breaking news
Independence struggle
-
ఝాన్సీ లక్ష్మీబాయి: తలవాల్చిన.. తలవాల్సిన రోజు
పైన బ్రిటిష్ డేగల కళ్లు. కింద కోడిపిల్ల.. ఝాన్సీ సంస్థానం. ఏ క్షణమైనా తన్నుకుపోవచ్చు. తక్షణం ఝాన్సీకి వారసుడు కావాలి. ఆ వారసుడి చేతిలో పదునైన ఖడ్గం ఉండాలి. తన్నుకుపోవ డానికి కిందికి వాలబోతున్న డేగల కంఠాల్ని సర్రున తెగ్గొట్టేయాలి. అప్పుడే ఝాన్సీకి బతుకు. అప్పుడే ఝాన్సీ ప్రజలకు మెతుకు. వారసుడు లేడు. మణికర్ణిక వచ్చింది. మ..ణి..క..ర్ణి..క! ఆమెలా ఎవరూ ఉండరు. ఆమెలా ఎవరూ అశ్వాన్ని పరుగులు తీయించలేరు. ఆమెలా ఎవ్వరూ ఖడ్గాన్ని తిప్పలేరు. ఆమేనా వారసురాలు? ఝాన్సీని రక్షించేందుకు లేచి నిబడింది కదా. లేచి నడుము బిగించింది కదా. ఒరలోకి కత్తిని దోపుకుంది కదా. జవనాశ్వాన్ని ఎక్కింది కదా. ఖడ్గాన్ని తీసి గగనంలో నెత్తురు కక్కుతున్న ఆకలి కళ్లవైపు చూపింది కదా. అయితే వారసురాలే. ఝాన్సీ పౌరురాలు కాదు. అయినా వారసురాలే. ఝాన్సీకి ఆమె కోడలు. ఝాన్సీ సంస్థానం ఇక కోడి పిల్ల కాదు. కోడలు పిల్ల. మణికర్ణిక పేరు మారింది. లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీకి రాణి. ‘లక్ష్మీబాయి అనే నేను.. చివరి రక్తపు బొట్టు చిందేవరకు, ఝాన్సీకి అత్యంత విధేయురాలినై, ఝాన్సీ ప్రజల సేవకు ఝాన్సీ సంస్థాన రక్షణకు, సంరక్షణకు.. లక్ష్మీబాయి ప్రమాణ స్వీకారం. డేగలు కళ్లెర్ర చేశాయి. ఝాన్సీ నుంచి వెళ్లిపొమ్మని వర్తమానం పంపాయి. వెళ్లిపోవడం దేశద్రోహం. మిన్నకుండిపోవడం శత్రు శేషం. శత్రువును మిగిల్చదలచుకో లేదు లక్ష్మీబాయి. బ్రిటిష్ ఫిరంగులు ఝాన్సీలో చొరబడ్డాయి. ఝాన్సీని మరుభూమిగా మార్చివేశాయి. లక్ష్మీబాయి, ఆమె అశ్వం, ఆమె చేతిలోని ఖడ్గం.. పోరాటం ఆపలేదు. ‘‘దేశంపై ప్రేమ.. ఓటమిని అంగీకరించనివ్వదు. దేశాన్ని శత్రువుకు వదిలి పారిపోనివ్వదు’’... భర్త మాటలు గుర్తుకొచ్చాయి లక్ష్మీబాయికి. ‘‘నిన్ను ప్రేమించడాని కన్నా ముందు నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మీ’.. భర్త చివరి మాటలు గుర్తుకున్నాయి లక్ష్మీబాయ్‌కి. ‘నేనున్నా, పోయినా, నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ’’. పదిహేడవ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కల కూడా అదే. స్వరాజ్యం. ఆయన కలను కూడా ఒక కత్తిలా చేతికి తీసుకుంది లక్ష్మీబాయి. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్. శత్రుమూకల శిరస్సులు తెగి, లక్ష్మీబాయి ముఖం మీద రక్తం చింది పడుతోంది. నుదిటిపై సిందూరంలా రక్తం. కంఠంపై ఆభరణంలా రక్తం. పెదవులపై విజయహాసంలా రక్తం. లక్ష్మీబాయి గెలిచింది. కాదు.. ఝాన్సీ గెలిచింది. కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి గెలిచింది. ‘‘నీకు ఝాన్సీ కావాలి. నాకూ ఝాన్సీ కావాలి. ఒకటే తేడా. నీకు పాలన కావాలి. నాకు ప్రజలు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి. ‘‘నీకు నా శిరస్సు కావాలి, నాకూ నీ శిరస్సు కావాలి. ఒకటే తేడా. ఝాన్సీ కోట గుమ్మం ముందు వేలాడగట్టేందుకు నీకు నా శిరస్సు కావాలి. ఎవరికీ తలొంచే పని లేదని నా ప్రజలకు నేను చెప్పేందుకు నీ శిరస్సు నాకు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి. 1858 జూన్‌లో గ్వాలియర్‌లో జరిగిన ఆ యుద్ధంలో 29 ఏళ్ల వయసులో ఝాన్సీలక్ష్మీబాయి శత్రువుతో పోరాడుతూనే వీర మరణం పొందారు. నేడు (జూన్ 18) ఆమె మరణించిన రోజు. -
మన తొలి ప్రభుత్వం అలా ఏర్పడింది.. ఆయన ప్రధానైతే కథ వేరేలా.. !
