
శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ హయగ్రీవుడిని రహస్యంగా భావించే సహస్రనామాలను తనకు ఉపదేశించమని అగస్త్య మహర్షి అభ్యర్థిస్తాడు. హయగ్రీవుడు శ్రీ లలితా సహస్రనామాలకు గల అనంత శక్తి కారణంగా దానిని యోగ్యులైన పుణ్యాత్ములకు మాత్రమే తెలియజేయ వలసి ఉంటుందని, అతనికి శ్రీ లలితా సహస్రనామ మూలాన్ని ఉపదేశిస్తాడు.
దీనికి స్వరకర్తలు వసిని మొదలైన వాగ్దేవతలు. శ్రీ లలితా దేవి ఆజ్ఞపై వసినీ మొదలైన వాక్ దేవతలు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని రచించారు. వారు రహస్య మంత్రాలతో కూడిన వేయి నామాలను కూర్చారు. శ్రీ లలితా దేవి ఆస్థానంలో మొదటి సారిగా వాక్ దేవతలు సకల దేవతలు మంత్రిణి, దండిని ఇతర శ్రీ మాత అనుచరుల సమక్షంలో ఈ సహస్రనామాన్ని పఠించారు.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం విని ముగ్ధురాలైన అమ్మ వారు తన భక్తులను అనుగ్రహించేందుకు ఈ విధముగా ప్రకటించింది ‘ఈ నామాలను ఎవరు అనుసరిస్తారో/ ఆచరిస్తారో.. ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర నామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో, వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను‘ అని. కాబట్టి ఈ స్తోత్రం అమ్మ వారి పూర్ణానుగ్రహం తప్ప మరొకటి కాదు.
శ్రీ మాత స్వయంగా చెప్పినట్లు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అన్ని రకాల సమస్యలను నయం చేసే శక్తివంతమైన పరిష్కారం.
ఈ స్తోత్రం చివరలో బ్రహ్మాండ పురాణంలో స్తోత్రం ఉనికి గురించిన ప్రకటన ఉంది. ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితా రహస్య నామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం ‘లలితోపాఖ్యానం‘లో ఉంది. ఇందులో శ్రీ లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. ఈ స్తోత్రం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో ఉన్న అమ్మవారి నామాలను అర్థం చేసుకొని వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ అనన్యమైన భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు.
మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రములు లేదా చక్రముల వద్ద శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారు ఏ విధంగా విరాజిల్లుతుంటారో వర్ణించబడి ఉంటుంది. ఈ చక్రములన్నీ మన శరీరంలోనే ఉంటాయి. అంటే అర్థము మన దేహము లోనే విభిన్న చక్రాలలో విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉంటారు.
ఇప్పుడు విద్యుత్ శక్తి వలన ఎలాగయితే మన చుట్టూ ఉన్న ఫ్యాన్ లు, లైట్ లు, ఎ.సి.లు వంటి అనేక విద్యుత్ ఉపకరణాలు పని చేస్తూ ఉంటాయో, అదే విధంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి వలన మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండ పిండ బ్రహ్మాండముతో నిండిన ఈ చరాచర జగత్తు మొత్తం నడుస్తుంది.
– డా. పి. రాకేష్
(సహజ యోగ సంస్థాపకురాలు, శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల ఆధారంగా)