మట్టి మాఫియాకు ‘హైవే’
అధికారుల పేరుతో రెచ్చిపోతున్న మాఫియా పూలింగ్‌కు ఇవ్వని పొలాల్లో గతంలో కాలువ ఆ సాకుతో అర్ధరాత్రి వేళ అడ్డగోలుగా తవ్వకాలు
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాల్లో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా కాజ నుంచి ఎన్టీఆర్ జిల్లా గూడవల్లి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే ప్రధానకారణం అవుతోంది. వారి అవసరాల కోసం మట్టిని తరలించే క్రమంలో రాజధానిలో పూలింగ్‌కు ఇచ్చిన, ఇవ్వని భూముల్లో రాత్రి వేళ తవ్వి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా మాఫియా మట్టిని తరలించి జేబులు నింపుకొంటోంది. తాజాగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు యర్రబాలెం శివారులోని కొత్త జాతీయ రహదారి వెంబడి ఆకుల శంకర్ అనే రైతు పొలంలో తవ్వకాలు జరిగాయి. నిన్నమొన్నటి వరకు ఆ పొలంలో మునగతోట, ఇతర కూరగాయలు సాగయ్యేవి.
మంత్రి ఆదేశాలతో కాలువ...
ఇటీవల రాజధానిలో వరద ముంచెత్తి చుట్టుపక్క ప్రాంతాలు నీళ్లతో నిండిపోవడంతో మంత్రి నారాయణ ఆకుల శంకర్ పొలంలో నుంచి కొండవీటి వాగుకు గండికొట్టించారు. సీఆర్‌డీఏ అధికారులు ఆ కాలువను పూడుస్తామని రైతుతో చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. గురువారం రాత్రి జాతీయ రహదారి కింది స్థాయి సిబ్బంది అడ్డుగా ఉన్న మట్టిని తొలగించాలని కొంతమంది లారీ యజమానులకు తెలిపారు. ఇదే అదునుగా ఆ మాఫియా మట్టిని తొలగించకుండా పూలింగ్‌కు ఇవ్వని ఆకుల శంకర్ పొలంలో మట్టిని బయటకు తరలించింది. శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందడంతో రైతు తన పొలం దగ్గరకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీ, పొక్లెయిన్‌ను సీజ్ చేశారు.
జగనన్న కాలనీలోనూ...
శంకర్ పొలం పక్కనే మరో నాలుగు అడుగుల గొయ్యి పెట్టి 20 సెంట్లపైన తవ్వేశారు. అక్కడి నుండి యర్రబాలెంలో ఉన్న జగనన్న కాలనీలో 20 ప్లాట్లలో ఉన్న మట్టి కుప్పలను రాత్రికి రాత్రే తరలించారు. ఇలా ఒక రాత్రిలో సుమారు వంద లారీల మట్టిని తరలించారు. ఇంత జరుగుతున్నా సీఆర్‌డీఏ అధికారులు గానీ, సంబంధిత కాంట్రాక్టర్లు గానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు ఇప్పటికై నా మేల్కొని మట్టిమాఫియా ఆగడాలను అరికట్టాలని రాజధాని రైతులు కోరుతున్నారు. ఈ మాఫియాకి అండగా యర్రబాలెంకు చెందిన ఒక అధికార పార్టీ నాయకుడు ఉన్నట్లు తెలియవచ్చింది. సీజ్ చేసిన లారీ, ప్రొక్లయిన్‌పై కేసు నమోదు చేస్తారా? వదిలేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. కాగా, మరోచోట మట్టి తవ్వకాలు నిర్వహించాక ప్రొక్లయిన్‌ను వంద మీటర్ల దూరంలో ముళ్ల కంచెల్లో మట్టి మాఫియా దాచిపెట్టింది.
మట్టి మాఫియాకు ‘హైవే’