ఈ సువిశాల భారతం ఒకే ప్రభుత్వం కింద ఉన్న కాలం చరిత్రలో తక్కువే. క్రీస్తుపూర్వమో, మధ్య యుగాలలోనో కొంతకాలం కొంతమంది మన పాలకులు మొత్తం భారతావనిని పాలించే అవకాశం దక్కించుకున్నారు. అప్పుడు కూడా కొన్ని భూభాగాలు చక్రవర్తులో, పాదుషాలో వారి అధీనంలో లేవు. అయినా యావద్భారతావనిని వారు ఏలారని అనుకోవచ్చు. కొన్ని శతాబ్దాల క్రితం భారతదేశం కోల్పోయిన ఆ అవకాశం మళ్లీ 1946లోనే వచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికనే కావచ్చు, అప్పుడే భారత దేశానికి భారతీయులతో కూడిన ప్రభుత్వం కొలువైంది. ఇది చరిత్రలో అపురూపం. రాజకీయ ఏకత్వానికి ఆధునిక యుగంలో అదే తొలి అడుగు. కొద్దినెలలే అయినా ఆ తాత్కాలిక సంకీర్ణం అఖండ భారతాన్ని పాలించిందన్న విషయం ప్రత్యేకమైనదే. కానీ రక్తపాతాల మధ్య భారత విభజన పనిని పూర్తి చేసినదీ ఆ ప్రభుత్వమే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తన వలస దేశాలలో యూనియన్ జాక్‌ను అవనతం చేయాలని ఇంగ్లండ్ నిర్ణయించుకుంది. ఎంత ఇష్టం లేకపోయినా అలా వదులుకోవలసిన దేశాలలో భారత్ మొదటిది. దీనికి తొలిమెట్టు పాలనా వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వం పక్కకు తొలగి, జాతీయ సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడమే. బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములు కావలసిందని వైస్రాయ్ లార్డ్ ఆర్చిబాల్డ్ వేవెల్ 1946 జూలై 22న భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూకు, ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు లేఖలు రాశాడు. ఆ ప్రభుత్వంలో 14 శాఖలు ఉంటాయనీ, ఆరు కాంగ్రెస్‌కు, ఐదు లీగ్‌కు, మైనారిటీలకు మూడు వంతున ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా అదే లేఖలో వివరించాడు వేవెల్. ముఖ్యమైన శాఖల విషయంలో కాంగ్రెస్, లీగ్‌ల మధ్య సమతౌల్యం పాటిస్తామనీ చెప్పాడు. కానీ ఈ ప్రతిపాదనను ఆ ఇద్దరూ నిరాకరించారు. భారత కార్యదర్శి సలహా మేరకు వేవెల్ ముస్లింలీగ్‌ను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 1946 ఆగస్ట్ 12న కాంగ్రెస్‌ను ఆహ్వానించాడు. అదే సమయంలో తన ప్రతిపాదనలు ఏమైనప్పటికీ వాటిని జిన్నాతో చర్చించే అధికారం కూడా అప్పగించాడు వేవెల్. నెహ్రూ జిన్నాతో చర్చించారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. మరొక పక్క మత కల్లోలాలు తీవ్రమవుతున్నాయి. నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి తప్పు చేశానేమోనని వేవెల్ శంకించడం మొదలుపెట్టాడు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో దేశంలో తిరుగుబాటు వస్తుందేమోనని బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ భయపడ్డాడు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా వైస్రాయ్ వేవెల్ తీసుకున్నాడు. ఇన్ని పరిణామాల తరువాత 1946 సెప్టెంబర్ 2న కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఈ ప్రభుత్వంలో చేరేవారిని అంతకు ముందే ఆవిర్భవించిన భారత రాజ్యాంగ పరిషత్ నియమించింది. భారత రాజ్యాంగ పరిషత్‌లో 389 మంది సభ్యులకు అవకాశం కల్పించారు. ఇందులో 292 మందిని 11 ప్రావిన్సుల శాసనసభల ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారు. 93 మంది సంస్థానాల ప్రతినిధులు. మరొక నలుగురు ఢిల్లీ, అజ్మీర్–మార్వాడా, కూర్గ్, బ్రిటిష్ బలూచిస్తాన్ల నుంచి వచ్చిన సభ్యులు. 1946 ఆగస్ట్ నాటికి 11 ప్రావిన్స్‌ల చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. అంటే 292 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ 208 స్థానాలు గెలిచింది. ముస్లింలీగ్ 73 స్థానాలు గెలిచింది. హిందువులు ఆధిక్యం ఉన్నచోట కాంగ్రెస్, ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట లీగ్ ప్రధానంగా గెలిచాయి. