దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్న ‘గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ రివ్యూ

The Great Indian Kitchen Movie Review - Sakshi

కిస్సా కిచెన్‌ కా

గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌/ మలయాళ సినిమా

వంట గదిలో పొయ్యి వెలుగుతూ ఉండాలి. వెలిగించే పని ఆమెదే. సింక్‌లో గిన్నెలు పడుతూ ఉండాలి. కడిగే పని ఆమెదే. మనిషికో కూర కావాలి. అమర్చే పని ఆమెదే. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి...  ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి... ఏళ్లకు ఏళ్లు... ఎవరికో ఒకరికి విసుగు పుడుతుంది. తీసి మురికినీళ్లు కుమ్మరించాలనిపిస్తుంది. ఆ కోడలు అదే పని చేసింది. దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్న మలయాళ సినిమా ‘గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ రివ్యూ ఇది.

ఒక ప్రయోగం చేసి చూద్దాం. ఈ పూట భర్తకు నాలుగు ఉల్లిపాయలు ఇచ్చి ‘సరదాగా తరగరాదూ’ అని భార్య అనేలా చేద్దాం. ‘ఓ’ అని సరదాగా టీవీ చూస్తూ తరుగుతాడు. ఏదైనా జోక్‌ కూడా వేస్తాడు. అయిపోతుంది. మధ్యాహ్నం అవుతుంది. ‘ఇదికో ఈ రెండు బీరకాయలు తొక్క తీసి ఇవ్వరాదూ’ అని భార్య చేత ఇచ్చేలా చేద్దాం. ‘బీరకాయలా?’ అని ఎగాదిగా చూస్తాడు. ఈసారి జోకులేయడు. తొక్క తీసి ఇచ్చేస్తాడు. రాత్రవుతుంది. వంట చేసే వేళవుతుంది. ‘ఇదిగో... నిన్నే... ఈ ఆలుగడ్డ కొంచెం వొలిచీబ్బా’ అని భార్య భర్తతో అనాలి. అప్పుడు భర్త ఏం చేస్తాడు? ఒక్కరోజుకే. ఆహా... ఇల్లు నెత్తికెత్తుకుంటావేం. మరి రోజూ.. రోజూ.. రోజూ.. నెలలు... సంవత్సరాలు.. మూడు పూట్లా ఆమె వొలుస్తూ... తరుగుతూ.. కోస్తూ.. వేయిస్తూ.. ఉడకబెడ్తూ.. దించుతూ.. ఎక్కిస్తూ... చేయి కాల్చుకుంటూ పని చేస్తూ ఉందే... ఆమె ఎందుకు ఇల్లును గిరాటు వేసి వెళ్లకూడదు?

వంట ఎవరిది?
ఈ ఆదిమ ప్రశ్నకు సమాధానంగా పురుషుడు అనాదిగా స్త్రీ వైపు వేలు చూపిస్తూ వచ్చాడు. స్త్రీ ఇంట్లో ఉండాలి. ఉత్తినే ఉండకూడదు.. వంట చేస్తూ ఉండాలి. పురుషుడు ఇంటికొచ్చే వేళకు ఆమె భోజనం సిద్ధం చేయాలి. పురుషుడు కూడా తెలివైనవాడు. అందుకు బదులుగా ఆమెకు ఒక నగ చేయిస్తాడు. ఒక చీర కొనిపెడతాడు. ‘నేనేమైనా వంట గదిలోకి వస్తున్నానా? అక్కడి పెత్తనమంతా నీదేగా’ అని ఇంట్లో మూలగా ఉండే వంట గదిని ఆమెకు రాసిస్తాడు. ఆ పనిలో ఎప్పటికీ సాయం చేయడు. అది తన పని కాదు. అది ఆమెదే.

కిచెన్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌
వంట అంటే కేవలం వంటేనా? పొయ్యి మీద నుంచి దించడమేనా? కాదు... కాదు.. వంట అంటే కప్‌బోర్డ్‌లో సరుకులు ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి.. ఫ్రిజ్‌లో పాలున్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి... గిన్నెలు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉండాలి... మిగిలినవి పారబోయకుండా వాటిని మళ్లీ ఎలా వాడాలా చూసుకుంటూ వుండాలి... మూడు పూట్లా తిన్నాక పడే ముప్పై అంట్లను తిరిగి తోమితోమి మర్నాటికి సిద్ధం చేసుకుంటూ ఉండాలి... ఇంట్లో వాళ్లకు ఏం కావాలన్నా మనమే వొండాలి. మనకు ఏం కావాలన్నా మనమే వొండిపెట్టుకోవాలి. ఇంతా అయ్యాకా? ‘ఇంకొంచెం ఉడకనివ్వాల్సింది’... ‘కొంచెం కారం తక్కువైంది’.. ‘మా అమ్మైతే ఇలా చచ్చినా చేయదు’... ‘ఏనాడు సరిగ్గా వొండావు కనుక’... ‘ఒక్క కూరే తగలడ్డావేం’.. ఇలాంటి మాటలు వినాలి. వినాలి. వినాలి. వింటూ ఉండటమేనా పని.

ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌
‘నేను వినను’ అనుకుంది ఆ ఇంటి కోడలు. ‘నేను వినదలుచుకోలేదు’ అని కూడా అనుకుంటుంది గట్టిగా ఆ సినిమాలో. చదువుకున్న అమ్మాయి తను. డాన్సర్‌. సరే అందరూ పెళ్లి చేసుకోవాల్సిందే కనుక పెళ్లి చేసుకుంది. పెళ్లి ఎందుకు చేసుకుంది. జీవించడానికి. జీవితంలో వంట ఉంటుందని ఆమెకు కూడా తెలుసు. కాని అతనికి మాత్రం వంట మధ్య ఆమె ఉంటుంది. ఉదయం లేస్తే మావగారికి, భర్త గారికి వొండి వొండి ఆమెకు సరిపోతూ ఉంటుంది. మామగారు కట్టెల మీద ఉడికించిన అన్నాన్నే తింటారు. భర్త గారు మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉందిరా మగడా అంటే ‘రాత్రయితే నేను చపాతీయే తింటాను’ అంటాడు.

మిక్సీలో పచ్చడి వేయకూడదట. రోటి పచ్చడి చేయాలట. రాత్రి మిగిలిన కూరను పొద్దునకు వేడి చేసి పెట్టకూడదట. ఫ్రెష్‌గా చేయాలట. అంట్లు సింకులో ఇన్నిన్ని. దానికి లీకేజీ ప్రాబ్లమ్‌. ‘ప్లంబర్‌ని పిలువు తండ్రీ’ అని భర్తతో అంటే అదేమైనా పెద్ద సమస్యా పట్టించుకోవడానికి? ఆమెకు కలలో, శృంగారం లో కూడా అంట్లే గుర్తుకొస్తుంటాయి. ఇంట్లో అత్తగారు లేరా? ఉంది. ఆమె చేసి చేసి చేసి సున్నమై ఉంది. ఆమెను వొదులుతారా? కూతురు కడుపు తో ఉంటే అల్లుడిగారికి అన్నీ వొండి పెట్టడానికి పిలిపిస్తారు. ప్రతి ఇంట్లో పొయ్యి మండుతూ ఉండాలి. ఇల్లాలి చెమట కారుతూ ఉండాలి. ఎంత కాలం?

ప్రతిఘటన
ఇంతలో భర్త, మామగారు అయ్యప్ప మాల వేస్తారు. ఆ మాల వేసినప్పటి నుంచి ఆమెకు టెన్షన్‌. ఎదురు పడకూడదు. పొరపాటున కూడా భర్తను తాకకూడదు. బహిష్టు అయితే గదిలో దాక్కుని ఉండాలి. స్త్రీల గర్భం నుంచే లోపలి మలినాన్ని చీల్చుకునే పుడతారు అందరూ. కాని ఆమెకు మలినం ఉండే రోజులను లెక్కగడతారు. ఉన్న ఇద్దరికి వొండలేక కోడలు సతమతమవుతుంటే ఈ అయ్యప్ప భక్తుల రాకపోకలు, పూజలు దానికి సంబంధించిన వంట చాకిరి... ఆమె విసిగిపోతుంది.

నిజమే. ఇంట్లో పనులు చేయదగ్గ శక్తి ఉంటే చేయొచ్చు. కాని ఆ పనిలో భాగస్వామ్యం అక్కర్లేదా? తోడు అక్కర్లేదా? ఏం చేస్తావులే.. ఈ పూటకు రెస్ట్‌ తీసుకో అనే మాట అక్కర్లేదా... ఎలాగోలా వండుతున్నావో అదే పదివేలు అనే కృతజ్ఞత అక్కర్లేదా? లోకంలో వంట మనిషితో మర్యాదగా వ్యవహరిస్తారు జనం ఎక్కడ మానేస్తుందో అని. ఈమె కోడలు? ఎక్కడకు పారిపోతుంది? తాగిన టీ కప్పు అయినా కడిగి పెట్టరా గాడిదా అని భర్త గురించి ఆమె మనుసులో అనుకుంటూ ఉంటుందో లేదోకాని ప్రేక్షకులకు అనిపిస్తూ ఉంటుంది. చివరకు ఆమె క్లయిమాక్స్‌లో తీవ్రంగా విసిగిపోతుంది. భర్త మీద, మామగారి మీద మురికి నీళ్లు పోసి ఆ ఇంటి నుంచి శాశ్వతంగా బయటపడుతుంది.

