ఈ సీసన్‌లో.. బెండసాగుతో అధిక దిగుబడులు!

Higher Yields With Organic Methods - Sakshi

రైతులు బెండసాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొంటున్నారు. హార్టికల్చర్‌ కన్సల్టెంట్‌ సుందరి సురేష్‌. దీనివలన భూసారంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. రసాయన ఎరువుల ఖర్చులను ఆదా చేసుకుని అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. వచ్చే వేసవి బెండ సాగుకు అనుకూలమని, పంట సాగుకు అవలంబించాల్సిన పద్ధతులు ఆయన మాటల్లోనే..

 • వాతావరణం : వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందు వలన పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడానికి అనుకూలమైనది.
 • నేలలు : సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగు నీటి సౌకర్యం గల తేలికపాటి రేగడి నేలలు అనుకూలం.
 • విత్తే సమయం : వర్షాకాలపు పంటకు జూన్‌ నుంచి జూలై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు.
 • విత్తన మోతాదు : వేసవి పంటకు ఎకరాలకు 7 నుంచి 8 కిలోల విత్తన సరిపోతుంది.
 • రకాలు : పర్భని క్రాంతి, అర్కఅనామిక, అభయ

విత్తన శుద్ధి..

 • విత్తనాలను విత్తే ముందు 12గంటలు నీటిలో నాన బెట్టాలి.
 • ఆవు మూత్రం ద్రావణంలో (1:5 నిష్పత్తిలో నీటిలో కలిపి) 30 నిమిషాలు శుద్ధి చేయాలి.
 • విత్తనశుద్ధికి 100 మి.లీ. ఆవు మూత్రం, 100 గ్రాములు ఆవు పేడ, 100 గ్రాములు గట్టుమట్టి, లేదా పుట్ట మట్టి కలిపిన నీటిలో ఒక గంట వరకు నానబెట్టి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
 • భీజామృతం లేదా అమృత జలం లేదా పంచగవ్యం ద్రావణంలో 8గంటలు నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పొలం తయారీ, విత్తే పద్ధతి..

 • నేలను 4–5 సార్లు బాగా దున్నాలి.
 • వర్షాకాలపు పంటను 60 సెం.మీ ఎడంలో బోదెలపై 30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి.
 • నేలను మళ్లుగా చేసి, వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 నుంచి 20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
 • ఒక్కో రంధ్రానికి 2–3 విత్తనాలను విత్తుకోవాలి.

పోషకాల యాజమాన్యం..

 • 10 నుంచి 15 మి.లీ. కోడిగుడ్లు, నిమ్మకాయ రసం ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దిగుబడులు పెంచవచ్చు.
 • మొక్కలు మొలిచిన 3–4 రోజుల్లో తొలిసారి 3 శాతం పంచగవ్య ద్రావణం పిచికారీ చేయాలి.
 • పూత దశకు ముందే 5 శా తం పంచగవ్య పిచికారీ చేయాలి.
 • పంట రెండు వారాల వయస్సులో 400 లీటర్ల జీవామృతం సాగు నీటిలో అందించాలి.
 • మొక్క 4–6 ఆకుల దశలో తులసీ–కలబంద కషాయం పిచికారీ చేయాలి.
 • పంటపై 2 శాతం పంచగవ్య పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి.

రక్షణ పంటలు : తోట చుట్టూ జొన్న, సజ్జ, బంతి మొక్కలను పెంచాలి.
అంతర పంటలు : పైరు మధ్యలో బంతి మొక్కలను ఎర పంటగా వేయాలి. అంతర పంటలుగా ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, క్యాప్సికం, కొత్తిమీర సాగు చేసుకోవచ్చు.
నీటియాజమాన్యం : గింజలు విత్తిన వెంటనే నీరు కట్టాలి. తరువాత 4–5 రోజులకు రెండోసారి నీరు పారించాలి. వేసవి పంటకు అయితే ప్రతి 4–5 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీరు పెట్టాలి.
దిగుబడి : 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

భూసార యాజమాన్యం ఇలా..

 • దబోల్కర్‌ పద్ధతిలో వివిధ రకాల విత్తనాలను విత్తి పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నాలి.
 • ఎకరానికి పశువుల ఎరువు 10 టన్నులు, 500 కిలోల ఘనజీవామృతం, వేప పిండి 100 కిలోలు, వేరుశనగ పిండి 32–40 కిలోలు, 2 కిలోలు అజోస్పైరిల్లం, 2 కిలోలు పాస్పోబ్యాక్టీరియా, ఆఖరి దుక్కిలో వేసి, కలియదున్నాలి.
 • ఎకరానికి 200 లీటర్ల జీవామృతం, 15 రోజుల వ్యవధిలో సాగు నీటిలో అందించాలి.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top