నెలలు పెరిగేకొద్దీ.. తగ్గే అవకాశం ఉందా?

Gynecology Health Suggestions By Doctor Venati Shobha - Sakshi

12 వారాలకు స్కానింగ్‌ చేస్తే సర్విక్స్‌ లెంగ్త్‌ 3.4 సెంటీమీటర్లు ఉంది. ఇప్పుడు 20 వారాలకు టిఫా స్కాన్‌లో అది 3.0 సెంటీమీటర్లు ఉంది.. ఇది నెలలు పెరిగే కొద్ది ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– లక్ష్మి, గుంటూరు

గర్భాశయ ముఖద్వారాన్ని సర్విక్స్‌ అంటారు. ఇది యోని భాగంలోకి చొచ్చుకుని ఉంటుంది. సర్విక్స్‌ బయటి ద్వారాన్ని ‘ఎక్స్‌టర్నల్‌ ఆస్‌’, లోపలి ద్వారాన్ని ‘ఇంటర్నల్‌ ఆస్‌’ అంటారు. ఇంటర్నల్‌ ఆస్‌కి, ఎక్స్‌టర్నల్‌ ఆస్‌కి మధ్య ఉన్న భాగాన్ని కొలిస్తే సర్వైకల్‌ లెంగ్త్‌ వస్తుంది. సర్వికల్‌ లెంగ్త్‌ ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో 2.8 సెం.మీ–4.0 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. 2.8 సెం.మీ కంటే తక్కువ ఉన్నప్పుడు దానిని షార్ట్‌ సర్విక్స్‌ అంటారు. సాధారణంగా ఇంటర్నల్‌ ఆస్‌ మూసుకుని ఉంటుంది.

కాన్పు సమయంలో అది మెల్లగా తెరుచుకోవడం జరుగుతుంది. కొందరిలో కాన్పు సమయం కాకముందే అది కొద్దిగా తెరుచుకోవడం జరుగుతుంది. దానిని సెర్వికల్‌ ఇన్‌కాంపిటెన్స్‌ అంటారు. కొందరిలో గర్భాశయంలో లోపాలు, ఇన్ఫెక్షన్లు, శారీరక ఒత్తిడి, ఇంకా తెలియని అనేక కారణాల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి సర్విక్స్‌ లెంగ్త్‌ తగ్గుతూ వచ్చి, గర్భాశయంలో బిడ్డ పెరిగే కొద్దీ బరువును పట్టుకోలేక, ఇంటర్నల్‌ ఆస్‌ తెరుచుకుపోయి నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు మూడవ నెలలో సర్విక్స్‌ లెంగ్త్‌ 3.4 సెం.మీ. ఉంది. ఇప్పుడు ఐదవ నెలలో అది 3.0 సెం.మీ. ఉంది.

ఇక్కడ సెర్విక్స్‌ లెంగ్త్‌ పొట్టపై నుంచి చేసే అబ్డామినల్‌ స్కానింగ్‌ ద్వారా కాకుండా, యోని ద్వారా చేసే వజైనల్‌ స్కానింగ్‌ ద్వారా చూడటం వల్ల సర్విక్స్‌ లెంగ్త్‌ సరిగా తెలుస్తుంది. కొందరిలో పొట్టపై కొవ్వు ఎక్కువగా ఉండటం వంటి సమస్యల వల్ల అబ్డామినల్‌ స్కానింగ్‌లో సర్విక్స్‌ లెంగ్త్‌ తక్కువగా కనిపించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ట్రాన్స్‌ వజైనల్‌ స్కానింగ్‌ ద్వారా నిర్ధారణ చేసుకోవడం మంచిది. ఒకవేళ అందులో కూడా 3.0 సెం.మీ ఉంటే, బిడ్డ బరువు పెరిగే కొద్ది గర్భాశయ కండరాల పటిష్టతను బట్టి కొందరిలో సమస్యేమీ ఉండదు. కొందరిలో మెల్లగా తగ్గి, నెలలు నిండకుండా కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి రెండు వారాల తర్వాత మళ్లీ సర్వైకల్‌ స్కానింగ్‌ చేయించుకుని, సర్వైకల్‌ లెంగ్త్‌ తగ్గకపోతే కంగారు పడాల్సిన పనిలేదు.

కాకపోతే బరువు పనులు చేయకుండా, కూర్చుని చేసుకునే పనులు చేసుకుంటూ, పొత్తికడుపు మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవడం, మలబద్ధకం లేకుండా ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, కలయికకు దూరంగా ఉండటం, మూత్రంలో, యోనిలో ఏమైనా ఇన్ఫెక్షన్‌ కనిపిస్తే, డాక్టర్‌ సలహా మేరకు దానికి తగిన చికిత్స తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. సర్వైకల్‌ లెంగ్త్‌ ఇంకా తగ్గుతూ ఉంటే గైనకాలజిస్టు సలహా మేరకు బెడ్‌రెస్ట్, ప్రొజెస్టిరాన్‌ మాత్రలు, ఇంజెక్షన్లు, అవసరమైతే గర్భాశయ ముఖద్వారానికి కుట్లువెయ్యడం వంటి చికిత్సలు తీసుకోవచ్చు.

నాకు తామర రింగ్‌వర్మ్‌ ఇన్ఫెక్షన్‌ ఉంది. మా పాపకు రెండు నెలలు. పాపకు నా పాలు పట్టవచ్చా? దానివల్ల పాపకు కూడా ఇన్ఫెక్షన్‌ వస్తుందా?
– లక్ష్మీశాంతి, విఖాఖపట్నం
తామర లేదా రింగ్‌వర్మ్‌ అనేది శరీరంపై ట్రైకియాసిస్‌ అనే ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది. ఇది చర్మంపై ఎక్కడైనా గుండ్రంగా, కొంచెం ఎర్రగా కొంచెం కొంచెం పాకుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్‌ ఉన్నవారు ఉపయోగించే సబ్బులు, టవల్స్‌ వాడటం వల్ల, తాకడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈ ఇన్ఫెక్షన్‌ పాకుతుంది. ఇది తల్లి పాల ద్వారా పాపకు సోకదు. కాబట్టి పాపకు పాలు ఇవ్వవచ్చు.

దీనికి ఇంట్లో అందరూ యాంటీఫంగల్‌ సోప్, క్రీములు, మందులు వాడవలసి ఉంటుంది. ఇంట్లో ఎవరి టవల్స్‌ , వస్తువులు వారు విడి విడిగా పెట్టుకుని, వాడుకోవడం మంచిది. ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దీనికి సరైన మందుల కోర్సు వాడటం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, శారీరక శుభ్రత పాటించడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి.

డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top