ఇది ఈ సమస్యకు పరిష్కారమా? అంటే కాకపోవచ్చు. ఇది ఈ సమస్యను ముఖాన గుద్ది చూపిన ఒక ప్రతిఘటన అనుకోవాలి. తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు వంట బాధతో అల్లాడే స్త్రీల వ్యధను చెప్పాలి. ఇవాళ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ చాలా శక్తిమంతంగా స్త్రీ వేదనను చూపింది. వంటలో ఉండే శ్రమ, వొత్తిడి, పురుషుడి యజమాని పాత్ర ఎంత అమానమీయమైనవో ఈ సినిమా చూపుతుంది. ఇంట్లో స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నప్పుడు వంట పని స్త్రీది మాత్రమే ఎలా అవుతుంది? వంట మీద వ్యతిరేకత కాదు ఈ సినిమా. వంటకు సంబంధించిన శ్రమలో విభజన, మానవీయత అవసరం గురించి మాట్లాడటమే ఈ సినిమా.

కట్టెల పొయ్యి వెళ్లి గ్యాస్‌ స్టౌ వచ్చి ఉండొచ్చు. కాని ఏ ఇంటిలో అయినా స్త్రీ ఆ గ్యాస్‌ స్టౌ ఎదుట రోజూ ఎన్ని గంటలు నిలుచుంటున్నదో లెక్క వేసుకుంటే అలా నిలుచోబెట్టడం ఎంత న్యాయమైన పనో ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. సినిమా క్లయిమాక్స్‌లో ‘ఏరా.. నీ నీళ్లు నువ్వు తాగలేవా’ అని తమ్ముణ్ణి తిడుతుంది అక్క, అత్తారింటి నుంచి పారిపోయి వచ్చాక, వాడు చెల్లెల్ని నీళ్లు అడుగుతుంటే. ఇంట్లో ఉండే అబ్బాయిలకు ముందు నుంచి ఈ సంస్కారం నేర్పిస్తే వంట గదులు ఇద్దరూ కలిసి పని చేసే గదులు అవుతాయి.
ఆ రోజు రావాలని హెచ్చరించే సినిమా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’.

ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌
జనవరి 15న ‘నీస్ట్రీమ్‌’ అనే ఓటిటి ప్లాట్‌ఫామ్‌ ద్వారా విడుదలైన మలయాళ సినిమా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’. జో బేబీ దీని దర్శకుడు. నిమిష సజయన్, సూరజ్‌ వంజర మూడు నటించారు. సినిమా అంతా కేవలం ఒక ఇంట్లో జరుగుతుంది. దాదాపుగా ఇన్‌డోర్‌లో ఎక్కువగా కిచెన్‌లో జరుగుతుంది. క్లయిమాక్స్‌లో మాత్రమే ఒక్కసారి ఔట్‌డోర్‌ కనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాలో స్త్రీలు వంట చేయడానికి పడే శ్రమను వారి అప్రమత్తతను శక్తిమంతంగా చూపిస్తాడు. వండకపోయినా కనీసం టేబుల్‌ మేనర్స్‌ కూడా పాటించని మగవాళ్లను ఈసడించుకునేలా చేస్తాడు. తిన్నాక మిగిలిన దానిని డస్ట్‌బిన్‌లో వేసి కంచం శుభ్రం చేసి పెట్టే పని కూడా చేయని మగవారు ఉంటే ఆ ఇంటి ఆడవాళ్లు ఆ రోతను ఎలా భరిస్తూ వెళతాడో చూపిస్తాడు. వంట పనిని ఆడవాళ్లకు అప్పజెప్పడంలో ఏ కులమూ ఏ మతమూ వెనుకాడలేదు. ఫలానా మతంలోకి మారితే వంట పని ఉండదు అనంటే ఈ దేశంలో బహుశా ప్రపంచమంతా ఆ మతంలోకి ఆడవారు మారిపోతారని నిర్వివాదాంశంగా చెప్పవచ్చు. వంట గురించి స్త్రీల మొత్తుకోళ్లు సాగుతూనే ఉంటాయి. ఇది మాత్రం మాడుకోలు. అంటే మగవారి మాడును పగలగొట్టిన సినిమా అని మాత్రం చెప్పక తప్పదు.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top