భోజనం డబ్బు మా నాన్న తినేస్తున్నాడు

Girl Walk Ten Kilometers To File Complaint Against Dad - Sakshi

ఒరిస్సాలో ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి తన ఊరి నుంచి పది కిలోమీటర్లు నడిచి కలెక్టర్‌ని కలిసింది– ‘నా మధ్యాహ్న భోజనం డబ్బు మా నాన్న తినేస్తున్నాడు’ అని. ముంబైలో లాక్‌డౌన్‌ వల్ల స్కూల్‌ మానేసిన ఒక పిల్లవాడు చెరగని చిరునవ్వుతో టీ అమ్ముతూ ‘ఇన్నాళ్లు ఇంటి కోసం అమ్మ కష్టపడింది.  లాక్‌డౌన్‌ వల్ల ఆమెకు పని లేదు. నేను స్కూల్‌ మానేసి కష్టపడుతున్నాను. ఇంటి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా’ అని మొత్తం సోషల్‌ మీడియాలో స్పందన తెచ్చాడు. హక్కులను అడగలేకపోవడమూ బాధ్యతలను  విస్మరించడమూ అలవాటైపోయిన పెద్దలకు ఈ పిల్లలు నేర్పే పాఠాలు అవసరమైనవి.

ఒరిస్సాలోని కేంద్రపడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం బయట ఒక 11 ఏళ్ల చిన్నారి నిలుచుని ఉందని లోపల కలెక్టర్‌ సామర్త్‌వర్మకు తెలిసింది. ఆ చిన్నారిని లోపలికి పిలిస్తే ఫిర్యాదు రాసిన కాగితాన్ని కలెక్టర్‌కు అందించింది. ఫిర్యాదు కన్నతండ్రి పైనే. ‘మా నాన్న నా మధ్యాహ్న భోజనం డబ్బులు తీసేసుకుంటున్నాడు’ అని ఆ చిన్నారి ఫిర్యాదు చేసింది. ‘నా డబ్బు నాకు ఇప్పించండి’ అని కోరింది.

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఒరిస్సా ప్రభుత్వం ప్రతి స్కూలు విద్యార్థి అకౌంట్‌లో రోజుకు 8 రూపాయల లెక్కన నగదు వేస్తోంది. ప్రతి విద్యార్థికి రోజుకు 150 గ్రాముల బియ్యం స్కూల్లో అందజేస్తోంది. అకౌంట్‌ లేని విద్యార్థికి సంబంధించిన గార్డియన్‌ అకౌంట్‌లో డబ్బు జమ అవుతాయి.

ఈ అమ్మాయి తల్లి 2019లో మరణించింది. తండ్రి ఇంకో పెళ్లి చేసుకొని కూతురిని గెంటేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు మేనమామ దగ్గర చదువుకుంటోంది. అయితే ఆ అమ్మాయికి అకౌంట్‌ ఉన్నా తండ్రి డబ్బు తన అకౌంట్‌లో పడే ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదు స్కూల్‌కు వెళ్లి కూతురి వాటా బియ్యాన్ని కూడా తెచ్చుకుంటున్నాడు. కూతురు ఇది భరించలేకపోయింది. కలెక్టర్‌ దగ్గరకు వెళితేనే న్యాయం జరుగుతుందని తన ఊరి నుంచి కేంద్రపడకు పది కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ ఫిర్యాదు చేసింది. కలెక్టర్‌ వెంటనే స్పందించారు. ‘ఇక మీదట అమ్మాయి డబ్బు అమ్మాయి అకౌంట్‌లో వేయండి’ అని ఆదేశించారు. అంతే కాదు తండ్రి ఇప్పటి వరకూ ఎంత తీసుకున్నాడో అది కూడా ఆమె అకౌంట్‌లో వేసే ఏర్పాటు చేశారు. విద్యా శాఖాధికారి అమ్మాయి బియ్యం అమ్మాయికే ఇవ్వమని హెడ్‌మాస్టర్‌ను ఆదేశించారు.

