Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్‌ అడ్రస్‌..

Jhansi Reddy Hanumandla: Climbing the Ladder of Success - Sakshi

సమస్యతో పాటు పరిష్కారం కూడా మన వెన్నంటే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేసేవారే ఎప్పుడూ విజేతలుగా నిలుస్తారు. అందుకు సరైన ఉదాహరణ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి.

తెలంగాణలోని ఖమ్మం జిల్లావాసి ఝాన్సీరెడ్డి విద్య, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. పురుషాధిక్య ప్రపంచమైన రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తన సత్తా చాటడంతో పాటు, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల ఉన్నతికి పాటుపడుతూ, పుట్టిన గడ్డకు సాయమందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఝాన్సీరెడ్డిని పలకరిస్తే ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు.


‘‘నా శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే, ఏ పనిని ఎంచుకున్నా అందులో సంపూర్ణ విజయాన్ని సాధించేదాకా వదలను. నేను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా మధిర దగ్గర బనిగళ్లపాడు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడంతో పెద్దనాన్నతో పాటు అమెరికా వెళ్లిపోయాను. అక్కడే టెన్త్‌ పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చాను. పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి అయింది. సాధారణంగా భర్త వెంట భార్య అమెరికా వెళ్లడం చూస్తుంటాం. కానీ, నా విషయంలో ఇది రివర్స్‌ అయ్యింది. మా వారు కార్డియాలజిస్ట్‌ కావడం, మేం న్యూజెర్సీలో సెటిల్‌ అవడం... ఏడాదిలోనే జరిగిపోయాయి.

పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి కుటుంబంతో పాటు వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను. అలా ప్లస్‌ టూ పూర్తవగానే బ్యాంకింగ్‌ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తి ఎక్కువ. అదే సమయంలో బ్యాంకు కూడా ఫైనాన్సింగ్‌ క్లాసెస్‌ ఆఫర్‌ చేసింది. దీంతో సాయంత్రాలు చదువుకుంటూ, పగటి వేళ ఉద్యోగం చేశాను. ప్రమోషన్లు వచ్చాయి. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ సమయంలోనూ ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్‌ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను.  

అమెరికా.. రియల్‌ ఎస్టేట్‌
డాక్టర్‌గా మా వారి సంపాదన బాగానే ఉంది. దీంతో ఓ చిన్న స్థిరాస్తి కొనుగోలు చేశాం. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ స్థిరాస్తిని కేవలం పెట్టుబడిగానే ఎందుకు చూడాలి, ఇదే వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అనుకున్నాను. కానీ, ఈ రంగంలో మహిళలు ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ఇండియా–అమెరికా ఏ దేశమైనా ఈ రంగంలో మహిళల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టచ్చు. అంతటా పురుషాధిపత్యమే. చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని తెలుసు. అయినా, పాతికేళ్ల క్రితం ‘రాజ్‌ ప్రాపర్టీస్‌’ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ప్రారంభించాను. ఎందుకొచ్చిన రిస్క్‌ అన్నవారూ ఉన్నారు. విమర్శలనే కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. కొద్దికాలంలోనే ఈ రంగంలో మంచి పేరు సాధించాను.

తెలుగు మహిళల కోసం..
అమెరికాలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక తెలుగువారి సమస్యలు బాగా తెలుసు. అందులోనూ తెలుగు అసోసియేషన్స్‌కు వచ్చిన మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. దేశం మారుతున్నా మగవారి మనస్తత్వాలు, భావాలు మారడం లేదు. దీంతో తెలుగు కుటుంబాల్లో గృహహింస, గొడవలు, రకరకాల చికాకులతో మహిళలు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. ఆర్థిక స్థిరత్వం లేదు. ఇలాంటి వాటన్నింటికి పరిష్కారంగా ఒక సంస్థ ఉండాలనుకున్నాను. అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల కోసం ఉమెన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ తెలుగు అసోసియేషన్‌ (వెటా) సంస్థను నాలుగేళ్ల్ల క్రితం ఏర్పాటు చేశాను. ఇందులో నిష్ణాతులైన మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు మహిళలకు కావల్సిన ప్రేరణ, ప్రోత్సాహం, ఆసక్తి గల మహిళలందరికీ అందించాలన్నదే లక్ష్యం.

మనలోని సమర్థత ఏంటో మనకే బాగా తెలుసు. ఏ రంగంలో మనం సమర్థవంతంగా రాణించగలమో గ్రహించి, ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడు అవకాశాలు కూడా వాటంతటవే వస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటూ వెళ్లడంలోనే మన విజయం దాగుంటుంది. దీంతో మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో పాటు మన చుట్టూ ఉన్న కొందరికైనా సాయం అందించగలం’’ అని వివరించారు ఈ ప్రవాస భారతీయురాలు. (చదవండి: నాట్య దీపిక.. దీపికారెడ్డి)

పుట్టిన గడ్డకు సాయం
అనుకున్న విజయాలను సాధించాను. పుట్టినగడ్డకు కొంతైనా సేవ చేయాలని.. ఖమ్మం జిల్లాలోని మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లలో స్కూల్‌ భవనాలు కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాను. తొర్రూరులో హాస్పిటల్‌ కట్టించాను. వీటితోపాటు లైబ్రరీ, గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాను. పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించాను. 

– నిర్మలారెడ్డి
ఫొటోలు: గడిగె బాలస్వామి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top