Gynaecology- Chronic Pelvic Pain: 8 నెలలుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.. గర్భసంచి తీసేయించాలా?!

Gynaecology Counselling By Bhavana Kasu: What Is Chronic Pelvic Pain - Sakshi

మేడం.. మా సిస్టర్‌కిప్పుడు తొమ్మిదవ నెల. హెచ్‌బి (హిమోగ్లోబిన్‌) 6 గ్రాములే ఉంది. వాంతుల వల్ల అసలు ఏమీ తినలేకపోయింది. బ్లడ్‌ ఎక్కించాలంటున్నారు డాక్టర్స్‌. మాకేమో బయట నుంచి బ్లడ్‌ తీసుకోవడం ఇష్టం లేదు. బ్లడ్‌ ఎక్కించడం నిజంగా అవసరమా? – సీహెచ్‌వీ ప్రజ్వల, కందుకూరు

బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌లో బ్లడ్‌తోపాటు బ్లడ్‌ కాంపొనెంట్స్‌నూ ఎక్కిస్తారు. దీన్ని అత్యవసర పరిస్థితుల్లోనే చేస్తారు. మీ సిస్టర్‌కు రక్తహీనత సివియర్‌గా ఉంది. బ్లడ్‌లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ అని ఉంటాయి.

శరీరానికి కావల్సిన హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో, ఆక్సిజన్, పోషకాలను సమకూర్చడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో వీటిదే ప్రధాన పాత్ర. అంతేకాదు రక్తం గడ్డకట్టడానికీ పనిచేస్తాయి. హిమోగ్లోబిన్‌ 8 కన్నా తగ్గితే అదే రక్తహీనత. దీనివల్ల అలసట, ఆయాసం, నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం, గుండెకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తవచ్చు.

తల్లికి రక్తహీనత ఉంటే దాని ప్రభావం పొట్టలోని బిడ్డ ఎదుగుదల మీదా పడుతుంది. ప్రసవమప్పుడు కూడా రక్తస్రావం వల్ల ఇబ్బందులు ఎదురై ప్రాణానికే ప్రమాదం కావచ్చు. తొమ్మిదవ నెలలో రక్తాన్ని పెంచడానికి ఎక్కువ సమయం, అవకాశం ఉండదు.

వాంతులు, ఎసిడిటీ వల్ల చాలా మంది మాత్రలు, ఐరన్‌ ఇంజెక్షన్లను తట్టుకోలేరు. సుఖ ప్రసవమైనా, సిజేరియన్‌ అయినా కొంచెం రక్తస్రావం ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి రక్తహీనతతో బాధపడుతున్న తల్లులకు ఉండదు. అందుకే హిమోగ్లోబిన్‌ పర్సంటేజ్‌ త్వరగా పెరగడానికి రక్తం ఎక్కించక తప్పదు.

తలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా వంటి అరుదైన కండిషన్స్‌ ఉన్న వారికి కొన్నిసార్లు మాత్రలు, ఇంజెక్షన్స్‌ పనిచేయవు. వాళ్లకు 8 కన్నా హిమోగ్లోబిన్‌ తగ్గితే తప్పకుండా రక్తం ఎక్కించాల్సిందే. బ్లడ్‌ బ్యాంక్‌లో బ్లడ్‌ను క్రాస్‌ మ్యాచ్‌ చేస్తారు. రక్తం ద్వారా వ్యాప్తి చెందే ఇన్‌ఫెక్షన్స్‌ వగైరాను చెక్‌ చేస్తారు. దీన్ని చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారు.. పర్యవేక్షిస్తారు.

బ్లడ్‌ ఎక్కించే పరిస్థితి ఉంటే.. ఆసుపత్రిలో చేర్చుకుని.. రియాక్షన్స్, ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా.. సోకుండా చూసుకుంటూ.. చాలా స్లోగా బ్లడ్‌ ఎక్కిస్తారు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో పెడతారు. ప్రసూతి వైద్య నిపుణులు, మత్తు డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. బ్లడ్‌ ఎక్కించాక ఐరన్‌ మాత్రలు, ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

అసలు ఈ సమస్య అంటే హిమోగ్లోబిన్‌ తగ్గకుండా గర్భధారణ తొలి నుంచే ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని .. అంటే ఆకు కూరలు, మాంసం, గుడ్లు, పళ్లు వంటివి తీసుకుంటే మంచిది. వాంతులను కంట్రోల్‌ చేయడానికి మందులు వాడాలి.

నారింజ, నిమ్మ రసాలతో ఐరన్‌ మాత్రలు వేసుకుంటే శరీరానికి ఐరన్‌ త్వరగా పడుతుంది. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్‌ టెస్ట్‌ చేయించుకోవాలి.

హెచ్‌బి శాతం తక్కువుందని తేలిన వెంటనే ట్రీట్‌మెంట్‌ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది గర్భిణీలకు 7వ నెలలోపు హిమోగ్లోబిన్‌ తగ్గితే.. ఐవీ ఐరన్‌ ఇన్‌ఫ్యూజన్‌తో హిమోగ్లోబిన్‌ పెంచొచ్చు. 9వ నెలలో అనీమియా రిస్క్‌ ఎక్కువ. అందుకే హిమోగ్లోబిన్‌ 6 శాతం ఉంటే ముందుగానే రక్తం ఎక్కించే ఆప్షన్‌ను సూచిస్తారు డాక్టర్లు.

