
మాంసాహారం పట్ల మన ప్రేమకు హద్దే లేదని...ఏటా దేశవ్యాప్తంగా హాంఫట్ అనిపిస్తున్న టన్నుల కొద్దీ భిన్న రకాల మాంస విక్రయాలు నిరూపిస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా నాన్ వెజ్ ప్రియత్వం అంతకంతకూ ఇనుమడిస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక వండేశైలులు మేళవించే ముడి దినుసుల బట్టి రుచి ప్రాచుర్యాలు మారవచ్చేమో గానీ డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంటోంది. ఈ మాంసాహారాల్లో మటన్ చికెన్ అత్యధిక శాతం మంది తీసుకునే ఆహారం అనేది తెలిసిందే.
మాంసం పట్ల ప్రేమ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలలో మేక మాంసం ప్రసిద్ధి చెందినప్పటికీ, దేశంలోని ఉత్తర ప్రాంతంలో చికెన్ ఆధిపత్యం చెలాయిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం కోడి, మేక మాంసం రెండూ ఇష్టపడతాయి.
మటన్ వద్దు.. చికెన్ ముద్దు...
అయితే గత కొంతకాలంగా వైద్యులు చెబుతున్న ప్రకారం గానీ, పోషకాహార నిపుణుల సూచనలను బట్టి గానీ చూస్తే మటన్ లేదా మేక/గొర్రె(mutton) మాంసంతో పోలిస్తే చికెన్ /కోడి(chicken) మాంసం అత్యంత ఆరోగ్యకరం. మేక మాంసం అనారోగ్యకరం. అయితే దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తోంది ఓ తాజా అధ్యయనం.
అధ్యయనం ఏం చెబుతుంది?
ముడి మేక కోడి మాంసం మధ్య పోలికను చూపించే ఇఎస్‌డిఎ ఫుడ్ డేటా సెంట్రల్‌కు చెందిన డిజిటల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, మటన్ చికెన్ రెండింటిలో ప్రోటీన్ స్థాయిలు దాదాపు సమానంగా ఉన్నాయని, కానీ మేక మాంసం ఇనుము, పొటాషియం రాగి వంటి ఖనిజాలను అలాగే శాట్యురేటెడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తక్కువగా కలిగి ఉంటుందని పేర్కొంది. అది మేక మాంసాన్ని గుండెకు ఆరోగ్యకరమైన ఎంపికగా చేస్తుంది, ఇది కోడి మాంసంతో పోల్చదగిన ప్రోటీన్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రెండు మాంసాలు ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉన్నాయని అధ్యయనం చెబుతుంది. ఇది కండరాల పెరుగుదలకు మెరుగైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
మేక మాంసం కోడి మాంసం రెండూ సహజంగా జంతు ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. అయితే వాటి పోషక విలువలు ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలలో మాత్రం చాలా తేడా ఉంది. ప్రోటీన్ విషయానికి వస్తే, కోడి మాంసం మేక మాంసం కంటే కొంత ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది. ఒక 100 గ్రాముల కోడి మాంసంలో దాదాపు 21.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, అయితే అదే ఒక 100 గ్రాముల మేక మాంసం దాదాపు 20.6 గ్రాముల ప్రోటీన్లను అందిస్తుంది. రెండు మాంసాలు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్‌ని కలిగి ఉంటాయి, ఇది కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు కూడా అవసరం.
ఎందులో ఎక్కువ కొవ్వు ఉంటుంది?
మేక మాంసం చికెన్ కంటే తక్కువ మొత్తం కొవ్వు, శాట్యురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇది 3–ఔన్సులకు దాదాపు 2.6 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది, తద్వారా గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది. అంతేకాకుండా, మేక మాంసంలో ఇనుము జింక్ (Zinc) వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. మరోవైపు కోడి మాంసంలో బి5, బి6, డి, ఇ వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శక్తి జీవక్రియతో పాటు ఎముక ఆరోగ్యానికి ఉపయుక్తం.
ఏది మంచిది?
క్లుప్తంగా చెప్పాలంటే, మేక మాంసం. కోడి మాంసం రెండూ అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో అధిక–నాణ్యత ప్రోటీన్‌ను అందిస్తాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాబట్టి ఒకటి మంచిది కాదు మరొకటి మంచిది అనే తీర్పులు సరైనవి కావని స్పష్టం చేస్తోది. ఈ రెండింటిలో ఒక ఎంపిక ప్రధానంగా వ్యక్తిగత పోషక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, మెరుగైన ఆరోగ్యం కోసం నాన్ వెజ్ ఆహారాన్ని మితంగా తీసుకోవడం మాత్రమే ఉత్తమం.
చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..