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైనా, ముస్లిం లీగ్ కాంగ్రెస్‌కు సహకరించడానికి నిరాకరించింది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఒక విస్తృత ధ్యేయాన్ని నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. విభజన ప్రక్రియను సజావుగా సాగించి, అధికార బదలీని వేగవంతం చేయడానికి అది ఏర్పాటైందన్నది నిజం. బ్రిటిష్ ప్రభుత్వం విన్నపం మేరకు కాంగ్రెస్ ఇందులో చేరడానికి అంగీకరించింది. మరోవైపు ముస్లింల కోసం వేరొక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని లీగ్ కొత్త కోర్కెను తెర మీదకు తెచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో మెజారిటీ కాంగ్రెస్‌దే కాబట్టి, కాంగ్రెస్ అంటే హిందువుల సంస్థ అనే లీగ్ నిశ్చితాభిప్రాయం కాబట్టి లీగ్ ఈ గొంతెమ్మ కోర్కె కోరింది. తమతో కలసి పనిచేయడానికి లీగ్ నిరాకరించినందున పార్టీకే చెందిన 12 మందిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ముస్లింలు. తరువాత మనసు మార్చుకున్న ముస్లిం లీగ్ అక్టోబర్ 26న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కానీ తమ మంత్రులు నెహ్రూకు జవాబుదారీగా ఉండబోరని షరతు పెట్టింది. ముగ్గురు ముస్లిం లీగ్ సభ్యులకు అవకాశం కల్పించడానికి వీలుగా ముగ్గురు కాంగ్రెస్ వారు రాజీనామా చేశారు. వారు శరత్చంద్ర బోస్, సయ్యద్ అలీ జహీర్, షఫత్ అహ్మద్ ఖాన్. తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక విభాగానికి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి అనుబంధంగా పని చేస్తుంది. తాత్కాలిక ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా (అధ్యక్షుడు వైస్రాయ్), జవహర్లాల్ నెహ్రూ ఎంపికయ్యారు. విదేశ వ్యవహారాలు, కామన్వెల్త్ శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంకా వల్లభ్‌భాయ్ పటేల్ (హోం, సమాచార, ప్రసార శాఖలు), బల్దేవ్ సింగ్ (రక్షణ), డాక్టర్ జాన్ మత్తయ్ (పరిశ్రమలు, రవాణా), సి. రాజాజీ (విద్య, కళలు), సిహెచ్ భాభా (పనులు, గనులు, విద్యుత్), బాబూ రాజేంద్ర ప్రసాద్ (ఆహారం, వ్యవసాయం), అసఫ్ అలీ (రైల్వే), జగ్జీవన్ రావ్ (కార్మిక), ముస్లిం లీగ్ నుంచి లియాఖత్ అలీ ఖాన్ (ఆర్థిక), టిటి చుంద్రిగర్ (వాణిజ్యం), అబ్దుర్ రబ్ నిష్తార్ (కమ్యూనికేషన్లు), గజాన్ఫార్ అలీ ఖాన్ (ఆరోగ్యం), జోగీంద్రనాథ్ మండల్ (న్యాయం. ఈయన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వంలో అదే శాఖను నిర్వహించి, తరువాత భారత్ వచ్చారు). భారత్‌లో తొలిసారి భారతీయులతో ఏర్పడిన సంకీర్ణం ఏర్పాటులో గాంధీజీ పాత్ర ఏమిటి? కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నెహ్రూ ఎంపిక కావాలన్న తన ఆకాంక్షను 1946 ఏప్రిల్ 20న గాంధీజీ వ్యక్తం చేశారు. అప్పటికే జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎక్కడ లేని ప్రాముఖ్యం వచ్చింది. స్వతంత్ర భారతదేశ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడే ఎన్నికవుతాడు. నిజానికి ఆ పదవిని తాను కూడా ఆశించానని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. కానీ ఈ ఇద్దరినీ కాకుండా 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు గాను 12 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను ఎన్నుకున్నాయి. మిగిలిన మూడు కమిటీలు ఓటు చేయలేదు. ఈ సంగతి స్వయంగా గాంధీజీయే నెహ్రూకు చెప్పారు. రెండో స్థానం నెహ్రూకు ఆమోదయోగ్యం కాదనీ గాంధీయే చెప్పడంతో పటేల్ నెహ్రూకు అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం 1947 ఆగస్ట్ 15 వరకు పనిచేసింది. గాంధీజీ కోరుకున్నట్టు నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ నిర్మాణం పూర్తి చేసింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే సంవత్సరం సర్దార్ పటేల్ కన్నుమూశారు. మరి...ఆయనను ప్రధానిని చేసి ఉంటే? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
కవర్ స్టోరీ : జై భీమ్..
