breaking news
Economics lecturer
-
టీచరమ్మకు స్వాగతం
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న గీతా గోపీనాథ్ ఆ పదవి నుంచి వచ్చే నెలలో వైదొలగనున్నారు. ఆ తరువాత తనకు బాగా ఇష్టమైన బోధన వృత్తిలోకి వెళ్లనున్నారు.‘ఐఎంఎఫ్’లో తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్‌గా చరిత్ర సృష్టించారు గీత. ‘జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం’ అంటూ ‘ఐఎంఎఫ్’లో పనిచేయడం గురించి చెబుతారు గీత.గీత మళ్లీ బోధనరంగం వైపు రావాలనుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. హార్వర్డ్ యూనివర్శిటీలో బోధనకు విరామం ఇచ్చి ‘ఐఎంఎఫ్’లో చేరిన గీత మళ్లీ పాఠాలు చెప్పనున్నారు.‘నా మూలాల్లోకి తిరిగి వస్తున్నాను. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఆర్థిక శాస్త్రంలో వచ్చే తరానికి శిక్షణ ఇవ్వడానికి నా తిరుగు ప్రయాణం ఉపయోగపడుతుంది’ అంటున్నారు గీత.‘ఐఎంఎఫ్’లో చేరడానికి ముందు గీతకు బోధన రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. యూనివర్శిటీ ఆఫ్ షికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వర్డ్ యూనివర్శిటీలలో పనిచేశారు.ఎంత జటిలమైన ఆర్థిక విషయాలనైనా సులభంగా బోధించడం గీతా గోపీనాథ్ ప్రత్యేకత. సమకాలీన సంఘటనలు, దినప్రతికలలో వచ్చే వ్యాసాలను ఉటంకిస్తూ వివిధ ఆర్థిక సిద్ధాంతాలను విద్యార్థులకు బోధించేవారు.గీత దిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తున్న కాలంలో మన దేశం ఫైనాన్సింగ్, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ నేపథ్యమే ఆమెను అంతర్జాతీయ ఆర్థిక విషయాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ఆ ఆసక్తి గీతా గోపీనాథ్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో ఉన్నతస్థానానికి తీసుకువెళ్లింది. -
తపాలా: ...అయితే నేను కూడా స్కూల్ నుంచి రిటైర్ అవుతా!
మా వారు డిగ్రీ కాలేజ్‌లో ఎకనామిక్స్ లెక్చరర్‌గా చేసి రిటైర్ అయ్యారు. మాకొక బుజ్జి మనవడున్నాడు. మా అబ్బాయి కొడుకు. వాడికిప్పుడు నాలుగో సంవత్సరం. మేం ఎంత చెప్పినా వినకుండా వాడిని మూడు సంవత్సరాలు పూర్తవగానే వాళ్ల నాన్న స్కూల్లో చేర్చాడు. ఇక చూడండి, రోజూ ఏడుపు స్కూల్‌కి వెళ్లటానికి. ఏడుస్తూ స్కూల్కెళ్లి నవ్వుతూ ఇంటికొచ్చేవాడు. ‘హమ్మయ్య ఈ రోజుకి స్కూల్ అయిపోయింది’ అనుకుంటూ కాబోలు. ఇంట్లో వాడి ముద్దు మాటలకి, చిలిపి పనులకి అలవాటు పడిన మాకు చాలా వెలితిగా ఉండేది, వాడు స్కూల్కెళ్లిపోయినప్పుడు. ఒకరోజు వాళ్ల నాన్న వాడిని బయటికి తీసుకెళ్లాడు. మావారి కాలేజీ ముందు నుండి వస్తూ, ‘‘ఇదుగోరా నాన్నా, తాతగారు ఇక్కడే పనిచేసేవారు, ఈ కాలేజీలోనే. రోజూ వచ్చేవారు ఇక్కడికి’’ అని చెప్పాడంట. ‘‘మరి ఇప్పుడు రావటం లేదే. ఇంట్లోనే ఉంటున్నారెందుకు?’’ అని అడిగాడట వీడు. అందుకు వాళ్ల నాన్న, ‘‘తాతగారు రిటైర్ అయిపోయారు. అందుకని ఇంక కాలేజీకి రానక్కరలేదు. అందుకే ఇంట్లోనే ఉంటున్నారు’’ అన్నాడట. అది విని వెంటనే మా మనవడు, ‘‘డాడీ! నేను కూడా రిటైర్ అయిపోతాను తాతగారిలాగా. రేపటి నుండి స్కూల్కెళ్లను’’ అన్నాడట. ఇంటికొచ్చి అది చెప్పి మా అబ్బాయి ఒకటే నవ్వు! - కె.హేమలత, కాకినాడ ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, భీతిగొల్పిన సందర్భాలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు, వారు రాసే చిట్టిపొట్టి కవితలు, వేసే రంగురంగుల చిత్రాలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మీ పిల్లలకు సంబంధించిన విశేషాలు పంపేటప్పుడు వాళ్ల ఫొటోలు పంపడం మర్చిపోకండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com