Friendship Day 2021: అరరే ఫ్రెండ్స్‌ దగ్గరకు ఖాళీ చేతులతో ఎలా..? ఇలా ట్రై చేయండి..

Friendship Day Gifts - Sakshi

‘‘ఈ రోజైనా ఫ్రెండ్‌ని కలిసి కాసేపైనా కబుర్లతో గడిపేద్దామంటే పనులు తెమలవు’’
‘‘నా చేతులతో నేనే మంచి గిఫ్ట్‌ తయారు చేయాలనుకున్నాను. కానీ, సమయం లేదు’’
‘‘చాలా రోజుల తర్వాత ఫ్రెండ్‌ను కలుస్తున్నాను, ఏం గిఫ్ట్‌ ఇస్తే బాగుంటుంది...’’
ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఈ స్నేహితుల రోజున మదిని ముసురుతుంటాయి. కొన్నిసార్లు స్నేహితులను కలవడానికి వెళ్లి చివరి నిమిషంలో ‘అరరే, ఖాళీ చేతులతో కాకుండా ఏదైనా గిప్ట్‌తో వచ్చుంటే బాగుండేది’ అనుకుంటుంటారు. తెలిసినవీ, చిన్న చిన్నవే అయినా కొన్నిసార్లు వాటినీ మర్చిపోతుంటాం. ఇలాంటప్పుడు కొద్ది సేపట్లో కలవబోయే ఫ్రెండ్‌ను కూడా ఖుష్‌ చేయాలంటే ఈ సింపుల్‌ గిప్ట్‌ ఐడియాస్‌ను అమల్లో పెట్టేయచ్చు. 


చేతితో అద్భుతం.. 
కొన్ని గంటల సమయం ఉంటే మీ చేతులతో ఓ అందమైన గ్రీటింగ్‌ కార్డును తయారుచేయండి. కొద్దిగా సమయం ఉంటే గ్రీటింగ్‌ కార్డు కొనేయండి. అదీ లేదంటే, మీ చేతిలో ఓ తెల్లని కాగితం, పెన్ను ఉంటే చాలు. మీ చేతి రాతతో మీ ఫ్రెండ్‌ మీకెంత ప్రత్యేకమో తెలియజేస్తూ కొన్ని వాక్యాలు రాయండి. మీ ఫ్రెండ్‌కు మీలోని భావన అర్థమైపోతుంది. మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆన్‌లైన్‌ ద్వారా పంపాలనుకుంటే నచ్చిన కార్డును ఎంపిక చేసుకొని, దాని మీద మీదైన నోట్‌ రాసి, సెండ్‌ చేస్తే.. అవతలి మీ ఫ్రెండ్‌కు మీ మనసు దగ్గరైపోతుంది.

చిట్టి టెడ్డీబేర్‌
యువతరం అయినా, పెద్దవాళ్లైనా టెడ్డీబేర్‌ అంటే చాలు వారి మనసులు చిన్నపిల్లల్లా గంతులు వేస్తాయి. మనస్పర్ధల కారణంగా కొద్దికాలంగా దూరంగా ఉన్న స్నేహితుల హృదయాలు కూడా స్నేహంగా కలిసిపోయినట్టుగా ఉండే హగ్‌ టెడ్డీబేర్‌ను చూస్తే కరిగిపోతాయి. ఇవి వివిధ రంగుల్లో రకరకాల పరిమాణాల్లో లభిస్తున్నాయి. మీ క్లోజ్‌ ఫ్రెండ్‌ను ఈ కానుక మరింత ఆకట్టుకుంటుంది. పెద్ద ఖర్చు కూడా ఉండదు. 


తియ్యటి స్నేహం

ఫ్రెండ్‌కి ఏ బహుమతి నచ్చుతుందో ఏంటో అనే సందేహంలో ఉంటే మాత్రం చాక్లెట్లు మిమ్మల్ని రక్షిస్తాయి. ఏ చాక్లెట్‌ అయినా చాలా వరకు అందరికీ నచ్చుతాయి. అందుకే, మంచి చాక్లెట్‌ను ఈ రోజున కొన్ని నిమిషాల వ్యవధిలో గిఫ్ట్‌గా ఎంచుకోవచ్చు. 


బంధనం

తమ మధ్య స్నేహ బంధం ఎప్పటì కీ నిలిచిఉంటుందని చెప్పడానికి గర్తుగా బంధనం కట్టుకుంటారు. అందుకు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ ఎన్నో వెరైటీలలో మార్కెట్‌లో ఉన్నాయి. మీకై మీరుగా రంగుల నూలు దారం, పూసలను ఉపయోగించి కూడా బ్యాండ్‌ను తయారు చేసుకోవచ్చు. 
మహమ్మారి కారణంగా దూరాన ఉన్న దోస్తానాలకు ఆన్‌లైన్‌ వారధిగా నిలుస్తుంది. చిన్న సందేశం, చేరవేసే కానుక ఎన్నో మైళ్ల దూరాన ఉన్న ఫ్రెండ్స్‌కు దగ్గరే ఉన్నామనే ఆలోచన వెయ్యేనుగుల బలాన్నిస్తుంది. 


పువ్వుల పరిమళం

తాజా పువ్వులు ఎవరినైనా కాసేపు చిరునవ్వులో ముంచెత్తుతాయి. అందుకే తాజా పుష్పగుచ్ఛాన్ని కానుకగా ఇవ్వడం వల్ల స్నేహం కూడా ఎల్లప్పుడూ అంతే పరిమళ భరితంగా కొనసాగుతుంది. దూరాన ఉన్నాం, కలవలేం అనుకునేవారి కోసం ఆన్‌లైన్‌లో ఫ్రెండ్‌షిప్‌ డే ఫ్లవర్స్‌ డెలివరీ దేశమంతటా ఉంది. అర్ధరాత్రికి కూడా డోర్‌డెలివరీ సదుపాయాలు ఉన్నాయి. ఎక్కువ కాలం మన్నేవి, డిజైన్‌ చేసిన పుష్పగుచ్చాలు కూడా ఎంపిక చేసుకోవచ్చు. నేరుగా కలుసుకునే ఫ్రెండ్‌కి ఇంట్లో పూసిన కొన్ని పువ్వులను గుచ్ఛంలా తీసుకెళ్లి అందించవచ్చు. 


ఒకే ఒక కేక్‌ ట్రీట్‌

ఫ్రెండ్స్‌తో కలిసి ఒక కేక్‌ను కట్‌ చేసి, పంచుకుంటే చాలు అప్పుడిక ఆనందానికి ఆకాశమే హద్దులా అనిపిస్తుంది. అందుకు, చాక్లెట్‌ కేక్, ఫ్రూట్‌ కేక్, నట్‌ కేక్‌.. ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ కేక్‌ సేవలూ ఈ రోజుల్లో అందుబాటుల్లో ఉన్న విషయం తెలిసింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top