
భానుడు భగ భగమంటూ నిప్పులు కురిపిస్తున్న వేసవిలో ఉసురుమంటూ ‘ఏమేవ్! కాసిన్ని మంచినీళ్లు తీస్కునిరావే’ అంటూ వాలుకుర్చీలో కూలబడ్డాడు గురుమూర్తి. పంకజం భర్త కేక విని చెంబుడు నీళ్లతో పరుగున ప్రత్యక్షమైంది. నీళ్ల చెంబు అందుకుంటూ, ‘అబ్బా ఏమి ఎండలో! ఎండిన గడ్డిలాగా అయిపోతున్నాం’ అంటూ దాహం తీర్చుకుని చెంబు చేతికిచ్చాడు. ‘ఇదిగో ఒక పావుగంట అయినాక భోజనం వడ్డించు. తిని బయలుదేరాలి’ అంటూ పడకగది వైపు వెళ్ళాడు. పంకజం భోజనం వడ్డించి, భర్త కోసం ఎదురుచూస్తోంది.
ఇంతలో ‘ఒసేయ్ ఇంటిదానా ఇటు రా!’ బిగ్గరగా అరిచాడు గురుమూర్తి. కంగారుగా పరుగు పెట్టింది పంకజం.‘ఏమిటి ఏమైంది?’ అంటూ ఆత్రంగా అడిగింది. కోపంతో ఊగిపోతూ, ‘ఈ ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది?’ అంటూ శివాలెత్తాడు. ఆ ఫోటో వాళ్ళ కూతురు కోకిలది. ఆ ఫోటో అందుకుంటూ, కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ‘అది బూజు దులిపేటప్పుడు ఇక్కడ పెట్టాను’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పంకజం.గురుమూర్తి భోజనం చేసి మధ్యాహ్నం బండికి పట్నం బయలుదేరాడు ఆస్తుల రిజిస్ట్రేషన్ కాగితాల కోసం.సాయంత్రం సంధ్యా దీపం పెట్టి, ఆరుబయట వరండాలో మామిడిచెట్టు అరుగుపైన కూర్చుని మల్లెపూలు అల్లుతోంది పంకజం.
ఒక్కో పువ్వు తీసుకుంటూ, ఒక్కో జ్ఞాపకం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా, దూరపు చుట్టం కాంతమ్మ వచ్చింది.‘వదినా ఓ వదినా! హమ్మయ్య ఇక్కడున్నావా? ఇల్లంతా వెదికి వస్తున్నా సుమీ!’ అంది. పంకజం తేరుకొని, ‘వదినా బాగున్నావా? అందరూ క్షేమమేనా?’ అంటూ కుశల ప్రశ్నలడిగి, దాహం ఇచ్చింది. ‘అంతా బాగుంది కాని, వదినా నేను విన్నది నిజమేనా?’ అంటూ ఉండగానే, పంకజం మధ్యలో ఆపి, ‘సరే వదినా! మర్చిపోయాను గుడికి వెళ్ళాలి ఏమనుకోకు. తయారవడానికి వెళుతున్నా. తర్వాత మాట్లాడుదాం’ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ‘ఇదేం చోద్యమో’ అనుకుంటూ కాంతమ్మ వీధిలోకి నడిచింది.
కాసేపయ్యాక పంకజం ‘మాట దాటేయటానికి గుడి అన్నాను కానీ ఒకసారి గుడికెళ్లి వస్తే కాస్త మనసు కుదుటపడుతుంది’ అనుకుని గుడికి బయల్దేరింది. దర్శనం అయ్యాక, గుళ్లో కూర్చుని ఒక్కసారిగా గతం గుర్తు చేసుకుంది.కట్టుబాట్లు çపరువుప్రతిష్ఠలే ప్రాణప్రదంగా జీవించే మనస్తత్వం గురుమూర్తిది. అందులోనూ ఆడపిల్లకి గురుమూర్తి తనకు తాను కొన్ని కట్టుబాట్లు పెట్టాడు. అందుకేనేమో ఆ దేవుడు ఆయనకి ఒక్కగానొక్క కూతుర్ని ఇచ్చాడు. చూడటానికి రెండు కళ్లూ చాలవన్నంత అందం అమ్మాయిది. పేరు కోకిల.
