
ఆకాశాన్ని మేఘాలు కమ్ముకోసాగాయి. మెల్లమెల్లగా మట్టి వాసనను మోసుకొచ్చి ముక్కుపుటాలను తాకేలా చేసింది చిరుగాలి. మేఘాల నుంచి జారి నేలను ముద్దాడటానికి అన్నట్టుగా ఒక దానితో మరొకటి పోటీ పడసాగాయి వర్షపు చినుకులు. ఆ క్షణం నాకు చాలా అసహనంగా తోచింది. సాధారణంగా ధైర్యంగా ఉండే నాకు ఆ వాతావరణం బెదురుగా అనిపించింది.
పూలు అమ్ముకొనే ఒక వృద్ధురాలు అదే బస్టాండ్‌లోకి వచ్చి ఒక చివరన కూర్చుంది. ఒక మనిషి తోడు ఉండటం మూలంగా నేను కాస్త కుదుటపడ్డాను. ఇంకాసేపటికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను నేరుగా వెళ్లి పూలు అమ్ముకునే వృద్ధురాలి పక్కన కూర్చున్నాడు. వారి సంభాషణను బట్టి, వారిద్దరూ భార్యాభర్తలు అని అర్థమైంది. ఈ వయసులో వారి అన్యోన్యతను చూసి ముచ్చటగా అనిపించి నవ్వుకున్నాను. వెంటనే అతను గుర్తొచ్చాడు. బస్టాండ్ షెల్టర్ నుంచి ఒక్కో వాన చినుకు ఒక దాని తర్వాత ఒకటి నేలను తాకసాగాయి. నా జ్ఞాపకాలు గతంలోకి పరుగులు పెట్టాయి.
సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకొనే సమయంలో వాన జల్లులు పడుతున్నాయి. అప్పుడే చూశాను అతన్ని పదునైన చూపులతో కోటేరులాంటి ముక్కుతో, సన్నటి చిరునవ్వుతో ఉన్న అతని అందం నన్ను ఆకర్షించింది. చినుకులుగా రాలిన వానజల్లు జోరువానగా మారింది. ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న నన్ను నా చేయి అందుకొని పక్కనే ఉన్న చెట్టు కిందకి తీసుకుని వెళ్ళాడు అతను. నేను హతాశురాలిని అయ్యి అతన్నే చూస్తూ ఉన్నాను. వెంటనే అతను ‘క్షమించండి వర్షం ఎక్కువ అవుతుంది. మీరు ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతుంటే ఇక్కడికి తీసుకొచ్చాను’ అన్నాడు. ‘పర్వాలేదండి’ అన్నాను నేను. అరక్షణంలోనే తను తన స్నేహితులతో వానలో మాయమైపోయాడు.
ఏదోలా ఇంటికి చేరుకున్న నేను అతని చిరునవ్వును గుర్తు చేసుకుంటూ ఆ రోజును ముగించేశాను.
తెల్లవారుతుండగా ఇంటి ముందు బండిలో నుండి సామాను దించుతున్న శబ్దాలు వినిపిస్తుంటే, అటుగా వెళ్లి చూశాను. ఎవరో ఎదురింట్లో కొత్తగా వచ్చినట్లున్నారు అనుకొని నా పనిలో నేను మునిగిపోయాను. అలా మూడు రోజులు గడిచాయి..
యథావిధిగా ఒక రోజు ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా, ఎదురింట్లోంచి అతను బయటకి వస్తూ ఎదురయ్యాడు. అతనెవరో తెలియనట్లు నా దారిన నేను వెళ్తుంటే అతనే నన్ను గుర్తుపట్టి ‘బాగున్నారా’ అని పలకరించాడు. నేను అతనెవరో తెలియనట్లు ‘ఎవరండీ మీరు?’ అని అడిగాను. దాంతో అతను ఆ రోజు వర్షంలో జరిగిన సంఘటన గుర్తు చేశాడు. ‘గుర్తొచ్చారండి’ అన్నాను నేను.