బ్లడ్‌ డొనేషన్‌ను సామాజిక బాధ్యతగా గుర్తించాలి అందరూ. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, పిల్లలకు ఫ్రెష్‌ బ్లడ్‌ అవసరమవుతుంది. దగ్గర్లోని బ్లడ్‌ బ్యాంక్స్‌లో బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌లో పాల్గొనేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. ఆరోగ్యంగా ఉన్న యువత బ్లడ్‌ డొనేషన్‌లో పాల్గొంటే ఎంతో మంది జీవితాలను కాపాడిన వాళ్లవుతారు. 

నాకు 35 ఏళ్లు. ఎనిమిది నెలలుగా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి. ఇప్పుడు ఆ నొప్పితోపాటు లూజ్‌ మోషన్స్‌ కూడా అవుతున్నాయి. డాక్టర్‌కు చూపించుకుంటూ గర్భసంచి తీసేయాలని అంటున్నారు. దయచేసి నా సమస్య తగ్గే మార్గం చెప్పండి..
– డి. వసుధ, నిర్మల్‌

ఆరునెలల కన్నా ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి కొనసాగుతుంటే దాన్ని క్రానిక్‌ పెల్విక్‌ పెయిన్‌ అంటారు. దీనికి గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన లక్షణాలున్న వాళ్లను క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్‌ చేయాలి. ఆపరేషన్‌ వల్ల ఏ ఉపయోగం ఉండదు.

డాక్టర్‌ను సంప్రదించి.. పొత్తి కడుపులో నొప్పి ఎక్కడ.. ఎప్పుడు వస్తుంది.. ఏ పని వల్ల పెరుగుతుంది.. అని పెయిన్‌ మ్యాపింగ్‌ చేస్తారు. ఇప్పటి వరకు ఏ మందులు వాడారు, ఈ నొప్పితో యూరిన్, మోషన్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి.. మానసిక ప్రభావం వంటివన్నీ కనుక్కుంటారు. మీ రోజూవారీ జీవనశైలి,ఆహారపు అలవాట్లు, ఎక్సర్‌సైజ్‌ ప్యాటర్న్‌ చెక్‌ చేస్తారు.

పొట్ట, వెజైనా, యూరినరీ ఏరియా, నర్వ్స్‌ చెక్‌ చేస్తారు. అబ్డామిన్, పెల్విస్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. వెజైనల్‌ స్వాబ్, యూరినరీ స్వాబ్‌ తీస్తారు. కొంతమందికి అప్పర్‌/ లోయర్‌ జీటీ రేడియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ కన్సల్టేషన్‌ తీసుకుంటారు. ఈ నొప్పి వల్ల పీరియడ్స్‌ టైమ్‌లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో కరెక్ట్‌గా చెప్పాలి.

పొట్టకు సంబంధించి ఇంతకు ముందు ఏవైనా ఆపరేషన్స్‌ అయినట్టయితే నర్వ్‌ ఎన్‌ట్రాప్‌మెంట్‌ అనే కండిషన్‌ వల్ల నొప్పి వస్తుంది. దానికి సరైన చికిత్స తీసుకుంటే పొత్తి కడుపులో నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. పీరియడ్స్‌లో కూడా చేంజ్‌ వచ్చినట్టయితే మాత్రలను సూచిస్తారు. 3–6 నెలలు ట్రీట్‌మెంట్‌ తర్వాత మీకు నొప్పి ఎలా ఉంది? ట్రీట్‌మెంట్‌కు రెస్పాండ్‌ అయిందో లేదో.. మళ్లీ కన్సల్టేషన్‌లో చెక్‌ చేస్తారు.

పెయిన్‌ రిలీఫ్‌ మెడిసిన్స్‌ ఇస్తారు. ఏవీ ఫలితాన్నివ్వకపోతే డయాగ్నస్టిక్‌ లాపరోస్కోపీ చేస్తారు. ఈ విధానంలో పొట్ట మీద రంధ్రంలాంటి చిన్న కోత పెట్టి  టెలిస్కోపిక్‌ కెమెరా ద్వారా  ఆర్గాన్స్‌ అన్నిటినీ చెక్‌ చేస్తారు. దీనివల్ల ఎండోమెట్రియాసిస్, పెల్విస్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి కనిపెట్టవచ్చు.

వాటికి సరైన చికిత్స అందించవచ్చు. కొన్నిసార్లు నొప్పికి ఎలాంటి కారణం ఉండకపోవచ్చు. అదీ మంచిదే. అయితే  నొప్పి తగ్గడానికి పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ క్లినిక్‌కి రిఫర్‌ చేస్తారు. ఐబీఎస్‌(ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ )అనే కండిషన్‌లో డైట్‌ మార్పులతో పొట్ట నొప్పి తగ్గించవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ను యాంటీబయాటిక్స్‌తో ట్రీట్‌ చేస్తారు.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌.
చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్‌ డిశ్చార్జ్‌.. ఇదేమైనా ప్రమాదమా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top