
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలదిగ్బంధం ఏర్పడుతోంది. ట్రాఫిక్ అంతరాయం తలెత్తుతోంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ, జమ్ముకశ్మీర్‌తో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాల్లో నేడు(సెప్టెంబర్ 3)న పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
యూపీ అంతటా..
ఉత్తరప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి.యూపీలోని బాగ్‌పత్, షామ్లి, ముజఫర్‌నగర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, ఘజియాబాద్‌లలో సెప్టెంబర్ 3న పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
పంజాబ్
వరదలు, వర్షాల కారణంగా పంజాబ్‌లోని పాఠశాలలకు సెలవులు సెప్టెంబర్ 3 వరకు పొడిగించారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ సంస్థలు సెప్టెంబర్ 3 వరకు మూసివేయనున్నామని పంజాబ్ విద్యా మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ ప్రకటించారు.
హర్యానా
హర్యానాలోని చండీగఢ్, కైతాల్‌లోని గుహ్లా బ్లాక్‌లో వర్షాల కారణంగా పాఠశాలలు మూసివేశారు. ఘగ్గర్ నది నీటి మట్టం పెరగడం, నిరంతర వర్షాల కారణంగా డిప్యూటీ కమిషనర్ ప్రీతి సెప్టెంబర్ 3న కైతాల్ జిల్లాలోని గుహ్లా బ్లాక్‌లోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు.
ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో తొలుత సెప్టెంబర్ 2న పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. అయితే భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నందున సెప్టెంబర్ 3 వరకు సెలవులు పొడిగించారు. వాతావరణశాఖ హెచ్చరికల మధ్య నైనిటాల్‌లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు.
హిమాచల్ ప్రదేశ్
ఎడతెరిపి లేని వర్షం, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున సిమ్లాలోని పాఠశాలలను సెప్టెంబరు 3న మూసివేశారు. ఈ విషయాన్ని సిమ్లా జిల్లా యంత్రాంగం ప్రకటించింది.