అట్టడుగు కులంలో జన్మించాడు. పసితనంలో తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చవి చూశాడు. అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నాడు. అంతమాత్రాన కుంగిపోలేదు. తనలో తానే కుమిలిపోలేదు. దుర్భర పరిస్థితులకు ఎదురీదుతూనే విదేశాల్లో ఉన్నత చదువులు చదివాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్య్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు. తన సాటి దళితులు తలెత్తుకుని బతికేలా చేసేందుకు అహరహం కృషి చేశాడు. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించాడు. ఆయనే అంబేద్కర్. దళితుల ఆత్మగౌరవ ప్రతీక. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, ఆయన చెప్పిన మాటలను మననం చేసుకుందాం... ‘‘మనం పోరాడితే తప్ప ఏదీ లభించదు. ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. స్వయం సహాయంతో ముందుకు సాగాలి. మనం తక్కువ వాళ్లం అనే భావన వదిలిపెట్టి సమాజంలోని ఇతర వర్ణాల వారితో సమాన హోదాతో జీవించడానికి ప్రయత్నించండి. మీ అలవాట్లను మార్చుకుని అందరిలా ఆత్మగౌరవంతో బతకండి’’.. మహారాష్ట్రలోని మహద్ గ్రామంలో 1927 మార్చి 19న జరిగిన దళిత మహాసభలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ అన్న మాటలివి. అలాగని ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రసంగించిన మరునాడే దళితుల మానవ హక్కులను అమలుపరచడానికి కార్యరంగంలోకి దిగారు. వందలాది మంది దళితులతో ఊరేగింపుగా ఆ ఊళ్లోని సవర్ణులు వాడుకునే చౌదర్ చెరువుకు వెళ్లి, అందులోని నీటిని దోసిలి పట్టి తాగారు. ఆయన అనుచరులందరూ ఆయననే అనుసరిస్తూ ఆ చెరువు నీటిని తాగారు. తరతరాలుగా నిమ్నజాతులలో పాతుకుపోయిన నిరాశా నిస్పృహలను పటాపంచలు చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సంఘటన అది. నిజానికి మహద్‌లోని చౌదర్ చెరువును అన్ని కులాల వారూ ఉపయోగించవచ్చునని మునిసిపాలిటీ 1924లోనే ప్రకటించింది. అయినా అగ్రవర్ణాల వారికి భయపడి అక్కడి దళితులెవరూ ఆ చెరువు జోలికి పోయేందుకు సాహసించలేదు. చెరువు సంగతి తేల్చుకోవడానికే అక్కడ మహాసభలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆ మహాసభలలో పాల్గొని, దళితుల్లో స్ఫూర్తి నింపారు. వారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపారు. ఆయన చొరవతోనే మహద్‌లోని దళితులకు చెరువు నీళ్లను వాడుకునే హక్కు దక్కింది. అంబేద్కర్‌లోని ఈ పోరాట పటిమకు నేపథ్యం ఆయన బాల్యం, ఆయన ఎదుగుదలలోనే ఉంది. తండ్రి నుంచి స్ఫూర్తి అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావు రామ్‌జీ అంబేద్కర్. ఆయన తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్. తల్లి భీమాబాయి. అప్పటి సెంట్రల్ ప్రావిన్స్‌లోని (ఇప్పటి మధ్యప్రదేశ్) మహు గ్రామంలో 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టారు. మహులో బ్రిటిష్ సైనిక స్థావరం ఉండేది. అంబేద్కర్ తండ్రి రామ్‌జీ బ్రిటిష్ సైన్యంలో సుబేదారుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. రామ్‌జీ, భీమాబాయి దంపతులకు పద్నాలుగు మంది సంతానం. రామ్‌జీ పూర్వీకులు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్గడ్కు ఐదు మైళ్ల దూరంలో ఉన్న అంబావాడే రామ్‌జీ వంశీయుల స్వగ్రామం. ఆ ఊరి పేరు మీదే ఆ కుటుంబానికి అంబేద్కర్ అనే ఇంటి పేరు వచ్చింది. రామ్‌జీ సక్పాల్ మహర్ కులానికి చెందినవారు. దళితుల్లో మహర్లు కొంత సాహసవంతులు. ఈస్టిండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో అందులో చేరిన వారు మహర్లే. రామ్‌జీ కుటుంబ సభ్యులు కబీరు బోధించిన భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేది. భక్తి సంప్రదాయానికి చెందిన ప్రవక్తలు కులభేదాలను పాటించలేదు. ఈ కారణంగానే నాటి దళితుల్లో చాలామంది భక్తి సంప్రదాయానికి ఆకర్షితులయ్యారు. అంబేద్కర్ తల్లి భీమాబాయి తండ్రి, ఆరుగురు పినతండ్రులు కూడా సైన్యంలో సుబేదార్లుగా పనిచేసిన వారే. భీమాబాయి తరఫు వారు ముర్బాద్ ప్రాంతంలో సంపన్నుల కిందే లెక్క. వారిది కూడా కబీరు భక్తి సంప్రదాయమే. రామ్‌జీ ఉద్యోగ విరమణ చేసే నాటికి అంబేద్కర్‌కు రెండేళ్లు మాత్రమే. ఉద్యోగ విరమణ తర్వాత రామ్‌జీ కుటుంబంతో దాపోలీకి చేరుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం లేరు. సతారాలో వేరే ఉద్యోగం వెదుక్కుని అక్కడకు చేరుకున్నారు. తల్లి పోయే నాటికి అంబేద్కర్‌కు ఆరేళ్లు. రామ్‌జీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజ చేసేవారు. పిల్లలకు రామాయణ, మహాభారత గాథలను, మహాపురుషుల చరిత్రలను, వీరగాథలను కథలుగా చెప్పేవారు. తుకారాం, ముక్తేశ్వర్, మొరోపంత్ల కీర్తనలను పిల్లల చేత పాడించేవారు. రామ్‌జీ ఒక మిలిటరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేశారు. మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో ఆయనకు చక్కని ప్రావీణ్యం, అనువాద నైపుణ్యం ఉండేవి. తండ్రి శిక్షణలోనే అంబేద్కర్ అనువాదంలో మంచి ప్రావీణ్యం సాధించారు. రామ్‌జీకి దళితుల దుస్థితిపై స్పష్టమైన అవగాహన ఉండేది. దళితులను ఆ దుస్థితి నుంచి బయటపడేయడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు చేశారు. అంటరానితనం వల్ల దళితులు ఎదుర్కొంటున్న వివక్షను ఆయన బొంబాయి గవర్నర్‌ను కలుసుకుని వివరించారు. దళితుల స్థితిగతులను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పట్లో మహర్లను సైన్యంలోకి తీసుకోరాదంటూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. వివక్షాపూరితమైన ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని రామ్‌జీ ప్రభుత్వానికి అర్జీ రాశారు. తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితోనే అంబేద్కర్ దళితుల స్థితిగతులను మెరుగుపరచడానికి తుదివరకు పోరాటం సాగించారు. బాల్యంలో చేదు అనుభవాలు అంబేద్కర్ తండ్రి రామ్‌జీ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు. చివరకు సతారాలోని ఒక ఉపాధ్యాయుడు వారిని తన క్లాసుకు రానిస్తానని ఒప్పుకున్నాడు. దాంతో రామ్‌జీ తన కుటుంబాన్ని సతారాకు తరలించారు. అంబేద్కర్, ఆయన అన్న ఆనందరావు సతారాలోని స్కూల్లో చేరారు. క్లాసులో ఒక మూలగా గోనెగుడ్డలు పరుచుకుని కూర్చునేవారు. తోటి పిల్లలు వీరితో మాట్లాడేవారు కాదు. ఉపా«ధ్యాయులు వీరిని ప్రశ్నలు అడిగేవారు కాదు. నోట్సులు దిద్దేవారు కాదు. స్కూల్లో దాహం వేస్తే సైగ చెయ్యాలి. ఎవరైనా దయతలచి దూరం నుంచే నీరు ఎత్తి పోసేవారు. అంటరానితనంలోని అమానుషత్వం అప్పుడే అంబేద్కర్‌కు అర్థమైంది. అలాంటి రోజుల్లోనే అంబేద్కర్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. స్కూల్‌కు వేసవి సెలవులు ఇచ్చారు. గోరేగాంవ్‌లో ఉన్న తండ్రి దగ్గరకు అంబేద్కర్, అతని అన్న, మేనల్లుడు బయలుదేరారు. వీరి రాక గురించిన సమాచారం అందకపోవడంతో రామ్‌జీ స్టేషన్‌కు రాలేదు. చాలాసేపు ఎదురు చూసి, ఇక లాభంలేకపోవడంతో స్టేషన్ మాస్టర్ సాయంతో ఎడ్లబండిని మాట్లాడుకున్నారు. బండి కొంత దూరం పోయిందో లేదో బండివానికి వీరు అంటరానివారని తెలిసింది. వెంటనే అతను బండి ఆపేసి, బండీ ఎద్దులూ మైలపడిపోయాయని కేకలు వేస్తూ వీరిని బయటకు విసిరేశాడు. బయట ఎండ మండిపోతోంది. అప్పటికే పిల్లలు ముగ్గురూ బాగా అలసిపోయి ఉన్నారు. అంబేద్కర్ అన్న రెట్టింపు బాడుగ చెల్లిస్తామని ఆశపెట్టడంతో బండివాడు శాంతించాడు. అయితే, బండిని తాను తోలనన్నాడు. అంబేద్కర్ అన్న బండి తోలుతుంటే, పిల్లలిద్దరూ వెనుక కూర్చున్నారు. బండివాడు నడుచుకుంటూ బండిని అనుసరించాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్నా తోవలో వాళ్లకు ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఎవరిని అడిగినా నీళ్లు లేవనేవారు. పక్కనే ఉన్న మురికి కాలువలోని నీళ్లు తాగమనేవారు. అంబేద్కర్ పసి మనసుపై ఈ సంఘటన బాగానే ప్రభావం చూపింది. అంబేద్కర్ జీవితంలో ఇలాంటి చాలా సంఘటనలే ఎదురయ్యాయి. ఆదరించిన ఉపాధ్యాయుడు బాల్యం నుంచి అంబేద్కర్‌లో సాహస ప్రవృత్తి ఎక్కువ. ఒకసారి చలిగాలులతో భోరున వర్షం కురుస్తోంది. గొడుగు లేకుండా స్కూలుకు వెళ్లాలని పందెం వేశారు తోటి పిల్లలు. అంతే, అంబేద్కర్ తన పుస్తకాల సంచి, గొడుగు అన్న చేతికి ఇచ్చి, తాను వర్షంలో తడుసుకుంటూనే స్కూలుకు బయలుదేరాడు. స్కూలుకు చేరే సరికి చిత్తుగా తడిసిపోయాడు. తల మీద నుంచి నీళ్లు కారుతున్నాయి. క్లాసు టీచరైన పెండ్సే అంబేద్కర్ పరిస్థితి చూసి చలించిపోయాడు. బ్రాహ్మణుడే అయినా ఆయన కాస్త మంచివాడు. వెంటనే తన కొడుకుని పిలిచి, అంబేద్కర్‌ను తమ ఇంటికి తీసుకెళ్లి వేణ్నీళ్ల స్నానం చేయించి, తడి బట్టలు ఆరవేసి, పొడిబట్టలు ఇవ్వమని చెప్పాడు. ఆ ఉపాధ్యాయుని ఆదరణను, తనపై చూపిన ఆప్యాయతను అంబేద్కర్ ఎప్పుడూ మరువలేదు. అంబేద్కర్‌పై ఆ ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. స్కూలు రికార్డుల్లో భీమ్‌రావుగా ఉన్న పేరును భీమ్రావు అంబేద్కర్గా నమోదు చేసిన ఉపాధ్యాయుడు ఆయనే. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూనే, కొందరు దయామయుల సహాయ సహకారాలతో అంబేద్కర్ 1907లో మెట్రిక్ పూర్తి చేశాడు. అంబేద్కర్ మెట్రిక్ ఉత్తీర్ణుడవడంతో అతని కులం వారంతా సంతోషించారు. ప్రముఖ సంఘ సంస్కర్త ఎస్.కె.