పూర్వం పాంచాల రాజ్యాన్ని పురుయశుడు అనే రాజు పాలించేవాడు. అతడి కొడుకు పుణ్యశీలుడు. బాల్యంలోనే పుణ్యశీలుడు సదాచారాలను పాటించేవాడు. గురుకులంలో చేరి, అస్త్రశస్త్ర విద్యలు సహా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. తండ్రి పురుయశుడు గతించాక పుణ్యశీలుడు రాజ్యపాలన చేపట్టాడు. ధర్మం తప్పక ప్రజలను పాలించసాగాడు. కొన్నేళ్లు సజావుగానే గడిచినా, కొంతకాలానికి పుణ్యశీలుడి రాజ్యంలో దారుణ దుర్భిక్షం సంభవించింది. రోగాలు సోకి ఏనుగులు, గుర్రాలు మరణించాయి. ధనాగారంలోని ధనమంతా నశించింది. రాజ్య నిర్వహణ కష్టతరంగా మారింది. గజబలం, అశ్వబలం నశించడంతో పుణ్యశీలుడు బలహీనంగా మిగిలాడు. శత్రురాజులు ఈ సంగతి తెలుసుకుని, పుణ్యశీలుడి మీదకు దండెత్తి వచ్చారు.
యుద్ధంలో పుణ్యశీలుడు ఓటమిపాలయ్యాడు. భార్య శిఖినితో కలసి అడవులకు చేరుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఒక కొండగుహలో తలదాచుకోసాగాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని, అడవులపాలైన పుణ్యశీలుడు తనలోనే తాను కుమిలిపోసాగాడు. ‘ఇంతటి దుస్థితి నాకెందుకు వచ్చింది? తల్లిదండ్రులను భక్తితో సేవించుకున్నాను. గురువుల పట్ల వినయ విధేయతలతో నడుచుకున్నాను. దైవభక్తి గలవాడిని. భూతదయాపరుడిని. సదా సదాచారపరాయణుడనైన నాకెందుకు ఇంతటి కష్టం కలిగింది’ అని నిత్యం బాధపడసాగాడు.
పుణ్యశీలుడు అడవులపాలై యాభైమూడేళ్లు గడచిపోయాయి. అతడి దుఃఖం అంతకంతకు పెరగసాగింది. ఒకనాడు అతడు తన గురువులైన యాజ ఉపయాజకులను స్మరించుకున్నాడు. అతడు మనసులో తలచినదే తడవుగా యాజ ఉపయాజకులు అతడి ముందు ప్రత్యక్షమయ్యారు. పుణ్యశీలుడు ఎదుట నిలిచిన గురువులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజలాంఛనాలు లేకుండా, సామాన్యుడిలా ఉన్న పుణ్యశీలుడు గురువులను చూసి, కన్నీరు కార్చసాగాడు. వారు అతడిని లేవదీశారు. పుణ్యశీలుడు ఫలపుష్పాదులతో గురువులను పూజించాడు.
‘‘గురువులైన విప్రులారా! నేను రాజును. జన్మ కర్మల చేత పవిత్రుడను. పితృదేవతా భక్తుడను. పాపభీతి గలవాడను. నాకు ఇంతటి కష్టం సంభవించడానికి కారణమేమిటి? శత్రువుల చేతిలో ఓటమి పాలై, రాజ్యాన్ని, ధనాన్ని పోగొట్టుకుని, ఏళ్ల తరబడి ఎవరికీ తెలియకుండా, ఇలా అడవుల్లో గడపవలసిన దుస్థితి ఏర్పడటానికి కారణమేమిటి? అసలు నా రాజ్యంలో దుర్భిక్షం వాటిల్లడానికి కారణమేమిటి?’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
‘‘రాజా! నీ దుఃఖానికి, దుస్థితికి కారణాన్ని చెబుతున్నాం, విను. పూర్వం పదిజన్మలలో నువ్వు కిరాతుడివై ఉండేవాడివి. హింసాత్మకుడివై, కఠినాత్ముడివై జనాలను పీడించేవాడివి. ఏనాడూ ధర్మ కార్యాచరణ చేయలేదు. ఇంద్రియ నిగ్రహాది సుగుణాలు లేక యథేచ్ఛగా సంచరించేవాడివి. పొరపాటునైనా శ్రీహరి నామాన్ని ఉచ్చరించలేదు. తొమ్మిది జన్మలు ఇలాగే గడిచిపోయాయి. పదో జన్మలో సహ్యాద్రి ప్రాంతంలో కిరాతుడివై జన్మించావు. గడచిన తొమ్మిది జన్మల మాదిరిగానే పదో జన్మలో కూడా మనుషులను హింసించేవాడివి.