ఈ కాలంలో కూడా చిన్నప్పటి నుండి పరదా వెనుక నుంచే కోకిల చదువు, సంగీతం అన్నీ. కాని, పెద్దచదువు చదివి, మంచి ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే భావాలు ఆమెవి. గురుమూర్తి చాదస్తపు కట్టుబాట్ల వల్ల తన కోరిక ఒక ఎండమావిలా అగుపించేది. ఎలాగోలా ఓపెన్‌లో ఇంటర్ పరీక్షలు రాసింది. కాని, అసలైన పరీక్ష తన పెళ్లి అని తనకి తెలియదు. గురుమూర్తి కోకిల కోసం పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసి తల్లి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంది కోకిల. తల్లి పంకజం ఏమీ చేయలేని నిస్సహాయురాలని గ్రహించి, నేరుగా తండ్రితోనే తాను అనుకున్నది చెప్పాలనుకుంది. ఒకరోజు వసారాలో పేపర్ చదువుతున్న గురుమూర్తి దగ్గరికి వెళ్లి, పైచదువులు చదువుకుంటానని చెప్పింది.
అతను వినలేదు. కన్నీళ్లు పెట్టుకుని, బాధపడింది. అయినా కట్టుబాట్లతో కఠినంగా మారిన గురుమూర్తి హృదయం కరగలేదు. పెళ్లివారు రానే వచ్చారు అబ్బాయి వయసులో తనకన్నా పన్నెండేళ్లు పెద్దవాడు. గవర్నమెంట్ ఉద్యోగం అని గురుమూర్తి ఒప్పుకున్నాడు. కోకిలకి ఏమాత్రం చెప్పకుండా, కనీసం అబ్బాయి ఫొటో అయినా చూపకుండా పెళ్లి కుదిర్చాడు. కోకిల వేదన అరణ్యరోదనే అయింది. వారం రోజుల్లో పెళ్లి. రెండు రోజులయ్యాక పేపర్‌లో డిగ్రీలో ప్రవేశం గురించి వార్త చూసింది కోకిల. ఒకవైపు చదుకోవాలనే తపన. ఇంకోవైపు బలవంతపు పెళ్లి. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఆమెది.
ఏదేమైనా తన జీవితం తనది అనుకుంది. తల్లి దగ్గరకి వెళ్లి డిగ్రీ చేరుతానని, తన జీవితాన్ని నిలబెట్టమని కాళ్ళపైన పడింది. తల్లి తన పుట్టింటి వారు ఇచ్చిన నగలు కోకిలకిచ్చి, నాలుగు జతల బట్టలు సంచిలో పెట్టి తనకి తెలిసినవారు పట్నంలో ఉన్నారంటూ, వాళ్ళ అడ్రస్ కాగితం ఇచ్చి బయటకి పంపించేసింది. కోకిల ఇంట్లో కనిపించకపోవటం, పెళ్లి ఆగిపోవటంతో పరువు పోయినట్లు భావించిన గురుమూర్తి, పచ్చని పెళ్లిపందిట్లో తలంటు పోసుకుని, తన బిడ్డ చనిపోయిందంటూ కోపంతో ఊగిపోయాడు.
గుడిలో గంట ఖంగుమని మోగిన శబ్దంతో ఉలికిపడిన పంకజం జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి, ఇంటికి బయలుదేరింది.
ఇదంతా జరిగి ఐదేళ్లు అయింది. ఈ ఐదేళ్లూ్ల కోకిల గురించిన క్షేమ సమాచారం ఏదీ లేదు.రాత్రి పొద్దుపొయే సమయానికి గురుమూర్తి అలసిపోయి వచ్చాడు. కాళ్ళు కడుక్కుని లోనికి వచ్చి, ‘పని అవలేదు. రేపు పట్నం వెళ్ళాలి. తెల్లవారి నాలుగు గంటలకి నిద్రలేపు’ అని చెబుతూ, భోజనం ముగించి నిద్రకి ఉపక్రమించాడు. పట్నం అనగానే పంకజం మనసంతా కోకిల గురించే తపన. త్వరలో తన ఆచూకీ తెలిస్తే బాగుండు అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి దండం పెట్టుకుంది.తెల్లవారి నాలుగు గంటలకి గురుమూర్తిని లేపింది పంకజం.
గురుమూర్తి స్నానపానాలు ముగించుకుని, పట్నానికి బయలుదేరాడు. ఉదయం పదిన్నర గంటలకి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్ళాడు. ‘ఇక్కడ పని జరగదు. ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్ళాలి’ అని చెప్పారు. సరేనంటూ ఎమ్మార్వో ఆఫీస్‌కు బయలుదేరాడు.ఎమ్మార్వోగారు ఇంకా రాలేదని పక్కగదిలో వేచి ఉండమని చెప్పాడు బంట్రోతు. పక్కగదిలో కూర్చున్నాడు గురుమూర్తి. పదినిముషాల తర్వాత కాస్త సందడిగా అనిపించింది. బంట్రోతు వచ్చి, ‘ఎమ్మార్వోగారు వచ్చారు. రావాల’ని చెప్పాడు.‘ఎమ్మార్వోగారికి నమస్కారం’ అంటూ గదిలోకి వెళ్లి, తాను తెచ్చిన డాక్యుమెంట్లు చూపించబోతూ, ఎమ్మార్వోని చూసి నిర్ఘాంతపోయాడు గురుమూర్తి.
