మాతృభాషల్లో డిజిటల్ కంటెంట్ విస్తరణ అవసరం
ఏఎన్‌యూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేష్ కుమార్
చేబ్రోలు: ప్రాంతీయ, మాతృభాషల్లో డిజిటల్ కంటెంట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా సమాచార వ్యాప్తి మరింత పెరుగుతుందని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సురేష్ కుమార్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘భారతీయ భాషా పరివార్– భారతీయ భాషల అధ్యయనంలో పారడైమ్ షిఫ్ట్’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత అనువాద మోడళ్లు భాషా అవరోధాలను తొలగించి భాషల మధ్య అనుసంధానాన్ని బలపరుస్తున్నాయని తెలిపారు. ఒక భాషలోని సమాచారాన్ని మరో భాషలో వేగంగా, కచ్చితంగా అందించడంలో ఏఐ అనువాద సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, న్యాయం, పరిపాలన వంటి రంగాల్లో ఏఐ ఆధారిత అనువాద వ్యవస్థలు ప్రజలకు సేవలను మరింత సులభతరం చేస్తున్నాయన్నారు. గ్రామీణ మరియు అట్టడుగు వర్గాలకు జ్ఞానం, ప్రభుత్వ సేవలు చేరువయ్యేలా ఏఐ అనువాద మోడళ్లు దోహదపడుతున్నాయని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్‌లో బహుభాషా సేవల అమలుకు ఏఐ అనువాద వ్యవస్థలు సమర్థవంతమైన పరిష్కారాలుగా నిలుస్తున్నాయన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సీఎల్‌ఎల్ జయప్రద మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020 భారతీయ భాషల ద్వారా విద్య, పరిశోధనలకు విస్తృత అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, అనువాద సాధనాల ద్వారా భారతీయ భాషల్లో జ్ఞాన వ్యాప్తి వేగవంతమవుతోందని అన్నారు. భారతీయ భాషల్లో పరిశోధనలు జరిగితే జ్ఞానం సమాజానికి మరింత దగ్గరవుతుందన్నారు. హైదరాబాద్‌లోని సీబీఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.సురేష్ బాబు మాట్లాడుతూ వేద గణిత సూత్రాలను ఆధునిక భాషా మోడళ్లతో అనుసంధానించడం ద్వారా గణిత బోధన మరింత సులభంగా, వేగంగా మారుతోందని తెలిపారు. వేద గణిత పద్ధతులు మరియు ఆధునిక ఏఐ సాంకేతికత కలయిక విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో వేద గణిత డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి రావడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు కూడా గణిత విద్య చేరువవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న భాషా నిపుణులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి భారతీయ భాషల అధ్యయనంలో ఆధునిక దృక్పథాలపై చర్చించారు. ఉత్తమ పరిశోధకులకు ప్రశంసా పత్రాలను అందజేసారు.


