వీల్‌ పవర్‌

Global Empowerment Award to Hasitha - Sakshi

ఎదగాలనుకునే మనిషికి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. విధి కావచ్చు. వ్యక్తులు కావచ్చు. ఆగకూడదు.... సాగిపోతూనే ఉండాలి.. అంటారు హసిత ఇళ్ల.ఫ్రెడ్రిచ్‌ అటాక్సియా వ్యాధి తనను ఆపలేకపోయిందని కూడా అంటారు.హైదరాబాద్‌కు చెందిన హసిత ఇళ్ల ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం పుణేలో ఉంటున్నారు. తన లోపాన్ని ఏ మాత్రం మనసుకి పట్టించుకోకుండా, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. 

మా అమ్మవాళ్లది కాకినాడ. నాన్నగారిది హైదరాబాద్‌. నాకు తొమ్మిది నెలల వయసున్నప్పుడు మేమంతా అమెరికా వెళ్లిపోయాం. నాకు పది సంవత్సరాలు వచ్చేవరకు అందరిలాగే సాధారణంగానే ఉన్నాను. అప్పుడు చిన్న అనారోగ్యం చేసింది. డాక్టర్లకు చూపించారు. అక్కడ ఏదో పొరపాటు జరగటంతో నాకు ఫ్రెడ్రిచ్‌ అటాక్సియా అనే న్యూరో డిసీజ్‌ వచ్చిందని చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఈ వ్యాధి వచ్చిన కొత్తల్లో బాగానే నడిచేదాన్ని. ఆ తరవాత ఊగుతూ, గోడలు పట్టుకుంటూ నడిచేదాన్ని. స్కూల్‌లో పిల్లలంతా ఆటపట్టించేవారు. అప్పుడు చిన్నదాన్ని కావటం వల్ల రోజూ ఏడిచేదాన్ని. అలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.

అమ్మే నా ధైర్యం..
నా బాధ అమ్మ చూడలేకపోయింది.  తనకు మెడిటేషన్‌ తెలుసు. నాకు నిరంతం ధైర్యం నూరిపోసేది. ‘నువ్వు దివ్యాంగురాలివి అనే భావన మనసులోకి రానియ్యకు..’ అని నిత్యం చెబుతుండేది. శారీరకంగా ఎంత బలం ఉన్నా మనోధైర్యం లేకపోతే ఉపయోగం లేదనీ జీవితంలో పైకి రాలేమనీ తెలుసుకున్నాను. మెడిటేషన్‌ కోసం మా కుటుంబమంతా చెన్నై వచ్చేశాం. అక్కడ నాలుగేళ్లు ఉన్నాం. తమ్ముడి సహాయంతో స్కూల్‌కి వెళ్లేదాన్ని. నిరంతరం నన్ను నేను మోటివేట్‌ చేసుకోవటం ప్రారంభించాను. 12 వ తరగతి అయ్యాక బిటెక్‌ పుణేలో హాస్టల్‌ ఉంటూ చదువుకోవటం వల్ల మరింత ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను.  హైదరాబాద్‌ సిసిఎంబిలో ఆరు నెలలు ఇంటర్న్‌షిఫ్‌ చేయటానికి వచ్చాను. ఇక్కడ అందరూ నన్ను ఎంతో ప్రోత్సహించారు.

మెడిటేషన్‌ సెంటర్‌ నుంచి...
మెడిటేషన్‌ సెంటర్‌లో నేర్చుకుంటున్నప్పుడే అనుకోకుండా ఒక స్పీచ్‌ ఇచ్చే అవకాశం వచ్చింది. శంకర్‌మహదేవన్‌ కచేరీ. 50 వేలకు పైగా ప్రేక్షకులు వచ్చారు. మెడిటేషన్‌ వాళ్లే నన్ను మాట్లాడమని ప్రోత్సహించారు. భయం భయంగా వెళ్లాను. నోటిలో నుంచి మాట వస్తుందా రాదా అని బిక్కుబిక్కుమంటూనే స్పీచ్‌ ప్రారంభించాను. ఎలా పూర్తి చేశానో నాకే తెలియదు. స్పీచ్‌ పూర్తి కాగానే చాలామంది నా ఆటోగ్రాఫ్‌ కోసం రావటం నేను ఇప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నా మీద నాకు నమ్మకం మరింత కలిగింది. ఆ తరవాత నుంచి స్పీచ్‌ కాకుండా నా సొంత బ్లాగ్‌ క్రియేట్‌ చేసి, రాయటం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా, అందుకని యూ ట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాను.

అందరిలాగే చూడాలి...
దివ్యాంగులను మన దేశంలో చాలా తేడాగా చూస్తారు. ‘అయ్యో! పాపం!’ అంటూ సానుభూతి ప్రకటిస్తారు. అటువంటి ఆలోచనలను దూరం చేయాలి. ఎన్ని లోపాలున్నా మనం విజయాలు సాధించటానికి అవేవీ అవరోధాలు కావని నిరూపించటానికే నేను ఇన్ని సాధనాలను ఉపయోగించుకుంటున్నాను. పొద్దున్నే నాన్న, తమ్ముడు, వాకర్‌ల సహాయంతో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నాను. సాయంత్రాలు వీల్‌చెయిర్‌లో మా కాంపౌండ్‌లో ఒక్కర్తినే తిరుగుతాను. నాకు తిరగటం, మాట్లాడటం అంటే చాలా ఇష్టం. కోవిడ్‌ వల్ల బయటకు వెళ్లలేకపోతున్నాను. అవెన్‌ నాకు అందుతుంది కనుక, అప్పుడప్పుడు కేక్‌ తయారు చేస్తుంటాను.  

వీల్‌ చెయిర్‌ – విల్‌ పవర్‌...
జుంబా, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్, మెడిటేషన్‌ సరదాగా చేసి ఫన్నీ వీడియోలు పెడుతున్నాను. కామెడీ చేస్తుంటాను. వీల్‌చైర్‌ ట్యాగ్‌తో ‘స్టేహోమ్‌’ అని చెబుతున్నాను. ప్రతి నెల ఒకటి, మూడు వారాల్లో వీడియోలు పోస్టు చేయటం. రెండు, నాలుగు వారాల్లో బ్లాగులో పోస్టింగు. నాలాగే వీల్‌చెయిర్‌కి పరిమితమైన వాళ్లకు సలహాలు ఇస్తుంటాను. నేను స్వేచ్ఛగా అన్ని పనులు చేసుకోవటానికి అనుగుణంగా మాన్యుయల్‌ వీల్‌ చెయిర్‌ కాకుండా ఎలక్ట్రికల్‌ వీల్‌ చెయిర్‌ వాడాలని ఉంది. వాటి ధర లక్ష రూపాయల దాకా ఉంది. టూరిస్టు ప్రదేశాలలో వీల్‌ చెయిర్‌తో తిరిగేలా చేస్తే బావుంటుంది. నాలోని ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, పాజిటివ్‌ ఆలోచనలకుగాను ‘గ్లోబల్‌ ఎంపవర్‌మెంట్‌ అవారు’్డ 2019 నవంబరులో ఢిల్లీలో అందుకున్నాను. –  సంభాషణ: వైజయంతి పురాణపండ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top