
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న గీతా గోపీనాథ్ ఆ పదవి నుంచి వచ్చే నెలలో వైదొలగనున్నారు. ఆ తరువాత తనకు బాగా ఇష్టమైన బోధన వృత్తిలోకి వెళ్లనున్నారు.‘ఐఎంఎఫ్’లో తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్‌గా చరిత్ర సృష్టించారు గీత. ‘జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం’ అంటూ ‘ఐఎంఎఫ్’లో పనిచేయడం గురించి చెబుతారు గీత.
గీత మళ్లీ బోధనరంగం వైపు రావాలనుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. హార్వర్డ్ యూనివర్శిటీలో బోధనకు విరామం ఇచ్చి ‘ఐఎంఎఫ్’లో చేరిన గీత మళ్లీ పాఠాలు చెప్పనున్నారు.‘నా మూలాల్లోకి తిరిగి వస్తున్నాను. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఆర్థిక శాస్త్రంలో వచ్చే తరానికి శిక్షణ ఇవ్వడానికి నా తిరుగు ప్రయాణం ఉపయోగపడుతుంది’ అంటున్నారు గీత.
‘ఐఎంఎఫ్’లో చేరడానికి ముందు గీతకు బోధన రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. యూనివర్శిటీ ఆఫ్ షికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వర్డ్ యూనివర్శిటీలలో పనిచేశారు.ఎంత జటిలమైన ఆర్థిక విషయాలనైనా సులభంగా బోధించడం గీతా గోపీనాథ్ ప్రత్యేకత. సమకాలీన సంఘటనలు, దినప్రతికలలో వచ్చే వ్యాసాలను ఉటంకిస్తూ వివిధ ఆర్థిక సిద్ధాంతాలను విద్యార్థులకు బోధించేవారు.
గీత దిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తున్న కాలంలో మన దేశం ఫైనాన్సింగ్, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ నేపథ్యమే ఆమెను అంతర్జాతీయ ఆర్థిక విషయాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ఆ ఆసక్తి గీతా గోపీనాథ్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో ఉన్నతస్థానానికి తీసుకువెళ్లింది.