జగన్ హయాంలో వ్యవసాయానికి పెద్ద పీట
ఇండిగ్యాప్ సర్టిఫికేషన్
ఏపీలో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే మొదటగా అమలు ఆ ఫలాలను అందుకున్న కొల్లిపర రైతులు
తెనాలి: ఉచిత బీమాతో ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు మళ్లీ సీజను వచ్చేలోగా పరిహారం అందచేసి ధీమానిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వ్యవసాయంలో సంస్కరణలకూ పెద్దపీట వేసింది. భారత ప్రభుత్వ సంస్థ ‘క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా’ 2021లో ‘ఇండి గ్యాప్’ ప్రమాణాలను అందుబాటులోకి తీసుకురావటం అందులో ఒకటి. కేంద్రప్రభుత్వ ‘గున్వత్తా సంకల్ప్’ పథకం కింద అమలవుతున్న ఈ కార్యక్రమం ఫలాలను గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని రైతులు అందుకున్నారు.
శ్రేష్ట రైతు ఉత్పత్తిదారుల సంఘం కై వసం..
ఈ అవకాశాన్ని జిల్లాలోని కొల్లిపరలో గల శ్రేష్ట రైతు ఉత్పత్తిదారుల సంఘం అందుకుంది. ఈ సంఘంలో మొత్తం 300 మంది రైతులున్నారు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కోసం రూ.18 వేల ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నారు. తొలి ఏడాది 24 మంది రైతులు ఆ ప్రమాణాల ప్రకారం 50 ఎకరాల్లో పసుపు సాగుచేశారు. నిబంధనల ప్రకారం పది శాతం రసాయన ఎరువులు, 90 శాతం సేంద్రియ ఎరువులు వాడారు. నిషేధిత పురుగుమందుల వాడకుండా, ఇండిగ్యాప్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచించిన విధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటించారు. పసుపు పండిన తర్వాత ప్రభుత్వమే పరీక్ష చేయించి, ఇండిగ్యాప్ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. శ్రేష్ట కంపెనీ తరపున 24 మందికి ఇచ్చిన సర్టిఫికెట్లను అప్పట్లో విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నాటి మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి చేతులమీదుగా ఉయ్యూరు సాంబిరెడ్డి స్వీకరించారు. రైతులను ప్రోత్సహించేందుకని, వారు చెల్లించిన రూ.18 వేల ఫీజును ప్రభుత్వం తిరిగి రీయింబర్స్ చేసింది.. ఆ గుర్తింపుతో రైతుల పసుపును కేరళలోని ప్రముఖ ఆహారసంస్థ కొనుగోలు చేసింది. అప్పట్లో మార్కెట్‌లో ఉన్న ధరపై క్వింటాలుకు రూ.300–350 చొప్పున అదనంగా చెల్లించి మరీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత పసుపు సాగుచేసినా, ఆనాటి ప్రోత్సాహం ఇప్పుడు లేదంటున్నారు.