బోలే అధ్యక్షతన సన్మాన సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న ప్రసిద్ధ మరాఠీ రచయిత, సంస్కర్త కృష్ణాజీ అర్జున్ తాను రచించిన ‘గౌతమబుద్ధ చరిత్ర’ను అంబేద్కర్‌కు బహూకరించారు. బుద్ధుని సామాజిక ధర్మం ఆ వయసులోనే అంబేద్కర్‌కు అవగతమైంది. ఉన్నత విద్యా ప్రస్థానం మెట్రిక్ పూర్తయిన కొద్ది రోజులకే అంబేద్కర్‌కు పెళ్లి జరిగింది. బాల్య వివాహాలు జరిగే ఆ కాలంలో తొమ్మిదేళ్ల రమాబాయితో ఆయన పెళ్లి జరిగింది. ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చేరాడు. అనారోగ్యం కారణంగా ఒక ఏడాది చదువుకు ఆటంకం కలిగింది. అదే సమయంలో తండ్రి రామ్‌జీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అంబేద్కర్ చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కేలూస్కర్ బాసటగా నిలిచాడు. అంబేద్కర్‌ను బరోడా మహారాజు దగ్గరకు తీసుకుపోయాడు. ‘అర్హులైన నిమ్నజాతీయులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాను’ అంటూ బొంబాయి సమావేశంలో ఆయన అన్న మాటలను గుర్తు చేస్తూ, అంబేద్కర్‌ను పరిచయం చేశాడు. బరోడా మహారాజు వెంటనే అంబేద్కర్‌కు నెలకు పాతిక రూపాయల ఉపకార వేతనాన్ని ఏర్పాటు చేశాడు. అంబేద్కర్ 1912లో బీఏ పూర్తి చేశాక కొంతకాలం బరోడా సంస్థానంలో ఉద్యోగం చేశాడు. బరోడా మహారాజు ఆర్థిక సాయంతో అమెరికాలోని కొలంబియా వర్సిటీలో చేరాడు. స్వదేశానికి వచ్చాక బరోడా సంస్థానంలో పదేళ్లు ఉద్యోగం చేయాలనే షరతులపై బరోడా మహారాజు అంబేద్కర్‌కు ఆర్థిక సాయం చేశారు. కొలంబియా వర్సిటీ నుంచి అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, డాక్టరేట్ పూర్తి చేశారు. అమెరికాలో చదువు పూర్తయ్యాక 1917లో అంబేద్కర్ తిరిగి భారత్ చేరుకున్నాడు. బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా చేరారు. ఒక దళితుడు విదేశాల్లో చదువుకుని ఉన్నత ఉద్యోగంలో చేరడాన్ని సంస్థానంలోని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. కింది ఉద్యోగులు సైతం ఫైళ్లను ఆయన బల్లపై ఎత్తి వేసేవారు. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ ఎక్కువ సమయం సంస్థాన గ్రంథాలయంలో గడిపేవారు. అదేకాలంలో కొల్హాపూర్ మహారాజు సాహూ మహారాజు అస్పృశ్యత నిర్మూలన కోసం కృషి సాగిస్తుండేవారు. ఆయన ఆధ్వర్యంలోని ‘మూక నాయక్’ పక్షపత్రికకు అంబేద్కర్ సంపాదకత్వం వహించేవారు. సాహు మహారాజు అంబేద్కర్ తిరిగి విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక సాయం చేశారు. ఆయన సాయంతో విదేశాలకు వెళ్లిన అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా ఎంఏ, డీఎస్సీ పూర్తి చేశారు. లండన్‌లో బార్ ఎట్ లా పూర్తి చేశాడు. కొలంబియా వర్సిటీ నుంచి ఎల్ఎల్డీ పట్టా సాధించి, తిరిగి స్వదేశానికి వచ్చారు. కులవివక్షపై పోరాటం స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంబేద్కర్ కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆయన 1927లో ‘బహిష్కృత భారతి’ అనే మరాఠీ పక్షపత్రికను ప్రారంభించారు. అందులోని ఒక వ్యాసంలో ‘‘తిలక్ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేవాడు కాదు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, జన్మహక్కు అని ప్రకటించి ఉండేవాడు’’ అని రాశారు. అప్పట్లో భారత జాతీయ కాంగ్రెస్ సాగించే జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ అస్పృశ్యతా నిర్మూలన కోసం సాగించిన కృషికి నాటి కాంగ్రెస్ నేతల నుంచి పూర్తి మద్దతు ఉండేది కాదు. గాంధీ దళితులను చూసిన కోణం వేరు. ఆయన వర్ణ వ్యవస్థను వ్యతిరేకించలేదు. వర్ణ వ్యవస్థ భారత దేశానికి గల ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉందని సమర్థించారు. అయితే, అంటరానివారుగా ఉన్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజం బాగు కోసం తమ వృత్తులను చేస్తున్నారని, అలాంటి వారిని ఇతర వర్ణాల వారందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయంగా అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్ర పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారు. రాజ్యాంగ సవరణలకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం 1930, 31, 32 సంవత్సరాలలో నిర్వహించిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ అంబేద్కర్ పాల్గొన్నారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీ కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యారు. ఆ సమావేశంలోనే గాంధీకి, అంబేద్కర్‌కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ పట్టుబడితే, అలా చేయడం వల్ల హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందంటూ గాంధీ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గాంధీ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత 