Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే..

Health Tips In Telugu: Eating Bananas With Milk Good Or Bad Must Read - Sakshi

అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటి పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్‌ అధికం. కాబట్టి మలబద్దకం నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాదు అరటిపండులో మాంగనీస్‌, మెగ్నీషియంతో పాటు విటమిన్‌ బీ6 ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే విటమిన్‌ సీ కూడా ఎక్కువే! 

అంతేకాదు.. యాంటి ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే, కొంతమందికి అరటిని నేరుగా తినడం ఇష్టం ఉండదు. పాలల్లో చక్కెర వేసుకుని కలపుకొని తినడం లేదంటే స్మూతీలు, షేక్‌లు తయారు చేసుకుని తాగడం చేస్తూ ఉంటారు.

ఇక పాలు తాగితే కలిగే ఆరోగ్య లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ప్రొటిన్లు, విటమిన్‌ బీ, పొటాషియం, ఫాస్పరస్‌ ఉంటాయి. 

ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా?
వీటితో పాటు ఎముకలు, కండరాల ఆరోగ్యానికి దోహదపడుతూ.. నాడీ వ్యవస్థ పని విధానాన్ని ప్రభావితం చేయగలిగే కాల్షియం కూడా ఉంటుంది. మరి, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అరటిని, పాలను కలిపి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఎన్టీటీవీ తన కథనంలో పేర్కొన్న అంశాలు మీకోసం.. డైటీషియన్‌, సైకాలజిస్ట్‌ హరీశ్‌ కుమార్‌ అభిప్రాయం ప్రకారం.. ‘‘అరటిని పాలతో కలిపి తినమని నేను సిఫార్సు చేయలేను. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. 

అయితే, ఈ రెండింటినీ విడిగా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాలు తాగిన 20 నిమిషాల తర్వాత అరటి పండు తినవచ్చు. కానీ బనానా మిల్క్‌షేక్‌లు తరచుగా తాగితే జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. నిద్రలేమి సమస్యలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు’’ అని పేర్కొన్నారు.

మరి ఈ విషయం గురించి న్యూట్రీషనిష్ట్‌, మాక్రోబయోటిక్‌ హెల్త్‌కోచ్‌ శిల్ప అరోరా ఏం చెప్పారంటే.. ‘‘బాడీ బిల్డర్లు అరటిపండు, పాలు కలిపి తీసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బరువు పెరగాలనుకున్న వాళ్లు కూడా ఈ కాంబినేషన్‌ ట్రై చేయవచ్చు. తక్షణ శక్తి లభిస్తుంది కూడా! అయితే, అస్తమా వంటి ఎలర్జీలతో బాధ పడేవారు మాత్రం ఈ రెండూ కలిపి తినవద్దు. కఫం పట్టి శ్వాస సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. 

మరి ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుర్వేదం ప్రకారం. ప్రతి ఆహారం తనదైన రుచి(రస) కలిగి ఉంటుంది. అలాగే సదరు ఆహారం తిన్న తర్వాత కలిగే ప్రభావాలు వేర్వేరు(విపాక)గా ఉంటాయి. దాని వల్ల శరీరం వేడి చేయొచ్చు లేదంటే చల్లబడనూ(వీర్య) వచ్చు. 

కొన్ని విరుద్ధ లక్షణాలు కలిగిన ఆహారాలు కలిపి తీసుకుంటే జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి వాటిలో అరటి, పాలు కూడా ఉన్నాయట. నిజానికి పండ్లతో పాలు కలపడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఈ విషయం గురించి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్‌ సూర్య భగవతి మాట్లాడుతూ.. ‘‘అరటి, పాలు కలిపి తినడం మంచిది కాదు. కొంతమందికి ఈ కాంబినేషన్‌ వాంతులు, విరేచనాలకు దారి తీయవచ్చు. ఆహారం సరిగా జీర్ణంకాదు. దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

పైన చెప్పిన విధంగా.. వేర్వేరు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటి, పాలు కలిపి తింటే వచ్చే లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి రెండూ పోషకాహారాలే.. కాబట్టి విడిగా తింటే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే, ఏ ఆహారమైనా వేర్వేరు వ్యక్తుల శరీర తత్వాలను బట్టి వేర్వేరు ప్రభావాలు చూపుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
నోట్‌: ఈ కథనం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!

చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top