Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్‌ వద్దనుకుని..

Goa: Meet Shweta Gaonkar Who Climbs Coconut Tree Toddy Tapper - Sakshi

శ్వేత గీసిన గీత

గోవాలో లక్షలాది కొబ్బరి చెట్లు ఉన్నాయి. కాని కొబ్బరి కల్లు గీసే కార్మికులు 200 మించి లేరు. ఇతర దేశీయ మత్తు పానీయాలను తయారు చేసుకునే గోవా ప్రజలు కొబ్బరి కల్లును ఇప్పుడు లాభసాటిగా చూస్తున్నారు. అందుకు కారణం శ్వేత.

24 ఏళ్ల ఈ అమ్మాయి గోవాలో ఏకైక కొబ్బరి కల్లు గీత కార్మికురాలు. ఒక కొబ్బరి ఫామ్‌కు మేనేజర్‌గా పని చేస్తూ కొబ్బరి కల్లు గీస్తూ ఆదాయ మార్గాలు సృష్టించి వార్తల్లోకి ఎక్కింది.

శ్వేతా గోయంకర్‌ ఇప్పుడు గోవా కల్లు ఉత్పత్తిని ప్రభావితం చేసి కొన్ని వందల జీవితాల్లో ఉపాధి తేనుంది. ఇంత వరకూ నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిన ఒక ప్రధాన ఆదాయ వనరు శ్వేతా వల్ల మబ్బు తొలిగి వెలుతురులోకి వచ్చింది. అంతా రాసి పెట్టినట్టు జరిగింది అంటామే అలాగే జరిగింది.

బీటెక్‌ బదులుగా వ్యవసాయ కోర్సు
శ్వేతా గోయంకర్‌ బీటెక్‌ చేద్దామనుకుని కోచింగ్‌ మొదలెట్టింది. కాని ఎందుకో ఆమెకు బి.ఏ అగ్రికల్చర్‌ కోర్సు చేయాలనిపించింది. సాధారణంగా గోవాలో ఈ కోర్సు చేసేవాళ్లు తక్కువ. కోర్సు పూర్తయ్యాక శ్వేతా బెంగళూరులో ఒక సంస్థలో ఉద్యోగానికి వెళ్లింది.

అక్కడ టిష్యూ కల్చర్‌ గురించి పరిశోధన. ఒక సీడ్‌ నుంచి వేలాది సీడ్‌లను ఎలా ఉద్భవించేలా చేయవచ్చో శ్వేతా పరిశోధన చేస్తుంటే హటాత్తుగా లాక్‌డౌన్‌ వచ్చి ఉద్యోగం పోయింది. శ్వేత గోవాకు తిరిగి వచ్చి ఒక కొబ్బరితోటలో మేనేజర్‌ ఉద్యోగానికి కుదిరింది.

సరదా ప్రయత్నం
లాక్‌ డౌన్‌ కాలంలో తోట వ్యవహారాలు చూస్తున్న శ్వేతకు ఒకరోజు కొబ్బరి చెట్టు ఎక్కాలనిపించింది. ఎక్కింది. భయం వేయలేదు. చిటారుకు వెళ్లాక ఆమెకు కొబ్బరి కల్లు తీయడం గుర్తుకొచ్చింది. చదువులో భాగంగా ఆ పని తెలిసిన శ్వేత మరుసటి రోజు కొబ్బరి కల్లు గీత మొదలెట్టింది.

తను పని చేస్తున్న తోటలో కల్లు గీయడం ప్రారంభించే సరికి చుట్టుపక్కల వారికి తెలిసి చూడటానికి రావడం మొదలెట్టారు. తాటి కల్లు, ఈత కల్లులాగే కొబ్బరి కల్లు కూడా దేశీయ పానీయం. అందుబాటులో లేక గాని తాగే వారి సంఖ్య తక్కువేం కాదు గోవాలో. ఇప్పుడు శ్వేత వల్ల కొబ్బరి కల్లు పట్ల కుతూహలం మొదలయ్యింది.

200 మంది మాత్రమే
గోవాలో కొబ్బరి చెట్లు లక్షల్లో ఉంటే కొబ్బరి కల్లు గీసే కార్మికుల సంఖ్య కేవలం 200 ఉంది. ప్రభుత్వం, ఉద్యానవన శాఖలు ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులు ఎత్తేశాయి. కారణం చెట్టెక్కడంలో ఉన్న రిస్కు, ఆదాయం అంతంత మాత్రమే ఉండటం. ‘కాని కొబ్బరి కల్లు మీద సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక్కో మనిషి మూడున్నర లక్షల ఆదాయం గడించవచ్చు’ అని శ్వేత అందరికీ తెలియచేసింది.

కేరళ నుంచి తెప్పించిన పరికరంతో సులభంగా చెట్టు ఎక్కి కాయను దించడమే కాదు, కల్లు ఎలా గీయవచ్చో శ్వేత ట్రైనింగ్‌ ఇస్తోంది. ఇటీవలే 60 మంది కొబ్బరి రైతులకు ఆమె కల్లు గీయడం నేర్పించింది. ఈ విషయమై అందరూ శ్వేతను విపరీతంగా మెచ్చుకుంటున్నారు. కల్లు గీస్తున్న ఏకైక గోవా అమ్మాయి శ్వేత. ఈ సంఖ్య పెరగాలని అందరూ ఈ ఉపాధిని పొందాలని కోరుకుంటోంది శ్వేత. 
చదవండి: Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్‌ అడ్రస్‌..
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top