1932లో రామ్సే మెక్‌డొనాల్డ్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదిస్తూ ‘కమ్యూనల్ అవార్డు’ను ప్రకటించాడు. అప్పటికి ఎరవాడ జైలులో ఉన్న గాంధీ, ఈ ప్రకటన తెలిసిన వెంటనే జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనివల్ల అంబేద్కర్‌పై నైతిక ఒత్తిడి పెరగడంతో ఆయన గాంధీతో పూనా ఒప్పందానికి సిద్ధపడ్డారు. ఉమ్మడి నియోజకవర్గాల్లో ‘కమ్యూనల్ అవార్డు’ కంటే ఎక్కువ స్థానాలను దళితులకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. గాంధీ అంటరానితనం నిర్మూలన కోసం చేపట్టిన ఉద్యమంలో అంబేద్కర్‌ను భాగస్వామిగా చేసినా, గాంధీ విధానాలతో పొసగక అంబేద్కర్ బయటకు వచ్చేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ వంటి సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. అదే కాలంలో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత దేశానికి విభజనతో కూడిన స్వాతంత్య్రం వచ్చాయి. అంబేద్కర్ సూక్తులు ►మనిషికీ మనిషికీ మధ్యనున్న అసమానత్వమే అన్ని బాధలకూ మూలం. ►గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సద్వర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి. ►పుసక్తాలు దీపాల వంటివి. వాటిలోని వెలుతురు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. ►కేవలం పుస్తకాలను చదివి వదిలేస్తే ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్లేనా? ►కులం పునాదుల మీద దేనినీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు. ►రాజ్యాంగం దుర్వినియోగమైనట్లు తెలిస్తే, దానిని తగులబెట్టే తొలి వ్యక్తిని నేనే. ►మేధస్సుకు పదును పెట్టడమే మనిషి అస్తిత్వానికి పరమార్థం. ►స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్నే నేను ఇష్టపడతారు. ►సామాజిక స్వేచ్ఛను సాధించనంత వరకు చట్టం కల్పించిన స్వేచ్ఛ మీకు అందదు. ►రాజకీయ నియంతృత్వాన్ని సామాజిక నియంతృత్వంతో పోల్చలేం. ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయవేత్త కంటే, సమాజాన్ని ఎదిరించే సంస్కర్తే ధైర్యశాలి. ►ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోదలచిన వారు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఎంతటి మహాత్ముల వద్దనైనా వదులుకోరాదు. ►ఒక వర్గాన్ని మరో వర్గంపైకి ఉసిగొలిపే ధోరణి ప్రమాదకరం. ►నా దేశ సమస్యలకు, నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ తలెత్తితే, ముందు నేను నా జాతి సమస్యలకే ప్రాధాన్యమిస్తాను. ►దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. ►నీ కోసం జీవిస్తే, నీలోనే మిగిలిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ► మండిన కొవ్వొత్తి మనది కానట్లే, గడిచిన కాలమూ తిరిగి రాదు. రాజ్యాంగ రచన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మనదైన సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. రాజ్యాంగ రచన కోసం ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే, దాదాపు మొత్తం రాజ్యాంగ రచనా భారాన్ని అంబేద్కరే నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్తు సమావేశంలోఅప్పటి కేంద్ర మంత్రి టి.టి.కృష్ణమాచారి మాట్లాడుతూ, ‘‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. మిగిలిన ఒకరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యంగ రచనా భారమంతా అంబేద్కర్ ఒక్కరే మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనడంలో సందేహం లేదు.’’ అన్నారు. అంబేద్కర్ కేంద్ర తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా, 1951లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. బౌద్ధమత స్వీకారం అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి 1935లో మరణించారు. తర్వాత ఆయన తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదా కబీర్‌ను పెళ్లాడారు. జీవిత చరమాంకంలో 1956 అక్టోబర్ 14న అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. అంతకు చాలాకాలం ముందే ఆయన ‘నేను హిందువుగా పుట్టినా, హిందువుగా మాత్రం మరణించను’ అని ప్రకటించారు. బౌద్ధం ఈ దేశ సంస్కృతిలో భాగమేనని, తన మత మార్పిడి వల్ల దేశ చరిత్రకు, సంస్కృతికి ఎలాంటి భంగం కలగకుండా చూశానని చెప్పుకున్నారు. బౌద్ధం స్వీకరించిన కొద్ది కాలానికే, 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ కన్నుమూశారు. రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా, ఆర్థిక, న్యాయ నిపుణుడిగా ఆయన చేసిన నిరుపమానమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించింది. -
‘స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, జిన్నా సమానం’
