పాలిటెక్నిక్ క్రీడల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన 28వ ప్రాంతీయస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడలు, ఆటల పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు కలసి విద్యార్థినులను అభినందించారు.
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకుల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న, చేసుకోని విద్యార్థులకు చివరి విడత స్పాట్ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఈనెల 22వ తేదీ, 24వ తేదీలలో స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
మేడికొండూరు: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామంలోని మహిళా పోలీసును వ్యక్తిగతంగా విమర్శిస్తూ మాట్లాడిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ మొక్కల సుబ్బారావుపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని డోకిపర్రు గ్రామ సచివాలయం వద్దకు అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మొక్కలు సుబ్బారావు వెళ్లారు ఆ సమయంలో మహిళా పోలీసు సుధాతో దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె వ్యక్తిగతంగా దుషించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం సుబ్బారావు రిమాండ్‌కు పంపినట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు.
గుంటూరు రూరల్: నల్లపాడు గ్రామంలోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 22, 23వ తేదీలలో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ గేమ్స్ ఐపీఎస్‌జీఎమ్ 2025–26 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి. రాజశేఖర్‌రావు శఽనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు రీజినల్‌లో ఉన్న అన్ని పాలిటెక్నిక్ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. విద్యార్థుల్లో క్రీడా, శారీరక ధారుడ్యం, స్ఫూర్తి, జట్టు భావనను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని తెలిపారు.
అందుకున్న 850 డాలర్లు ప్రైజ్‌మనీ
చీరాల రూరల్: బంగ్లాదేశ్‌లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చీరాలకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు షేక్ న్యుమేర్ అత్యుత్తమ ప్రదర్శనతో ద్వితీయ స్థానం సాఽధించాడు. పోటీల నిర్వాహకులు చేతులు మీదుగా 850 డాలర్లు ప్రైజ్‌మనీ అందుకున్నాడు. ఈనెల 16వ తేదీ నుంచి 20 వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓపెన్ ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం ప్రముఖ న్యాయవాది శాతరాశి ఏడుకొండలు సౌజన్యంతో ఆలాపన సంస్థ వ్యవస్థాపకులు న్యాయవాది కొల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దొరుకునా ఇటువంటి సేవ–17 నిర్వహించారు. సభకు ఏపీ సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అనంతరం సినీనటి కవితను సూపర్‌స్టార్ కృష్ణ అవార్డుతో సత్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.శరత్‌బాబు, న్యాయమూర్తి మైలాబత్తుల శోభారాణి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, బార్ కౌన్సిల్ సభ్యులు కె. చిదంబరం, బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డిలు మాట్లాడారు. కార్యక్రమంలో యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ, కళా విపంచి అధ్యక్షులు బొప్పన నరసింహారావు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వై.శివసూర్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ క్రీడల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం


