రాజకీయ ఏకత్వానికి తొలి అడుగు అదే..

Indian Independence Movement Story In Funday Magazine  - Sakshi

ఈ సువిశాల భారతం ఒకే ప్రభుత్వం కింద ఉన్న కాలం చరిత్రలో తక్కువే. క్రీస్తుపూర్వమో, మధ్య యుగాలలోనో కొంతకాలం కొంతమంది మన పాలకులు మొత్తం భారతావనిని పాలించే అవకాశం దక్కించుకున్నారు. అప్పుడు కూడా కొన్ని భూభాగాలు చక్రవర్తులో, పాదుషాలో వారి అధీనంలో లేవు. అయినా యావద్భారతావనిని వారు ఏలారని అనుకోవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం భారతదేశం కోల్పోయిన ఆ అవకాశం మళ్లీ 1946లోనే వచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికనే కావచ్చు, అప్పుడే భారత దేశానికి భారతీయులతో కూడిన ప్రభుత్వం కొలువైంది. ఇది చరిత్రలో అపురూపం. రాజకీయ ఏకత్వానికి ఆధునిక యుగంలో అదే తొలి అడుగు. కొద్దినెలలే అయినా ఆ తాత్కాలిక సంకీర్ణం అఖండ భారతాన్ని పాలించిందన్న విషయం ప్రత్యేకమైనదే. కానీ రక్తపాతాల మధ్య భారత విభజన పనిని పూర్తి చేసినదీ ఆ ప్రభుత్వమే.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత తన వలస దేశాలలో యూనియన్‌ జాక్‌ను అవనతం చేయాలని ఇంగ్లండ్‌ నిర్ణయించుకుంది. ఎంత ఇష్టం లేకపోయినా అలా వదులుకోవలసిన దేశాలలో భారత్‌ మొదటిది. దీనికి తొలిమెట్టు పాలనా వ్యవహారాలలో బ్రిటిష్‌ ప్రభుత్వం పక్కకు తొలగి, జాతీయ సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడమే. బ్రిటిష్‌ ఇండియా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కావలసిందని వైస్రాయ్‌ లార్డ్‌ ఆర్చిబాల్డ్‌ వేవెల్‌ 1946 జూలై 22న భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకుడు జవహర్‌లాల్‌ నెహ్రూకు, ముస్లింలీగ్‌ నేత మహమ్మద్‌ అలీ జిన్నాకు లేఖలు రాశాడు. ఆ ప్రభుత్వంలో 14 శాఖలు ఉంటాయనీ, ఆరు కాంగ్రెస్‌కు, ఐదు లీగ్‌కు, మైనారిటీలకు మూడు వంతున ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా అదే లేఖలో వివరించాడు వేవెల్‌.

ముఖ్యమైన శాఖల విషయంలో కాంగ్రెస్, లీగ్‌ల మధ్య సమతౌల్యం పాటిస్తామనీ చెప్పాడు. కానీ ఈ ప్రతిపాదనను ఆ ఇద్దరూ నిరాకరించారు. భారత కార్యదర్శి సలహా మేరకు వేవెల్‌ ముస్లింలీగ్‌ను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 1946 ఆగస్ట్‌ 12న కాంగ్రెస్‌ను ఆహ్వానించాడు. అదే సమయంలో తన ప్రతిపాదనలు ఏమైనప్పటికీ వాటిని జిన్నాతో చర్చించే అధికారం కూడా అప్పగించాడు వేవెల్‌. నెహ్రూ జిన్నాతో చర్చించారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. మరొక పక్క మత కల్లోలాలు తీవ్రమవుతున్నాయి. నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి తప్పు చేశానేమోనని వేవెల్‌ శంకించడం మొదలుపెట్టాడు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో దేశంలో తిరుగుబాటు వస్తుందేమోనని బ్రిటిష్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ భయపడ్డాడు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా వైస్రాయ్‌ వేవెల్‌ తీసుకున్నాడు.

ఇన్ని పరిణామాల తరువాత 1946 సెప్టెంబర్‌ 2న కాంగ్రెస్‌ తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ ప్రభుత్వంలో చేరేవారిని అంతకు ముందే ఆవిర్భవించిన భారత రాజ్యాంగ పరిషత్‌ నియమించింది. భారత రాజ్యాంగ పరిషత్‌లో 389 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. ఇందులో 292 మందిని 11 ప్రావిన్సుల శాసనసభల ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారు. 93 మంది సంస్థానాల ప్రతినిధులు. మరొక నలుగురు ఢిల్లీ, అజ్మీర్‌–మార్వాడా, కూర్గ్, బ్రిటిష్‌ బలూచిస్తాన్‌ల నుంచి వచ్చిన సభ్యులు. 1946 ఆగస్ట్‌ నాటికి 11 ప్రావిన్స్‌ల చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. అంటే 292 స్థానాలు. ఇందులో కాంగ్రెస్‌ 208 స్థానాలు గెలిచింది. ముస్లింలీగ్‌ 73 స్థానాలు గెలిచింది. హిందువులు ఆధిక్యం ఉన్నచోట కాంగ్రెస్, ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట లీగ్‌ ప్రధానంగా గెలిచాయి. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనా, ముస్లిం లీగ్‌ కాంగ్రెస్‌కు సహకరించడానికి నిరాకరించింది.