ఆరవ తరగతి అమ్మాయి. తన హక్కును సాధించింది. పౌరులకు కూడా ఎన్నో హక్కులు ఉంటాయి. ప్రభుత్వాలను డిమాండ్‌ చేసి వాటిని సాధించుకోవచ్చు. పోరాడితే అవి సాధ్యమవుతాయి కూడా. కాని ప్రభుత్వాలను అడగడం కొందరికి తెలియదు. కొందరికి చేతకాదు. కొందరికి నిర్లిప్తత. కొందరికి టైమ్‌ ఉండదు. కాని మార్పు ప్రయత్నిస్తేనే జరుగుతుంది. ఈ అమ్మాయి ప్రయత్నించి ఆ సంగతి నిరూపించింది.

బాధలను కరిగించే టీ
దక్షిణ ముంబైలోని నాగ్‌పడా ఇరుకు వీధుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఒకటిన్నర వరకు ఆ పిల్లవాడు కనిపిస్తాడు. ఒక సైకిల్‌ తొక్కుతూ, దాని వెంట వేడి టీ ఉన్న ఫ్లాస్క్‌ను కట్టుకుని.. టీ అమ్ముతూ... తోడు అతడు నవ్వే అద్భుతమైన నవ్వు ఉచితం.

‘మా నాన్న హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడు. అమ్మ బస్‌ అటెండర్‌గా పని మొదలుపెట్టింది. మా అమ్మకు నేను చదువుకోవడం ఇష్టం. ఎయిర్‌ఫోర్స్‌లో చేరి పైలట్‌ అవ్వరా అనేది. చెప్పొద్దూ... నాక్కూడా స్కూలుకెళ్లడం నచ్చేసింది. ఇంగ్లిష్‌ నా ఫేవరెట్‌ సబ్జెక్ట్‌. మా అమ్మ కష్టం చూసి నేను కూడా కష్టపడి చదవడం మొదలుపెట్టాను. కాని లాక్‌డౌన్‌ వచ్చింది. బస్సులన్నీ ఆగిపోయాయి. అమ్మకు పని పోయింది. ఇంట్లో డబ్బులు అయిపోయాయి. నా హుండీలో చిల్లర కూడా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మార్చిలో నేను నా ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడాను. మళ్లీ వాళ్లను చూడలేదు. బడి సంగతి మర్చిపోయి ఒక కిరాణా కొట్లో రోజుకు వంద రూపాయలకు పని చేయడం మొదలుపెట్టాను.

కాని అవి ఏం సరిపోతాయి. అప్పుడే ఒక అంకుల్‌ టీ అమ్ముతూ కనిపించాడు. ఆయన్ను చూసి నేను కూడా టీ అమ్మడం మొదలుపెట్టాను. ఒక చాట్‌భాండార్‌ అంకుల్‌ తన పక్కన మూల మీద కాసేపు ఆగే వీలు ఏర్పాటు చేశాడు. అక్కడ లేదంటే వీధుల్లో తిరుగుతూ అమ్ముతాను. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఒకటిన్నర వరకూ అమ్ముతాను. ఈ చుట్టుపక్కల నేను అందరికీ తెలిసిపోయాను తెలుసా? మా అమ్మ అంటుంది– నీది బాధల్ని కరిగించే టీరా అని. కాని ఆమె అంత సంతోషంగా లేదని అనిపిస్తోంది. దానికి కారణం నేను స్కూలుకు దూరం కావడమే. నాకేమో బాధ లేదు. అమ్మ మా కోసం బాధ్యతగా పని చేసినప్పుడు నేను కూడా చేయాలి కదా. ఇక స్కూల్‌ అంటారా? ఇప్పుడు కాకపోతే మళ్లెప్పుడైనా వెళతాను’ అంటాడు నవ్వుతూ. ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’లో ఈ పిల్లవాడి కథనం వచ్చాక విశేషమైన స్పందన వచ్చింది. ఎందరో షేర్‌ చేశారు. సాయానికి ముందుకు వచ్చారు. పిల్లవాడి పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ని మెచ్చుకున్నారు.

ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కుటుంబానికి సంబంధించి ఆ బాధ్యతలను తప్పక నెరవేర్చాల్సి ఉంటుంది. కాని బాధ్యతలను విస్మరించేవారు, బాధ్యతల నుంచి పారిపోయేవారు, బాధ్యతను మరొకరి నెత్తిన వేసి తప్పించుకునేవారు సమాజంలో ఎందరో ఉంటారు. వారు ఈ పిల్లవాడి నుంచి ఏమైనా పాఠం నేర్చుకోవచ్చా?
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top