సాక్షి మరింత పాపులర్‌ అయ్యింది.

ఈ ఏడాది ఎమ్‌టీవీలో ప్రసారమైన ప్రముఖ డేటింగ్‌ షో స్ప్లిట్స్‌ విల్లా13 లో ప్రముఖులతో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేగాక బిగ్‌బాస్‌ ఫేమ్‌ అసిమ్‌ రియాజ్‌తో కలిసి ‘విహం’ పాటలో నటించింది. ఈ పాట కూడా సాక్షికి మంచి పేరు తీసుకువచ్చింది. అనేక పంజాబీ మ్యూజిక్‌ వీడియోలలో నటించడంతో సోషల్‌ మీడియాలో సాక్షికి మంచి గుర్తింపు వచ్చింది.

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌..
మ్యూజిక్‌ వీడియోలు, సినిమాలతోపాటు సాక్షి తన సొంత యూట్యూబ్‌ చానల్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో యాక్టివ్‌గా ఉంటూ సోషల్‌ మీడియా మోడల్‌ క్వీన్‌ గానూ పాపులర్‌ అయ్యింది. అందమైన శరీర ఆకృతిని కాపాడుకునేందుకు జిమ్‌లో ఎటువంటి కసరత్తులు చేస్తుంది? తనలా ఫిట్‌గా అందంగా ఉండేందుకు ఏమేం తినాలి? ఎటువంటి వర్క్‌వుట్స్‌ చేయాలి... వంటి విషయాలను తన యూట్యూబ్‌ చానల్, ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌కు  చెబుతుంటుంది సాక్షి. ఆమెకు యూ ట్యూబ్‌లో యాభైవేలు, ఇన్‌స్టాగ్రామ్‌లో అరవై లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. 

అందమైన రూపం... అంతకు మించిన ఆత్మవిశ్వాసంతో మంచి నటిగా రాణిస్తూ, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ గా... మోడల్‌గా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతిభ, కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా గుర్తింపు తెచ్చుకోవచ్చని ఎందరికో సాక్షి మాలిక్‌ ఉదాహరణగా నిలుస్తోంది.  

చదవండి: Nalini Jameela: అందుకే ‘పడుపు వృత్తి’లోకి.. కానీ ఇప్పుడు ఆమె..
Padmini Govind: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి బెంగుళూరుకు వచ్చి..

  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top