
ఖాఠ్మండు: నేపాల్‌ను తమ తిరుగుబాటుతో జనరేషన్ జెడ్ (జెన్ జెడ్) వణికించింది. దేశవ్యాప్తంగా జరిగిన భారీ నిరసనలతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో ఇదే తరహాలో యువత నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు దరిమిలా ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఏడాది వ్యవధిలో ‘జెన్ జెడ్’ రెండు దేశాల ప్రభుత్వాలను కూకటివేళ్లతో సహా కూల్చివేసింది.
నేపాల్‌లో పలు సోషల్ మీడియా యాప్‌ల నిషేధం దరిమిలా ఖాఠ్మండుతో పాటు దేశంలోని పలు నగరాల్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రధాని కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. 2024, ఆగస్టు 2024లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఇటువంటి పరిణామాల నేపధ్యంలోనే రాజీనామా చేశారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని కేపీ ఓలి కూడా దేశం విడిచి పారిపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అటు బంగ్లాదేశ్ ఇటు నేపాల్.. ఈ రెండు దేశాల్లో జరిగిన ఘటనలు దక్షిణాసియాలో తరాల మార్పును గుర్తించేలా చేస్తున్నాయి. జనరల్ జెడ్ ఉద్యమాలు దేశాధినేతలను నిష్క్రమించేలా ఒత్తిడి చేస్తున్నాయి. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా వేలాది మంది జనరల్ జెడ్ నిరసనకారులు ఖాఠ్మండు వీధులలో నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్ జరిగిన ‘రిజర్వేషన్ కోటా’ నిరసనలు ఆ దేశంలో సంక్షోభం తలెత్తేలా చేశాయి. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై విద్యార్థుల ఆగ్రహం పెల్లుబికింది. అది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసే వరకూ సాగింది.
సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్‌లో మొదలైన ఉద్యమం రాజకీయ నేతల అవినీతిని నిలదీసే పోరాటానికి దారితీసింది. అటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్.. ఇరు దేశాల నిరసనలలో విద్యార్థులు, యువత కీలక భాగస్వామ్యం వహించారు. కాలం చెల్లిన రాచరిక పాలనకు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇందుకు సోషల్ మీడియాను ప్రముఖ వేదికగా వాడుకున్నారు. ఢాకా- ఖాట్మండు.. రెండు చోట్లా ఉద్యమాల అణిచివేతకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో పలువురు నిరసనకారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఉద్యమాలు మరింత తీవ్రమయ్యాయి. దేశ నాయకత్వ మార్పు అనివార్యం అయ్యే పరిస్థితులు ఏర్పడ్దాయి.
నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 2024, ఆగస్టులో పదవి కోల్పోయి, భారతదేశానికి తరలివచ్చారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని ఆ దేశంలోని సంక్షోభ పరిణామాల దృష్ట్యా దుబాయ్‌లో ఆశ్రయం పొందే ప్రయత్నం చేస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏడాది వ్యవధిలో రెండు దేశాల అధినేతలకు ఎదురైన పతనం దక్షిణాసియా అంతటా తరాల మార్పును సూచిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి యువత.. అవినీతి రహిత నేతలకు, ప్రభుత్వాలకు పట్టం కట్టేలా ఉన్నారని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని కొందరు అంటున్నారు.