‘నువ్వా?’ అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ ఎమ్మార్వో ఎవరో కాదు, కోకిల!ఏమాత్రం మారని తండ్రిని చూస్తూ మౌనంగా నిలబడింది కోకిల.గురుమూర్తి ఇంటికి చేరుకొని, బావి దగ్గర తలమీద నీళ్లు గుమ్మరించుకుని. ‘దేవుడా క్షమించు! చచ్చినవాళ్ల దగరికి వెళ్లొచ్చాను’ అంటూ దేవునికి దండం పెట్టుకున్నాడు. భర్తను చూస్తూ నిశ్చేష్టురాలై, నిలబడిపోయింది పంకజం.కాసేపయ్యాక నెమ్మదిగా గదిలోకి వెళ్లి, ‘ఏమైందండీ?’ అని భయపడుతూనే అడిగింది.ఒక్కసారిగా భర్త చూసిన చూపుకి భయపడి, గదిలోనించి బయటకు వెళ్ళింది. ఆ రాత్రి ఎలాగో గడిచింది. తెల్లారాక ఇంటి వసారా ఊడ్చి, గుమ్మం ముందు ముగ్గు పెటి,్ట మామిడిచెట్టు అరుగుపైన కూర్చుని, పంకజం ఆలోచించసాగింది ‘భర్త కోపానికి కారణం ఏమై ఉంటుందా?’ అని.‘ఒసేయ్! కాసిన్ని కాఫీ నీళ్లయినా ఇవ్వకుండా, అంతగా ఆలోచిస్తూ బయటే ఉన్నావేంటే’ అంటూ భర్త గొంతు వినేసరికి ఉరుకున లోపలికి వెళ్ళింది.
గురుమూర్తి వసారాలో వాలుకుర్చీలో కూర్చుని, ఏదో ఆలోచిస్తున్నాడు.అతని మొహంలో ఏదో వెలితి ఉందని పంకజం గ్రహించలేకపోలేదు. వేడి వేడి కాఫీ భర్తకు అందించి, ఏదో చెప్తాడేమోనని అక్కడే నిలబడింది.ఇంతలో గుమ్మంలో ఏదో కారు ఆగిన శబ్దం వినిపించడంతో ఇద్దరూ అటు చూశారు. కారులోంచి నారింజ రంగు కాటన్ చీర కట్టుకుని, నిండైన రూపంతో దిగి నిలబడింది కోకిల. పంకజం తదేకంగా చూసి తన బిడ్డే అని గ్రహించి, ‘అమ్మా! కోకిలా!’ అంటూ గుమ్మంవైపు పరుగు పెట్టింది. ఇంతలో ‘ఆగు పంకజం’ అని భర్త హూంకరించడంతో అడుగు ముందుకేయలేదు.
‘ఏవండీ మన బిడ్డ ఇన్నేళ్లకు కళ్ల ముందుకు వస్తే, నా తల్లి పేగు ప్రేమని ఎందుకు ఆపుతున్నారు?’ అంటూ భోరున ఏడ్చింది భర్త వైపు తిరిగి. ‘మన బిడ్డ ఎక్కడుందే ఐదేళ్లకు ముందే అది చచ్చింది. దాన్ని అటునుంచే పొమ్మను’ అన్నాడు ఉక్రోషంగా. ఇంతలో ‘క్షమించండి. బతికి ఉన్న నా భార్యను అలా అనటానికి నేను ఒప్పుకోను’ అంటూ కోకిల పక్కగా వచ్చి నిలబడ్డాడు వసంత్. అజానుబహుడి రూపం. ‘చూడ చక్కని జంట, చూసే కనులకు పంట’ అన్నట్లు ఉన్నారు ఇద్దరూ. గురుమూర్తి కోపం ఇంకా ఎక్కువైంది. ‘ఓహో దీన్ని కట్టుకున్న దరిద్రునివా నువ్వు?’ అన్నాడు.