నరమాంసభక్షణ చేసేవాడివి. నమ్మినవారిని హింసించడం వల్ల సోదరులు లేకుండాపోయారు. నీకు గత జన్మలో సంతానం కూడా లేకపోయింది. పరపీడన పాపం వల్ల నీకు ఈ జన్మలో వనవాసక్లేశం సంభవించింది. నరమాంసభక్షణ వల్ల నీకు తిండికి కరవైన పరిస్థితి ఏర్పడింది. మనుషులకు అప్రియమైన పనులు అనేకం చేయడం వల్ల నానా కష్టాలు నిన్ను చుట్టుముట్టాయి. సజ్జనులను హింసించడం వల్ల శత్రువుల చేతిలో ఓటమి ఎదురైంది. ఇదివరకటి జన్మలలో ఎవరికీ దానం చేయకపోవడం వల్ల దారిద్య్రబాధ సంభవించింది.’’ అని చెప్పారు. ‘‘మరి ఈ జన్మలో రాజవంశంలో ఎలా జన్మించాను?’’ అడిగాడు పుణ్యశీలుడు.
‘‘ఆ కారణం కూడా చెబుతాం విను. నువ్వు కిరాతుడిగా ఉన్నప్పుడు ఒక వేసవిలో ఇద్దరు ధనిక వైశ్యులు, కర్షణుడు అనే విప్రుడు తారసపడ్డారు. నువ్వు ఆ ముగ్గురినీ అటకాయించావు. వారిలో ఒక వైశ్యుడిని చంపి, అతడి వద్దనున్న ధనం లాక్కున్నావు. రెండో వైశ్యుడు తన డబ్బు మూటను పొదల్లో పారవేసి పారిపోయాడు. విప్రుడు కూడా పరుగు లంకించుకున్నాడు. కొంత దూరం పరుగెత్తాక విప్రుడు సొమ్మసిల్లి పడిపోయాడు. రెండో వైశ్యుడు డబ్బును ఎటువైపు పారవేశాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నువ్వా విప్రుడికి శైత్యోపచారాలు చేసి, అతడి దప్పిక తీర్చావు. నీ పట్ల భయంతో అతడు రెండో వైశ్యుడు డబ్బు మూట ఎటువైపు పారవేశాడో చెప్పాడు. నువ్వు ఆ విప్రుడిని ప్రాణాలతో విడిచిపెట్టావు.
నీ స్వలాభం కోసమైనా, వైశాఖమాసంలో విప్రుడికి ఉపచారాలు చేసి, దప్పిక తీర్చిన ఫలితంగా నువ్వు ఈ జన్మలో రాజవంశంలో జన్మించావు. అందువల్ల వైశాఖ ధర్మాలను నిర్వర్తిస్తే నువ్వు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందగలవు’’ అని చెప్పారు. గురువులైన యాజోపయాజకులు చెప్పిన ప్రకారం పుణ్యశీలుడు వైశాఖ ధర్మాలను ఆచరిస్తూ, శ్రీహరిని పూజించసాగాడు. కొన్నాళ్లకు అతడు తన బంధువులను కలుసుకోగలిగాడు. వారి సాయంతో శత్రువులు ఆక్రమించుకున్న తన రాజ్యానికి వెళ్లి, శత్రువులతో యుద్ధంచేసి, వారిని తుదముట్టించి, తిరిగి తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు.
సాంఖ్యాయన


