ఫిట్‌నెస్‌ రంగంలో డ్రోన్ల హల్‌చల్‌.. సమస్యలూ లేకపోలేదు!

Fitness Drones Are Coming, here Is Full Details - Sakshi

ఇప్పటివరకు డ్రోన్స్‌ అంటే మిలటరీలో వాడతారని, అమెరికా లాంటి దేశాల్లో సరుకుల డెలివరీకి వాడతారని, మనదగ్గరైతే ఫొటోషూట్స్‌ కోసం వాడతారని తెలుసు. కానీ త్వరలో పర్సనల్‌ హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ రంగంలో డ్రోన్స్‌ కాలుమోపనున్నాయి. ఫిట్‌నెస్‌ డ్రోన్లతో రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జాగోబోట్‌ పేరిట కొన్ని నమూనాలు ఫిట్‌నెస్‌ రంగంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మెల్‌బోర్న్‌కు చెందిన ఎక్సర్షన్‌  గేమ్స్‌ ల్యాబ్‌ 2012లోనే దీన్ని సృష్టించింది. ఈ డ్రోన్‌ జాగింగ్‌ చేసేవారు ధరించే టీషర్ట్‌పై ఉండే ప్రత్యేక మార్కర్‌ను గుర్తించి దానికి పదడుగుల దూరంలో ఎగురుతూ ఉంటుంది.

జాగింగ్‌లో దీన్ని తోడుగా కొందరు భావిస్తే, కొందరు పేసర్‌గా వాడుకుంటున్నారు. అయితే ఎక్కువమంది దీన్ని జాగింగ్‌లో స్నేహితుడిగా భావించడమే ఆశ్చర్యాన్నిస్తోందని దీని సృష్టికర్త ముల్లర్‌ చెప్పారు. మనిషి సంఘజీవి అని, ఒంటరిగా ఎక్కువసేపు ఉండడం ఎక్కువమందికి చేతకాదని వివరించారు. అందుకే చాలామంది ఫ్రెండ్స్‌తో, కుటుంబసభ్యులతో లేదా పెంపుడు కుక్కతో జాగింగ్‌కు వెళ్తుంటారన్నారు. ఇప్పుడు అంతా మెకానికల్‌ లైఫ్‌ అవుతున్న దశలో సరైన జాగింగ్‌ పార్టనర్‌ దొరకడం కష్టమవుతోంది. అలాంటివారికి జాగ్‌బాట్‌ స్నేహితుడిలా ఉపయోగపడుతోంది. 

పరిమితులున్నాయి
హాలీవుడ్‌ సినిమాల్లోలాగా జాగ్‌బాట్‌ అన్నీ చేసేయదు. దీనికి కొన్ని పరిమితులున్నాయి. దీంతో జాగింగ్‌ చేయాలంటే సరళమార్గాల్లోనే పరుగెత్తాలి. అలాగే దీని బ్యాటరీ లైఫ్‌ 30 నిమిషాలే ఉంటుంది. ఈ లోటుపాట్లను అర్ధం చేసుకొని మరికొన్ని కంపెనీలు మరింత ఉన్నత సాంకేతికతతో కూడిన ఫిట్‌నెస్‌ డ్రోన్ల తయారీకి ముందు కొస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన హాంగిక్‌ యూనివర్సిటీ విద్యార్థ్ధులు తాజాగా ట్రావెర్స్‌ డ్రోన్‌  పేరిట కొత్త నమూనా రూపొందించారు. కొత్తగా వ్యాయామాలు మొదలెట్టేవారికి పర్సనల్‌  ట్రైనర్‌గా వ్యవహరించడం దీని ప్రత్యేకత.

ఇందుకోసం దీనిలో అనేక కెమేరాలు, సెన్సర్లు అమర్చారు. డ్రోన్‌ వాడే కస్టమర్లు చిన్న పాడ్‌ లాంటిదాన్ని మెడలో వేసుకుంటే సరిపోతుంది. దీనిద్వారా డ్రోన్‌  కంట్రోల్స్‌ను మార్చుకోవడంతో పాటు, వాయిస్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వచ్చు. త్వరలో దీన్ని ఉత్పత్తి దశకు తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఎలక్ట్రానిక్‌ ట్రైనింగ్‌ యంత్రాల సాయం దివ్యాంగులకు మరింత ఎక్కువ ఉపయుక్తమని రిసెర్చర్లు భావిస్తున్నారు. ఈ దిశగా రోబోటిక్స్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌ బ్లైండ్‌ రన్నర్లకు సహాయకారిగా ఉండే డ్రోన్లను రూపొందించింది.
  – డి. శాయి ప్రమోద్‌

సమస్యలు కూడా ఉన్నాయి
ఇలాంటి యంత్రాల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ప్రతిధ్వని సమస్య. ఒక గదిలో వ్యాయామాలు చేస్తున్నప్పుడు డ్రోన్‌ కు ఇచ్చే వాయిస్‌కమాండ్‌ గదిలో ప్రతిధ్వనిస్తే డ్రోన్‌ కరెక్ట్‌గా గ్రహించలేదు. అలాగే బయట వాతావరణంలో పలు శబ్దాల మధ్య మన గొంతును కచ్ఛితంగా గుర్తుపట్టడం కూడా డ్రోన్‌ కు సమస్యే!. ఇక మరో అతిపెద్ద సమస్య డ్రోన్‌ తో ఢీ కొనడం! బ్లైండ్‌రన్నర్లు పరిగెత్తే సమయంలో డ్రోన్‌ మూవ్‌మెంట్‌ మొరాయిస్తే ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే దీర్ఘకాలిక బ్యాటరీ శక్తిని సమకూర్చడం కూడా అవసరం. ఈ సమస్యలకు పరిష్కారాల కోసం పరిశోధకులు యత్నిస్తున్నారు. ఇక ఫిట్‌నెస్‌ డ్రోన్లంటే కేవలం జాగింగ్, రన్నింగ్‌కు మాత్రమే సాయం చేస్తాయనుకుంటే పొరపాటే!

పలు యూరోపియన్‌  సాకర్‌ టీమ్‌లు ప్రత్యర్ధి టీమ్‌ వ్యూహాలు, బాల్‌ కదలికలను అధ్యయనం చేసుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. అలాగే కొన్ని క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పోశ్చర్‌ను అన్ని కోణాల్లో చూసుకొని తప్పులు దిద్దుకునేందుకు డ్రోన్లను వాడుతున్నారు. పైన చెప్పుకున్న ఎక్సర్షన్‌ ల్యాబ్‌ తాజాగా ధ్యాన డ్రోన్స్‌ను తయారు చేయాలని భావిస్తోంది. డ్రోన్‌ ఛిగా పిలిచే ఈ డ్రోన్‌  చైనా మార్షల్‌ ఆర్ట్‌ తాయ్‌ఛికి ప్రతిరూపమని తెలిపింది. ఇప్పటికీ ఈ డ్రోన్‌  ప్రొటోటైప్స్‌ను సంస్థ రూపొందించింది. భవిష్యత్‌లో ఈ డ్రోన్లు ఫిట్‌నెస్‌ విషయంలో మెకానికల్‌ భాగస్వాములుగా మారనున్నాయంటే అతిశయోక్తి కాదేమో! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top