
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాడ్ నగర్‌లో జన్మించారు. తండ్రి పేరు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ. తల్లి పేరు హీరాబెన్. ప్రధాని మోదీకి ఐదుగురు తోబుట్టువులు. మోదీ జీవితం చాలా ఆసక్తికరంగా సాగింది. బాల్యంలో నరేంద్ర మోదీని ‘నారియా’ అని పిలిచేవారు. చిన్నప్పుడే ఆయన సన్యాసం స్వీకరించే ఉద్దేశంతో ఇంటిని విడిచిపెట్టారు. ప్రధాని మోదీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు.
స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన మొదటి ప్రధాని
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకు జన్మించిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ఆయన తొలిసారి ప్రధాని అయ్యారు.
ప్రధాని చిన్నప్పటి పేరు
నరేంద్ర మోదీ తన ప్రాథమిక విద్యను వాద్‌నగర్‌లోని బీఎన్ హై స్కూల్ నుంచి పూర్తి చేశారు. ప్రధాని మోదీకి సంస్కృతం బోధించిన ఉపాధ్యాయుడు ప్రహ్లాద్ పటేల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను నరేంద్రుడిని ‘నారియా’ అని పిలిచేవాడిని. అతను నాతో మాట్లాడటానికి అతను ఎప్పుడూ భయపడలేదు. అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను కూడా గౌరవించేవాడు’ అని అన్నారు.
సన్యాసిగా మారాలని..
పాఠశాల విద్య ముగియగానే మోదీ సన్యాసిగా మారేందుకు ఇంటి నుండి వెళ్లిపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని రామకృష్ణ ఆశ్రమంతో సహా దేశంలోని అనేక ప్రదేశాల్లో తిరిగారు. హిమాలయాలలో ఋషులు, సాధువులతో గడిపారు. నాడు సాధువులు ఆయనతో సన్యాసిగా మారకుండానికి బదులు దేశానికి సేవ చేయాలని సూచించారు. దీంతో మోదీ సన్యాసిగా మారాలనే తన నిర్ణయాన్ని విరమించుకున్నారు.
సైన్యంలో చేరాలనుకుని..
నరేంద్ర మోదీ బాల్యంలో సన్యాసంలో చేరాలనుకున్నారు. నరేంద్ర మోదీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఆయన తన బాల్యంలో జామ్‌నగర్‌లోని సైనిక్ స్కూల్‌లో చదువుకోవాలనుకున్నారు. కానీ డబ్బు లేకపోవడం వల్ల అది జరగలేదు. ఎనిమిదేళ్ల వయసులో, మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరారు.
నటన అంటే ఇష్టం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా బాల్యంలో నటన అంటే ఎంతో ఇష్టం ఉండేది. 2013లో మోదీపై రాసిన ‘ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్: నరేంద్ర మోడీ’ పుస్తకం ప్రకారం, ఆయన తన 13-14 ఏళ్ల వయసులో పాఠశాల కోసం నిధులు సేకరించేందుకు పిల్లలతో కలిసి గుజరాతీ నాటకంలో పాల్గొన్నారు. దాని పేరు పిలు ఫూల్..అంటే పసుపు పువ్వు .
అత్యవసర పరిస్థితుల్లో సర్దార్ అవతారం
దేశంలో 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు, మోదీ సంఘ్ వాలంటీర్‌గా ఉన్నారు. ఆ సమయంలో, పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఆయన సర్దార్ వేషాన్ని ధరించారు. రెండున్నరేళ్ల పాటు ఆయన పోలీసుల కన్నుగప్పి మెలిగారని చెబుతారు.