‘ఇక్కడేం చేస్తున్నారు?’ అని అడిగాను. ‘మూడు రోజుల క్రితమే మీ ఎదురింట్లోకి అద్దెకు వచ్చాను’ అని చెప్పాడు. ‘ఔనా!’ అనేసి వెంటనే తేరుకొని, ‘మా ఎదురింట్లో అంటున్నారు నేను ఇక్కడే ఉంటానని మీకెలా తెలుసు?’ అని అడిగాను. అతను తడబడుతూ, ‘అంటే.. అది.. మీరు ఈ ఇంట్లోకే వెళుతున్నారు కదా! ఇదే మీ ఇల్లు అని అనుకొని అలా చెప్పాను’ అన్నాడు. నాకెందుకో అతని వాలకం అనుమానంగా తోచింది. దాన్ని అంతటితో వదిలేసి ఇంట్లోకి వచ్చేశాను.
రోజులు గడుస్తున్నాయి. అతను అప్పుడప్పుడు ఎదురు పడుతూనే ఉన్నాడు. ఒకరోజు నా పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఎవరో ఒకతను ఒకావిడ పేరు మీద అర్చన చేయిస్తూ ఉన్నాడు. అతని ముఖం కన్పించలేదు. అటు వైపు తిరిగి ఉన్నాడు. అర్చన అయిపోయి ప్రసాదం తీసుకొని అతను వెళ్ళిపోయాడు. నేను కూడా దేవునికి దండం పెట్టుకొని వెనుతిరుగుతూ ఉండగా చిరిగిన అర్చన టికెట్ నాకంట పడింది. అందులో ఉన్న పేరు చూసి షాక్ అయ్యాను.
అందులో ఉన్నది నా పేరే, ‘మేఘన సుబ్రమణ్యం‘. వెంటనే పంతులుగారిని అడిగాను. అర్చన చేయించింది ఎవరని. ‘అతనెవరో నాకు తెలీదమ్మా! కాని మూడేళ్లుగా ఈ పేరుమీద ఇదేరోజున అర్చన చేయిస్తున్నాడు’ అని పంతులుగారు చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు కొంతసేపటి వరకు. కాని, ఒకటైతే అర్థమైంది. అతనెవరో నన్ను కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నాడని. మరి అతను ఎవరు? నేనెలా అతన్ని కనిపెట్టేది అని తెగ ఆలోచించసాగాను.
కాని నా బుర్రకు ఏ ఆలోచనా తట్టలేదు. నా ఆలోచనలు అలా సాగుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం మా ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది నా పేరు మీద. ఏంటా అది అని తెరిచి చూస్తే అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్‌లో–‘‘సుందరి! ఇది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. ‘ఇదే ఎందుకు పెట్టుకున్నాడు?’ అని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ‘సుందరీ నేనే నువ్వంటా, చూడని నీలో నన్నంటా’. అనే దళపతి సినిమాలో పాట చాలా ఇష్టం.
ఆ పాట వింటూ నేను నిన్ను నా సుందరిగా ఊహించుకుంటూ ఉంటాను. ఇంతకు నేనెవరో నీకు తెలియదు కదూ! నేను నీ అజ్ఞాత ప్రేమికుడిని. గత మూడేళ్లుగా నిన్ను చూస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ రోజులు గడుపుతూ ఉన్నాను. నిన్ను చూసిన మొదటి క్షణం ఒక తండ్రి తనకు కూతురు పుట్టింది అని తెలియగానే పడే ఆనందపు తాలుకా అనుభూతిని నాలో నేను చూశాను. ఆ అనుభూతి ఇంతకు ముందెప్పుడు నాకు కలగలేదు. అప్పుడే ఫిక్స్ అయ్యాను నువ్వే నా సుందరివని, నిన్ను ఎప్పుడు విడువలేనని.
కాని, ఇక్కడే పెద్ద సమస్య వచ్చిపడింది. అదేంటంటే, నేను నీ ముందుకు రాలేనని, నేనెవరినో నీకు తెలియకుండా ఉండాలని నా తలరాత నాకు చెప్పింది. అందుకే ఈ దాగుడుమూతలాట. తెలియకుండా ఉండాలని అనుకొని ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు రాశాడని నువ్వు అనుకోవచ్చు. కాని, నాలో అంతా ఇంతా కాదు, బోలెడంత ప్రేమ ఉంది నీ మీద. ఆ ప్రేమ నా మనసులో సరిపోలేక, అందులో దాగక బయటకి వస్తా వస్తా అని మొర పెడుతోంది. అందుకే దాని మొరకు ఈరోజు విముక్తినిచ్చాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా ప్రేమ నీ చెంతకు చేరిందని...’’ఇట్లు అజ్ఞాత ప్రేమికుడు.
ఎవరు ఈ అజ్ఞాత ప్రేమికుడు? ఇన్నేళ్లుగా నన్ను ఫాలో అవుతుంటే నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? అంత ప్రేమను నామీద పెంచుకొని ఎందుకు నా దగ్గరకు రాలేకపోతున్నాడు? నన్ను కలవలేకపోతున్నాడు? ఇలా నా మైండ్, నా మనను ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాయి. ఎంతకూ అర్థంకాలేదు కాని, ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యాను. ఆ అజ్ఞాత ప్రేమికుడిని ఎలాగైనా కలవాలని, తన ప్రేమను కళ్ళారా చూసి, అనుభూతి పొందాలని. అలా ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోయింది.
నేను ఆ ఆజ్ఞాత ప్రేమికుడిని వెతికే పనిలో పడ్డాను. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజూ మా ఎదురింటి అబ్బాయి నాకు తారసపడుతూనే ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో. అలా మా మధ్య స్నేహం కూడా కుదిరింది. నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తునే ఉన్నాడా అబ్బాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్‌ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ.
అందుకేనేమో, ఇద్దరి బాధలు ఒకటై ఒకరిలో ఒకరం అమ్మనాన్నల ప్రేమను వెతుక్కుంటూ ఉన్నాం. అతని స్నేహం నా అజ్ఞాత ప్రేమికుని వెతుకులాటను మరచిపోయేలా చేసింది. కాని, మధ్య మధ్యలో అతను రాసిన లెటర్ గుర్తొచ్చేది. ఎంత వెతికినా అతను నాకు దొరకలేదు. కాని, ఎందుకో అతను నాదగ్గరే ఉన్నట్లు, నన్ను ప్రతిరోజు గమనిస్తున్నట్లు, నా చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుండేది.
ఎందుకో కొన్ని రోజుల నుంచి మా ఎదురింటి అబ్బాయి నాకు కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడులే అని అనుకున్నాను. అలా రోజులు కాదు, నెలలు కూడా అయ్యాయి. అయినా ఆ అబ్బాయి ఇంకా రాలేదు. ఏమై ఉంటాడు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే సందేహం కలిగింది. కాని, ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్ళి ఉంటాడని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అలా ఒక రోజు నేను ఎప్పుడూ వెళ్ళే శివాలయానికి వెళ్ళాను చాలా రోజుల తర్వాత.
పూజ పూర్తి చేసుకుని బయలుదేరుదాం అన్న సమయానికి నా పుట్టినరోజున మాట్లాడిన పంతులుగారు ఎదురుపడి, ‘ఆరోజు నువ్వు ఒక అబ్బాయిు గురించి అడిగావు కదా! ఆ అబ్బాయి తన విజిటింగ్ కార్డు గుళ్లో పడేసుకున్నాడు. అది నాకు దొరికిందమ్మా! దాన్ని చూస్తే నువ్వే నాకు జ్ఞాపకం వచ్చావు. అందుకే నీ కోసమే దాన్ని దాచి ఉంచాను’ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి నాకిచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. ఎన్నో రోజుల నుండి వెతికినా, ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో నాకు తెలిసే సమయం ఆసన్నమైందని మనసు పులకరించిపోయింది.
