Normal Delivery: నార్మల్‌ డెలివరీ అవ్వాలంటే!

Gynecology Counselling By Bhavana Kasu: Tips For Normal Delivery - Sakshi

నాకు తొమ్మిదో నెల. నార్మల్‌ డెలివరీ అవ్వాలని చాలా కోరికగా ఉంది. కానీ నొప్పులు ఎలా భరించాలనీ భయంగా ఉంది. ఈ మధ్య చాలామంది ‘ఎపిడ్యూరాల్‌’ తీసుకుంటున్నారు. దాని గురించి చెప్పగలరా? వేరే ఆప్షన్స్‌ ఏమున్నాయి? – రాధ, వరంగల్‌

నొప్పులు డెలివరీలో భాగమే. నొప్పిని పూర్తిగా తగ్గించి, తేలికగా డెలివరీ చేయడం కష్టం. ‘లేబర్‌ ఎనాల్జినా’ అంటే డెలివరీ టైమ్‌లో తీసుకునే నొప్పి తెలియనివ్వని మందులు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఎన్ని అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌ ఉన్నా, పాజిటివ్‌ థింకింగ్, రిలాక్సేషన్‌ టెక్నిక్స్, ప్రసవ సమయంలో కుటుంబ సభ్యుల ఆసరా అనేవి అత్యవసరం.

ఇవి ఉంటే చాలా వరకు మందులు లేకుండా లేబర్‌ పెయిన్‌ను మేనేజ్‌ చేయవచ్చు. డెలివరీ టైమ్‌లో గర్భసంచి కాంట్రాక్షన్స్‌ ఉంటాయి. ఆ నొప్పులు కింద సెర్విక్స్‌ను ఓపెన్‌ చేసి, బిడ్డ డెలివరీ కావడానికి దోహదపడతాయి. ఈ నొప్పులు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.

మీ గైనకాలజిస్ట్, అనెస్థటిస్ట్‌లతో మీ భయాల గురించి ముందే మాట్లాడుకునే అవకాశాన్ని చాలా ఆస్పత్రులు కల్పిస్తున్నాయి. యాంటీనేటల్‌ క్లాసెస్‌లో ఇవి కూలంకషంగా చర్చిస్తారు. మీకు పర్టిక్యులర్‌గా ఎలాంటి పెయిన్‌ రిలీఫ్‌ ఆప్షన్స్‌ సరైనవో విశ్లేషించి, వివరిస్తారు.

ఈ రోజుల్లో పెయిన్‌ రిలీఫ్‌ కోసం సహజ మార్గాల వైపే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఇందులో సహజ మార్గాలంటే ప్రత్యేకమైన బ్రీతింగ్‌ టెక్నిక్స్‌ను బర్తింగ్‌ క్లాసెస్‌లో నేర్పిస్తారు. వీటిలో మీ శరీరం, మనసు రిలాక్స్‌ అయ్యే పద్ధతులను చెబుతారు.

నొప్పిని తగ్గించే కొన్నిరకాల మసాజ్‌ పద్ధతులను వివరిస్తారు. కొంతమంది ఈ టెక్నిక్స్‌తో పాటు కొన్ని మందులు కూడా తీసుకుంటారు. కాబట్టి మిక్స్‌డ్‌ మెథడ్స్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్‌ను ఒక స్పెషల్‌ కోచ్‌తో గాని, మీ ఫ్యామిలీ మెంబర్‌తో గాని లేదా మీ భర్తతో గాని కలసి చేయవచ్చు.

వాటర్‌ బర్త్‌ అనేది కూడా ఒక ఆప్షన్‌. మీ ప్రెగ్నెన్సీ స్టేటస్‌ ఎలా ఉంది, హైరిస్క్‌ ఏదైనా ఉందా, కడుపులోని బిడ్డకు నిరంతర పర్యవేక్షణ అవసరమా అనేదానిపై మీ డాక్టర్‌ వాటర్‌ బర్త్‌ ఆప్షన్‌ తీసుకోవచ్చా లేదా చెబుతారు. లేబర్‌లో పొజిషన్‌ చేంజ్‌ చేయడం, వాకింగ్, యోగా, స్ట్రెచింగ్, హీటింగ్‌ ప్యాడ్, మ్యూజిక్, మెడిటేషన్‌ వంటివి కూడా బాగా పనిచేస్తాయి.

ఈ మెథడ్స్‌తో నొప్పి తగ్గనప్పుడు మెడికల్‌ మెథడ్స్‌ సూచిస్తారు. వీటిలో కొన్నిరకాల ఐవీ ఇంజెక్షన్స్, ‘ఎంటనాక్స్‌’ అనే నైట్రస్‌ ఆక్సైడ్‌ గ్యాస్‌ పీల్చుకోవడం, వెన్నులోకి ఇచ్చే ‘ఎపిడ్యూరాల్‌’ ఇంజెక్షన్‌ వంటివి ఉంటాయి. వీటిలో ఐవీ ఇంజెక్షన్స్‌ వల్ల కొంచెం ఎసిడిటీ, కళ్లుతిరగడం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. నైట్రస్‌ ఆక్సైడ్‌ అనేది ఆక్సిజన్‌తో కలిపి ఇచ్చే గ్యాస్‌.

దీనిని ఒక హ్యాండ్‌హెల్డ్‌ మాస్క్‌ ద్వారా పీల్చుకోవడం జరుగుతుంది. నొప్పులు పడుతున్నప్పుడు ఒకటి రెండు నిమిషాలు తీసుకుంటే నొప్పి తెలియదు. ఎక్కువమంది దీనినే ఎంపిక చేసుకుంటారు. ‘ఎపిడ్యూరాల్‌’ అనేది లేబర్‌ టైమ్‌లో అనుభవజ్ఞులైన అనెస్థటిస్ట్‌ వెన్నులోకి చేసే ఇంజెక్షన్‌. ఇది లేబర్‌ టైమ్‌ అంతా పనిచేస్తుంది. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఈ ఇంజెక్షన్‌లోని మందు నొప్పిని తెలిపే నరాలను బ్లాక్‌ చేస్తుంది. ఇది చేసినప్పుడు బిడ్డ గుండె కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. ఇది నొప్పిని పూర్తిగా తగ్గించదు. కొంచెం తెలుస్తూనే ఉంటుంది. మీరు ప్రసవానికి సిద్ధంగా ఉన్నప్పుడు లేబర్‌ ప్రెజర్‌ సెన్సేషన్‌ తెలియటానికి కొన్నిసార్లు ఎపిడ్యూరాల్‌ను నిలిపివేస్తారు. దీనిని తీసుకోవడం వల్ల కాన్పు కోసం కొంచెం ఎక్కువసేపు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.

అయితే నొప్పి అంటే భయం ఉండి, నార్మల్‌ డెలివరీ కోరుకునే వారికి ఈ ఇంజెక్షన్‌తో కొంత పెయిన్‌ రిలీఫ్‌ కల్పించి, నార్మల్‌ డెలివరీకి ప్రయత్నించ వచ్చు. అనెస్థీషియా ఇచ్చే ముందు దీని లాభనష్టాలను వివరంగా చెబుతారు. అంతకంటే ముందుగా జరిగే బర్తింగ్‌ క్లాసెస్‌లో మీ సందేహాలన్నింటినీ తీర్చుకోవచ్చు. 
-డా. భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌
 
చదవండి: Gynaecology- Chronic Pelvic Pain: 8 నెలలుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.. గర్భసంచి తీసేయించాలా?!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top