వసంత్ లోపలికి వచ్చి, ‘చూడండి మామగారు సంప్రదాయాలు సంస్కృతి ఉండాలి. కట్టుబాట్లు ఉండాలి కాని, అవి జీవితాలను నాశనం చేసేలా ఉండకూడదు. మీ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవలసిన మీరే తనకి జీవితం లేకుండా చేయటం కరెక్ట్ అంటారా? అంతే కాదు మీరు ఎవర్ని అయితే మీ కూతురికి ఇచ్చి చేయాలనుకున్నారో అతను ఇప్పుడు లంచం తీసుకున్నందుకు ఉద్యోగం పోగొట్టుకుని, జైల్లో ఉన్నాడు. ఆనాడు కోకిల బయటకి రాకపోయి ఉంటే ఈనాడు తన జీవితం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి’ అన్నాడు వసంత్.
ఆలోచనలో పడ్డ గురుమూర్తి కుర్చీలో కూర్చున్నాడు. కోకిల లోపలికి వచ్చి, ‘నాన్నా! నన్ను క్షమించండి. మీ మాట కాదని ఇంట్లోంచి వెళ్ళటం తప్పే కాని, నా జీవితం కోసం వెళ్లక తప్పలేదు’ అంది.
‘అమ్మా!. ఆ రోజు ఇంటి నుంచి బయటపడ్డాక రైలులో పట్నానికి బయలుదేరాను. తోవలో నిద్రలో ఉండగా, నువ్వు ఇచ్చిన నగలు, డబ్బు, తెలిసినవాళ్ళ అడ్రస్ చీటీ అన్నీ పోయాయి. ఏం చేయాలో దిక్కు తోచక స్టేషన్‌లో ఏడుస్తూ ఉంటే, ఈయన నన్ను చేరదీసి, వివరాలు తెలుసుకుని, నన్ను ఒక ఆశ్రమంలో చేర్చారు. నా చదువు, నా బాగోగులు చూసుకుంటూ, నా కాళ్ళ మీద నేను నిలబడేట్లు చేసి, ఈ రోజు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారు. నన్ను పెళ్లి చేసుకుని జీవితానికి భరోసా ఇచ్చారు. ఈయన లేకపోతే నాన్న అన్నట్లు ఏనాడో చనిపోయేదాన్ని’ అంటూ కన్నీళ్ల పర్యంతం అయింది.
ఈ మాటలు గురుమూర్తిని కరిగించాయి. తన మూర్ఖత్వంతో ఇన్నాళ్లూ భార్యను, ఒక్కగానొక్క బిడ్డను ఎంత ఇబ్బంది పెట్టాడో తలచుకొని పశ్చాత్తాపపడ్డాడు. తమ బిడ్డకి అమూల్యమైన జీవితాన్ని ఇచ్చిన వసంత్‌ను కృతజ్ఞతగా చూస్తూ పంకజం, గురుమూర్తి కన్నీళ్లు పెట్టుకున్నారు.కోకిల వసంత్‌లు వాళ్లను ఓదార్చి, కోకిలకి ఆ ఊరు ట్రాన్స్‌ఫర్ అయిందని చెప్పారు. వారి సంతోషానికి అవధుల్లేవు. ఇంతలో ఒక బంట్రోతు వసంత్ దగ్గరికి వచ్చి, ‘కలెక్టర్‌గారు! మిమ్మల్ని తీసుకెళ్ళటానికి కారు వచ్చింది’ అని చెప్పాడు. పంకజం, గురుమూర్తి ఆశ్చర్యచకితులై ‘ఏమిటి మా అల్లుడుగారు కలెక్టరే!’ అంటూ మురిసిపోయారు.
ఆ రోజు నుండి వారి ఇల్లు ఆనంద నిలయమైంది. ఎన్నడూ లేనిది గురుమూర్తి, ‘పంకజాక్షీ! నన్ను క్షమించు. భర్తనని, మగవాడినని అహంకారంతో నిన్ను ఇన్నేళ్లూ చాలా కష్టపెట్టాను. ప్రేమగా ఉండాల్సింది పోయి, కట్టుబాట్ల పేరుతో ఇబ్బంది పెట్టాను’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.‘మనమధ్య ఈ క్షమాపణలు ఏవిటండీ’ అని కళ్లు తుడుకుంది పంకజం. పెళ్ళైన ఇన్నేళ్లకి భర్త తనను పూర్తి పేరుతో పిలిచినందుకు సిగ్గుపడ్తూ. ఇంతలో ‘ఏమోయ్, పంకజాక్షి! నా కూతురు, అల్లుడే నా మార్పుకి కారణం’ అని మనసారా నవ్వులు పూయించాడు గురుమూర్తి.తన కూతురు ఎడారిలో కోయిలగా మిగిలిపోతుందేమోనని భయపడ్డ పంకజం వసంత కోకిలలా మారిన కూతురిని చూసి మనసు నిండా తృప్తి చెందింది.
∙