
భాద్రపదమాసంలోని శుక్లపక్షంలో చతుర్థి (చవితి)ని 'వినాయక చవితి' పర్వదినంగా మనం జరుపుకొంటున్నాం. ఈ చవితి నాడే గణపతి ఆవిర్భవించాడు. ఈనాడు చేసే పూజలు, ఉపాసనలు అధికఫలాలను ప్రసాదిస్తాయని పురాణ వచనం. భాద్రపద శుద్ధ చతుర్థినాడే శివుడు వినాయకునికి విఘ్నాలపై ఆధిపత్యమిచ్చాడు. ఈ దేవునికి గణేశోత్సవాలు అన్న పేరుతో తొమ్మిది రోజులు విశేష పూజలు జరుగుతాయి. అంతేగాదు జనులు 'అవిఘ్నమస్తు' అంటూ తొలుత విఘ్నేశ్వరుణ్ణి పూజించడమనే సంప్రదాయం వేద కాలం నుంచి వచ్చింది. అంతటి మహిమాన్వితమైన వినాయక చవితి పండుగను బహిరంగంగా జరపడం ఎప్పటి నుంచి మొదలైంది. ఈ ఆచారం ఎలా వచ్చింది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
1893లో ఇలా గణేశ్ ఉత్సవాలను బహిరంగంగా చేయాలని ప్రస్థావన వచ్చిందట. అందుకు బీజం వేసింది భారత జాతీయవాద నాయకుడు లోకమాన్య తిలక్. ఆయన బ్రిటిష్ పాలన మగ్గిపోతున్న భారత ప్రజలను ఏకం చేసి ఐక్యతతో స్వతంత్రం సంపాదించుకునే దిశగా నడిపించే మార్గంగా ఈ గణేశ్ పండుగను వినియోగించుకోవాలనుకున్నాడట.
పైగా ఆ రోజుల్లో ప్రజా సమావేశాలు నిషిద్ధం. ఇది బ్రిటిష్ వారు విధించిన అనేక ఆంక్షలలో ఒకటి. ఆ నేపథ్యంలో ఈ పండుగను బహిరంగా పెద్ద ఎత్తున చేసుకుని ఒకరికి ఒకరుగా ఒకతాటిపై నిలిచి ఐక్యతను చాటేలా చేయడం మొదలైంది.అలా మహారాష్ట్రలో మొదలైన ఈ బహిరంగా వేడుకలు..మిగతా అన్ని రాష్ట్రాలకు విస్తరించిందట.
గణపతిని ఉద్దేశించి చేసే ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు శ్రమాధిక్య ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ పండుగ కారణంగానే భిన్న భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఒక్కటిగా చేరి వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ సమైక్యతకు, మతసామరస్యానికి వేదికగా ఈ గణేశ్ ఉత్సవాలు నిలిచాయి. అంతేగాదు వసుధైక కుటుంబానికి అసలైన అర్థమే ఈ పండుగ.
(చదవండి: ఆ గ్రామాల్లో వినాయక చవితి పండుగను చేసుకోరు...!)