దాన్ని తీస్కోని చూశాను. అందులో ‘సూర్య జాగర్లముడి’ అని పేరు ఉంది. ఈ పేరు నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. వెంటనే అడ్రస్ చూశాను. చూడగానే నా మైండ్ ఒక్కసారిగా పని చేయడం ఆగిపోయింది. ఎందుకంటే ఆ అడ్రస్ మా వీధిలో ఉండే ఒక ఇంటి అడ్రస్. నేను నమ్మలేకపోయాను. వెంటనే తేరుకుని పంతులుగారికి థాంక్స్ చెప్పేసి, పరుగుపరుగున ఆ ఇంటికి దారితీశాను. ఆ ఇల్లు ఉన్న అడ్రస్‌కు చేరుకున్నాను. తాళం వేసి ఉంది ఆ ఇంటికి.
ఏం చేయాలో తోచలేదు. సమయానికి మా ఎదురింటి అబ్బాయి కూడా లేడు. నాకే ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఒక రాయి తీసుకొని తాళం పగులగొట్టాను. తలుపులు తీసుకొని గదిలోకి అడుగు పెట్టాను. అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించలేదు. వెంటనే గోడ మీద స్విచ్‌బోర్డు వెతికి స్విచ్ వేశాను. అంతే గోడకు ఉన్న ఫోటో చూసి హతశురాలయ్యాను. ఆ ఫోటోలో ఉన్నది మా ఎదురింటి అబ్బాయి కిరణ్. అంటే అతని పూర్తి పేరు ‘సూర్య కిరణా!’
నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా ఒక కలలా తోచింది. ఇన్ని రోజులు నా దగ్గరే ఉంటూ, నాతో మాట్లాడుతూ ఎందుకు ఈ దాగుడు మూతలాడటమో నాకు అర్థం కాలేదు. నా స్నేహితుడే నా అజ్ఞాత ప్రేమికుడు అని తెలిసి, నా మనసు అతలాకుతలమైంది.కాని, ఆ సంతోషం నీటి ఆవిరిలా క్షణకాలంలో మాయమైపోబోతోందని ఆ క్షణంలో నాకు తెలియలేదు. అప్పుడే నా కంట పడింది ఒక ఉత్తరం అది తీసి చదవడం మొదలుపెట్టాను.
అందులో...‘సుందరి నువ్వు వస్తావని నాకు తెలుసు. కాని, నువ్వు వచ్చే సమయానికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. అవును క్యాన్సర్‌తో పోరాడుతున్న రోజులవి. అప్పుడే నేను నిన్ను మొదటిసారి చూశాను. చిన్న పిల్లలాంటి నీ మనస్తత్వం నిన్ను ప్రేమించేలా చేసింది. కాని, నీకు నా ప్రేమను చెప్పుకునే పరిస్థితిలో లేను. చెప్పి నిన్ను కూడా నా ప్రేమలో పడేసి, నీకు దూరంగా వెళ్ళిపోయి, తీరని బాధని నీకు మిగల్చకూడదు అనుకున్నాను. అందుకే నీకు దూరంగా ఉంటూ, నిన్ను చూస్తూ, ప్రేమిస్తూ ఉన్న సమయంలో నువ్వే నా దగ్గరకు వచ్చావు.
నన్ను చూస్తూ మైమరచిపోయిన ఆ రోజును నేను మరచిపోలేను. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్న నిన్ను గట్టుకు చేర్చాను. ఆ రోజు అనుకున్నాను నేను ఇంకా నీకు దూరంగా ఉండలేనని. అందుకే మీ ఎదురింటికి వచ్చేశాను. నీతో స్నేహం చేశాను. నిన్ను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉన్నాను. కాని, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది.
అందుకే నీకు చెప్పలేక దూరంగా వెళ్ళిపోయాను. ఎంతో వేదనతో ఈ ఉత్తరం నీకోసం రాశాను– ఎప్పటికైనా నీదగ్గరికి చేరుతుందని నమ్ముతూ...ఉత్తరం నా చేయి జారిపోయింది. ఎడతెరపి లేని వానలా, ఉప్పొంగే వరదలా, ఉగ్రరూపం దాల్చిన సముద్రపు అలల్లా నా మనసు రోదించింది. నా జ్ఞాపకాలు గతం నుంచి బయటకు వచ్చాయి. నా కన్నీరు ఏ కంటికి కానరాకుండా ఇదే వాన నీటిలో కనుమరుగయ్యాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్‌ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ.
(చదవండి: యువ కథ: వసంత కోకిల)