తపాలా: ...అయితే నేను కూడా స్కూల్ నుంచి రిటైర్ అవుతా! | I will retire to School lecturer | Sakshi
Sakshi News home page

తపాలా: ...అయితే నేను కూడా స్కూల్ నుంచి రిటైర్ అవుతా!

Feb 9 2014 3:22 AM | Updated on Sep 15 2018 5:45 PM

మా వారు డిగ్రీ కాలేజ్‌లో ఎకనామిక్స్ లెక్చరర్‌గా చేసి రిటైర్ అయ్యారు. మాకొక బుజ్జి మనవడున్నాడు. మా అబ్బాయి కొడుకు. వాడికిప్పుడు నాలుగో సంవత్సరం.

మా వారు డిగ్రీ కాలేజ్‌లో ఎకనామిక్స్ లెక్చరర్‌గా చేసి రిటైర్ అయ్యారు. మాకొక బుజ్జి మనవడున్నాడు. మా అబ్బాయి కొడుకు. వాడికిప్పుడు నాలుగో సంవత్సరం. మేం ఎంత చెప్పినా వినకుండా వాడిని మూడు సంవత్సరాలు పూర్తవగానే వాళ్ల నాన్న స్కూల్లో చేర్చాడు. ఇక చూడండి, రోజూ ఏడుపు స్కూల్‌కి వెళ్లటానికి. ఏడుస్తూ స్కూల్‌కెళ్లి నవ్వుతూ ఇంటికొచ్చేవాడు. ‘హమ్మయ్య ఈ రోజుకి స్కూల్ అయిపోయింది’ అనుకుంటూ కాబోలు. ఇంట్లో వాడి ముద్దు మాటలకి, చిలిపి పనులకి అలవాటు పడిన మాకు చాలా వెలితిగా ఉండేది, వాడు స్కూల్‌కెళ్లిపోయినప్పుడు.
 
 ఒకరోజు వాళ్ల నాన్న వాడిని బయటికి తీసుకెళ్లాడు. మావారి కాలేజీ ముందు నుండి వస్తూ, ‘‘ఇదుగోరా నాన్నా, తాతగారు ఇక్కడే పనిచేసేవారు, ఈ కాలేజీలోనే. రోజూ వచ్చేవారు ఇక్కడికి’’ అని చెప్పాడంట. ‘‘మరి ఇప్పుడు రావటం లేదే. ఇంట్లోనే ఉంటున్నారెందుకు?’’ అని అడిగాడట వీడు. అందుకు వాళ్ల నాన్న, ‘‘తాతగారు రిటైర్ అయిపోయారు. అందుకని ఇంక కాలేజీకి రానక్కరలేదు. అందుకే ఇంట్లోనే ఉంటున్నారు’’ అన్నాడట. అది విని వెంటనే మా మనవడు, ‘‘డాడీ! నేను కూడా రిటైర్ అయిపోతాను తాతగారిలాగా. రేపటి నుండి స్కూల్‌కెళ్లను’’ అన్నాడట. ఇంటికొచ్చి అది చెప్పి మా అబ్బాయి ఒకటే నవ్వు!
 - కె.హేమలత, కాకినాడ
 
 ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, భీతిగొల్పిన సందర్భాలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు, వారు రాసే చిట్టిపొట్టి కవితలు, వేసే రంగురంగుల చిత్రాలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మీ పిల్లలకు సంబంధించిన విశేషాలు పంపేటప్పుడు వాళ్ల ఫొటోలు పంపడం మర్చిపోకండి. మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
 రోడ్ నం.1, బంజారాహిల్స్,
 హైదరాబాద్ - 34.  funday.sakshi@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement