ఘుమ ఘుమలాడే పనీర్‌ సమోసా, మరమరాల వడ తయారీ..

How To Make Paneer Samosa And Maramaralu Vada - Sakshi

దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక వంటకాలతో మీ ఇంటి అథిదులకు మరింత దగ్గరవ్వండి. పనీర్‌ సమోసా, మరమరాల వడ తయారీ మీ కోసం..

పనీర్‌ సమోసా

కావలసినవి:  
►మైదా పిండి – పావు కిలో
►పనీర్‌ తురుము – 2 కప్పులు
►వాము – అర టీ స్పూన్‌
►అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌
►క్యాబేజీ, క్యారెట్‌ తురుము – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున
►రెడ్‌ చిల్లీ సాస్‌ – 1 టీ స్పూన్, 
►సోయాసాస్‌ – 2 టీ స్పూన్లు
►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు
►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్‌
►పెరుగు – 1 టేబుల్‌ స్పూన్
►నీళ్లు – సరిపడా
►ఉప్పు – తగినంత

తయారీ విధానం
ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్‌ తరుగు, పనీర్‌ తురుము, రెడ్‌ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల పనీర్‌ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 

మరమరాల వడ 

కావలసిన పదార్ధాలు
►మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్‌ల్లోకి తీసుకోవాలి)
►పెరుగు – 3 టేబుల్‌ స్పూన్లు
►గోధుమ పిండి – పావు కప్పు
►మైదా పిండి – పావు కప్పు
►అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్‌ చొప్పున
►తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్‌ + గార్నిష్‌కి
►కారం – ఒకటిన్నర టీ స్పూన్,  నీళ్లు – కొన్ని
►ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా

తయారీ విధానం
ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్‌ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్‌ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్‌కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. 

చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top