చదవండి: రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఒక విస్తృత ధ్యేయాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియను సజావుగా సాగించి, అధికార బదలీని వేగవంతం చేయడానికి అది ఏర్పాటైందన్నది నిజం. బ్రిటిష్‌ ప్రభుత్వం విన్నపం మేరకు కాంగ్రెస్‌ ఇందులో చేరడానికి అంగీకరించింది. మరోవైపు ముస్లింల కోసం వేరొక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని లీగ్‌ కొత్త కోర్కెను తెర మీదకు తెచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో మెజారిటీ కాంగ్రెస్‌దే కాబట్టి, కాంగ్రెస్‌ అంటే హిందువుల సంస్థ అనే లీగ్‌ నిశ్చితాభిప్రాయం కాబట్టి లీగ్‌ ఈ గొంతెమ్మ కోర్కె కోరింది. 

తమతో కలసి పనిచేయడానికి లీగ్‌ నిరాకరించినందున పార్టీకే చెందిన 12 మందిని కాంగ్రెస్‌ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ముస్లింలు. తరువాత మనసు మార్చుకున్న ముస్లిం లీగ్‌ అక్టోబర్‌ 26న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కానీ తమ మంత్రులు నెహ్రూకు జవాబుదారీగా ఉండబోరని షరతు పెట్టింది. ముగ్గురు ముస్లిం లీగ్‌ సభ్యులకు అవకాశం కల్పించడానికి వీలుగా ముగ్గురు కాంగ్రెస్‌ వారు రాజీనామా చేశారు. వారు శరత్‌చంద్ర బోస్, సయ్యద్‌ అలీ జహీర్, షఫత్‌ అహ్మద్‌ ఖాన్‌. తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక విభాగానికి వైస్రాయ్‌ కార్యనిర్వాహక మండలి అనుబంధంగా పని చేస్తుంది.

తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా (అధ్యక్షుడు వైస్రాయ్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ ఎంపికయ్యారు. విదేశ వ్యవహారాలు, కామన్‌వెల్త్‌ శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా వల్లభ్‌భాయ్‌ పటేల్‌ (హోం, సమాచార, ప్రసార శాఖలు), బల్‌దేవ్‌ సింగ్‌ (రక్షణ), డాక్టర్‌ జాన్‌ మత్తయ్‌ (పరిశ్రమలు, రవాణా), సి. రాజాజీ (విద్య, కళలు), సిహెచ్‌ భాభా (పనులు, గనులు, విద్యుత్‌), బాబూ రాజేంద్ర ప్రసాద్‌ (ఆహారం, వ్యవసాయం), అసఫ్‌ అలీ (రైల్వే), జగ్జీవన్‌ రావ్ (కార్మిక), ముస్లిం లీగ్‌ నుంచి లియాఖత్‌ అలీ ఖాన్‌ (ఆర్థిక), టిటి చుంద్రిగర్‌ (వాణిజ్యం), అబ్దుర్‌ రబ్‌ నిష్తార్‌ (కమ్యూనికేషన్లు), గజాన్‌ఫార్‌ అలీ ఖాన్‌ (ఆరోగ్యం), జోగీంద్రనాథ్‌ మండల్‌ (న్యాయం. ఈయన తరువాత పాకిస్తాన్‌ ప్రభుత్వంలో అదే శాఖను నిర్వహించి, తరువాత భారత్‌ వచ్చారు). 

భారత్‌లో తొలిసారి భారతీయులతో ఏర్పడిన సంకీర్ణం ఏర్పాటులో గాంధీజీ పాత్ర ఏమిటి? కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నెహ్రూ ఎంపిక కావాలన్న తన ఆకాంక్షను 1946 ఏప్రిల్‌ 20న గాంధీజీ వ్యక్తం చేశారు. అప్పటికే జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎక్కడ లేని ప్రాముఖ్యం వచ్చింది. స్వతంత్ర భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడే ఎన్నికవుతాడు. నిజానికి ఆ పదవిని తాను కూడా ఆశించానని మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. కానీ ఈ ఇద్దరినీ కాకుండా 15 ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలకు గాను 12 సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను ఎన్నుకున్నాయి. మిగిలిన మూడు కమిటీలు ఓటు చేయలేదు. ఈ సంగతి స్వయంగా గాంధీజీయే నెహ్రూకు చెప్పారు.  రెండో స్థానం నెహ్రూకు ఆమోదయోగ్యం కాదనీ గాంధీయే చెప్పడంతో పటేల్‌ నెహ్రూకు అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. 

తాత్కాలిక ప్రభుత్వం 1947 ఆగస్ట్‌ 15 వరకు పనిచేసింది. గాంధీజీ కోరుకున్నట్టు నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యాంగ పరిషత్‌ 1949 నవంబర్‌ 26 నాటికి రాజ్యాంగ నిర్మాణం పూర్తి చేసింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే సంవత్సరం సర్దార్‌ పటేల్‌ కన్నుమూశారు. మరి...ఆయనను ప్రధానిని చేసి ఉంటే? 

- డా. గోపరాజు నారాయణరావు

చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్‌ నిజాలు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top