అలీగఢ్: భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా మొహమ్మద్ అలీ జిన్నా కృషి చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నా పేరిట బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు, ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ జిన్నాను భారత్ ఎప్పుడూ దిగ్గజ నాయకుడిగా భావించలేదన్నారు. జిన్నా పేరిట బీజేపీ కృత్రిమ సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా అలీగఢ్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తరగతులకు హాజరుకాబోమని వారు తేల్చి చెప్పారు. -
సేమ్ టు సేమ్ 2014 మరియు 1947
1947లో దేశానికి స్వాతంత్య్రం.. ఆంగ్లేయుల ముష్కర పాలనకు చరమగీతం పలికింది 1947 సంవత్సరంలోనే. భారతీయులను బానిసలుగా మార్చిన బ్రిటిష్‌వారు దేశంలో దుష్టపాలన సాగించారు. భారతీయులకు హక్కులనేవే లేకుండా చేశారు. చట్టాలను కాలరాశారు. ఎదిరించి ప్రశ్నించిన వారిని పొట్టన పెట్టుకున్నారు. వారి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలనే సంకల్పంతో పుట్టిందే 1857 సిపాయిల తిరుగుబాటు. ఇది విఫలమైనా, దేశంలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత మహాత్మాగాంధీ, నెహ్రూ, వల్లాభాయ్‌పటేల్, సుభాష్‌చంద్రబోస్, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్.. ఇలా ఎందరో సమరయోధులు స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆంగ్లేయుల దాస్యశృంఖాల నుంచి భరతమాతను విడిపించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడారు. వారి సుదీర్ఘ పోరాటానికి దిగివచ్చిన ఆంగ్లేయులు.. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం ప్రకటించి పెట్టేబేడా సర్దుకున్నారు. అలా ఆ సంవత్సరానికి దేశ చరిత్రలో ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. రెండు ఉద్యమాల్లోనూ పాల్గొన్నా అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో.. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. 1947, 2014 క్యాలెండర్లు ఒకేలా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల అనారోగ్యానికి గురైనప్పుడు ఇక బతకనేమో అనుకున్నా. కానీ నన్ను నడిపిస్తున్న తెలంగాణ ఊపిరే నన్ను బతికించింది. నా 21వ ఏట దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే నా 88వ ఏట ప్రత్యేక తెలంగాణ కల సాకారం కాబోతోంది. - తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి ‘క్యా’లెండర్ హై... 2014 క్యాలెండర్‌ను చూసి అందరూ ‘క్యా’లెండర్ హై అని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం1947 నాటి క్యాలెండర్‌ను పోలి ఉన్న 2014 సంవత్సరంలోని తేదీలు, వారాలు చూసి సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ప్రతి ఏడాది కొత్తగా పలకరించే కొత్త సంవత్సర ఆరంభం ఈసారి గతాన్ని గుర్తు చేస్తూ ముందుకొచ్చింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సంవత్సరం క్యాలెండరే 2014లోనూ పలకరించడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. 2014లో తెలంగాణకు..! 1947లో దేశానికి విముక్తి లభిస్తే 2014లో తెలంగాణకు విమోచనం లభించనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజలు మరో స్వాతంత్య్ర సమరం సాగించారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిర్విరామ కృషిచేశారు. స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని ముందుడి పోరాడారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు అసువులు బాశారు. ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయిన తెలంగాణ ఆకాంక్ష టీఆర్ఎస్ ఆవిర్భావం మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడింది. ఊరువాడా ఏకమై తెలంగాణ కావాలంటూ గొంతెత్తి నినదించాయి. ఎందరో విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. ఉధృతంగా సాగుతున్న ఉద్యమాలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు తీర్మానం చేయించింది. రాష్ట్రపతికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును పంపించింది. రాష్ట్రపతి దానిని శాసనసభకు పంపించారు. ప్రస్తుతం అది అక్కడే ఉంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే.. రాష్ట్రం ఏర్పాటుకానుంది. ఇందుకు కొత్త సంవత్సరమే వేదిక అవబోతోంది. ఆరునూరైనా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందని తెలంగాణవాదులు గట్టిగా నమ్ముతున్నారు. అదే జరిగితే దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన 1947 సంవత్సరం లాగే 2014 కూడా తెలంగాణ చరిత్రలో నిలిచిపోనుంది.