
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నలుగురు మృత్యువాతపడ్డారు. వర్షం కారణంగా నలుగురు మృతిచెందడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై తాజాగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. రాయచోటిలో వర్షాల కారణంగా మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తీవ్రంగా కలచి వేసింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇక, రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నలుగురు మృతిచెందారు. వరదనీటిలో కొట్టుకుపోయి షేక్ ముని, ఇలియాస్, గణేష్ అనే వ్యక్తులు మృతి చెందారు. నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని మాండవ్య నదిలో ఉన్న మురుగు కాలువలో బాలిక మృతదేహం లభ్యమైంది. నాలుగు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. రాయచోటిలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు రావడంతోనే ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. గత 30 ఏళ్లలో రాయచోటిలో ఇంతటి భారీ వర్షం ఎన్నడూ చూడలేదని తెలిపారు.