అనగనగా ఒక ఆడవి. గుహలో సింహం పెద్దగా నోరు తెరిచి శబ్దం చేస్తోంది తప్ప మాట్లాడలేకపోతోంది. దాని ఎదురుగా కొన్ని జంతువులు కూర్చుని విచారంగా చూస్తున్నాయి. జరిగిన విషయం ఏంటంటే ఆ ఉదయం మృగరాజు ఒక జింకను వేటాడి తింటున్నప్పుడు ఒక ఎముక దవడలో గుచ్చుకుంది. దాంతో విపరీతమైన నొప్పి... తినడం కాదు కదా నోరు మూయలేని స్థితి.
అంతలో ఆగమేఘాల మీద మంత్రి నక్కగారు వచ్చారు. పరిస్థితి అర్థం చేసుకుని, ‘మరేం భయం లేదు. ఇప్పుడే మన కొంగను పిలిపిస్తాను అది చిటికెలో మీ సమస్యను పరిష్కరిస్తుంది’ అని చెప్పి మిగిలిన జంతువులన్నింటినీ పంపేసింది. సింహం నిస్సహాయంగా తలూపింది. అరగంటలో అక్కడికి కొంగగారు రానే వచ్చారు. సింహం నోట్లోకి పరికించి చూసి ‘అవును మహారాజా! మీ నోట్లో ఒక ఎముక గుచ్చుకోనుంది దాన్ని తొలగిస్తాను. కానీ మీరు నాకు మూల్యం చెల్లించాలి’ అంది.
సింహం, నక్క కోపంగా చూశాయి. ‘మూల్యమంటే కేవలం పది ఎండు చేపలు ఇస్తే చాలు మహారాజా!’ అంది కొంగ వినయంగా. నక్క ఏదో అనబోతుండగా సింహం వారించి సరే అలాగే అన్నట్లు తలాడించింది. పది నిమిషాల్లో సింహం నోట్లో తలపెట్టి ఆ ఎముక ఎక్కడుందో వెతికి బయటకి లాగి పడేసింది కొంగ. హమ్మయ్య అనుకుంది సింహం.
‘ఏంటి ఇప్పుడు చెప్పు నీకు మూల్యం కావాలా? నా నోట్లో నీ తల ఉన్నప్పుడు కొరకకపోవడమే నీకు నేనిచ్చే మూల్యం...’ అంది సింహం వికటంగా. ‘ఇది మోసం మహారాజా...’ అనబోతున్న కొంగపైకి దూకింది నక్క. అంతేకాదు, అప్పటికప్పుడే గుహ తలుపులు మూయించేసింది. కొంగకు భయం వేసింది. గుహ కప్పు అంత ఎత్తుగా లేదు. ఒకవైపు నుంచి నక్క మరోవైపు నుంచి సింహం దాని మీద దాడికి చూస్తున్నాయి. కొంగకు ఏం పాలు పోలేదు. అక్కడక్కడే ఎగురుతూ తప్పించుకోవడానికి చూస్తోంది. పైకప్పులో బండల మధ్య ఉన్న ఒక రంధ్రాన్ని గమనించి తుర్రున దాంట్లో నుంచి ఎగిరిపోయి, ‘బతుకు జీవుడా’ అనుకుంది కొంగ.
అప్పుడు సింహం విస్తుపోతూ, ‘ఆ బండల మధ్య సందును వెంటనే మూయించు’ అని నక్కను ఆదేశించింది. ప్రాణభయంతో ఎగిరిపోయిన కొంగ దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద అలసట తీర్చడానికి వాలింది. ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటు మత్తుగా కునికిపాట్లు పడుతోంది. ‘ఏంట్రా అలా భయంతో గజగజ వణుకుతున్నావు? ఏమిటి సంగతి?’ అంది ఎలుగు దాన్ని చూస్తూ. సింహం, నక్క తనకు చేసిన అన్యాయం గురించి కొంగ చెప్పి వాపోయింది. ‘వాళ్లంతే! నీచులు’ అంది ఎలుగు.
అంతలోనే నక్క అటుగా రావటం చూసి కొంగ ఎగిరిపోయింది. నక్క చెట్టుకు దగ్గరకు వచ్చి ‘మామా! మన రాజుగారి గుహపైన ఒక కంత ఉంది. పెద్ద బండతో దాన్ని నువ్వు పూడ్చాలి. వెంటనే రమ్మని రాజాజ్ఞ’ అంది నక్క దర్పంగా. ‘అలాగే అల్లుడు... పద వస్తాను’ అంటూ చెట్టు దిగింది ఎలుగు. రెండూ గుహ దగ్గరకు వచ్చాయి.
నక్క దర్జాగా గుహలోకి వెళ్ళి, సింహంతో ముచ్చట్లు పెట్టింది. ఎలుగు గుహ పైకి ఎక్కి కంత ఎక్కడ ఉందో చూసింది. ఈ రెంటికి బుద్ధి చెప్పాలని అనుకున్న ఎలుగు– కంతకు సరిపడ బండ కాక కొద్దిగా చిన్న సైజు బండతో దాన్ని కప్పబోయింది. అంతే! ఆ బండ దడేల్న లోపల ముచ్చట్లు చెప్పుకుంటున్న నక్క తలను పచ్చడి చేసి, పక్కనే ఉన్న సింహం పైకి దొర్లింది. దాని ముందు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి.
సింహం బాధతో, భయంతో అరవడం మొదలు పెట్టింది. గుహ తలుపులు మూసి ఉండడం వల్ల ఆ అరుపులు బయట ఎవరికీ వినపడలేదు. ఎలుగు నవ్వుకుంటూ, కంతకంటే పెద్దదైన బండతో ఆ ఖాళీని అప్పుడు మూసేసింది. రాజు, మంత్రి అనే గర్వంతో సింహం, నక్క చేస్తున్న అరాచకాలకు అలా అడ్డుకట్ట వేసింది ఎలుగు. సింహం ఆహారం, నీళ్లు లేక గొంతు ఎండుకు పోయేలా అరిచి అరిచి కొన్నాళ్లకు ప్రాణాలు విడిచింది.
చంద్ర ప్రతాప్ కంతేటి


