సనాను ప్రధాని అనుకోలేదు

Finland Prime Minister Sanna Marin Photo Controversy In Social Media - Sakshi

ఫిన్లాండ్: ఎంతటి గంభీరమైన విధి నిర్వహణలలో ఉన్న స్త్రీలైనా కానివ్వండి, ఫ్యాషన్‌ గా ఉండే దుస్తుల ఎంపికలో చిన్న పిల్లలు అయిపోతారు. బహుశా అది ప్రకృతి చేత వారికి అనుగ్రహించబడిన ఉత్సాహం కావచ్చు. లేదా ఇంకొకటి అయి ఉండాలి. ఎంతటి గంభీరమైన స్త్రీనైనా స్త్రీ గా చూపించడానికి ప్యాషన్‌ కంపెనీలు పన్నుతున్న కుట్లు అల్లికలు అయినా అయి ఉండాలి. ఏమైనా ఈ భూమి మీద ఫ్యాషన్‌ బతికి బట్ట కట్టడానికి మహిళలే ‘మాతా కబళం!’. సనా మారిన్‌ ఫిన్లాండ్‌ ప్రధాని. 34 ఏళ్లు. ప్రపంచ ప్రధానులలో అందరికన్నా చిన్న. వయసు చిన్నదే కానీ ఆమె పోస్టు గంభీరాలలోకి గాంభీర్యం. ఆమెను మోడల్‌గా పెట్టి అంతర్జాతీయంగా పేరున్న ఒక పెద్ద ఫ్యాషన్‌ దుస్తుల కంపెనీ, పేరున్న ఒక ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ ఫొటో షూట్‌ చేసి, స్పెషల్‌ స్టోరీ వేశాయి. చదవండి: బైడెన్‌ గెలిచాడని ఒప్పుకున్న ట్రంప్‌!

ఫొటోలలో సనా రిచ్‌గా, ఫ్యాషనబుల్‌గా, ప్రధాని కంటే పెద్ద పోస్టులో ఉన్నట్లుగా ఉన్నారు. కంఠాభరణం కనిపించేలా ఆమె ధరించిన లో–కట్‌ జాకెట్‌ అయితే ఫిన్లాండ్‌ మహిళలకు భలే నచ్చేసింది. ‘వాహ్‌.. మేడమ్, సూపర్‌ గా ఉన్నారు’ అని కాంప్లిమెంట్స్‌ కురిపించారు. పురుషులకు ఇలాంటివి ముందే నచ్చుతాయి. నచ్చుతాయి కానీ ‘వావ్‌‘ అంటూ ముందుకు వచ్చేయకుండా వాళ్లను కొన్ని స్వీయ నియంత్రణ శక్తులు కాపాడుతుంటాయి. విమర్శించడానికి మళ్లీ అంత ఆలోచించరు. ‘ఒక దేశానికి ప్రధానిగా ఉండి ఈ డ్రెస్‌ ఏమిటి?’ అని సనా పై కొందరు పురుషులు సంప్రదాయాన్ని ప్రదర్శించారు. అమ్మాయిలు ఊరుకుంటారా! ‘ఐయామ్‌ విత్‌ సనా’ అనే హ్యాష్‌ టాగ్‌తో తమ ఫొటోలను (లో–కట్‌ జాకెట్‌ తో ఉన్నవి) కుమ్మరింపుగా పోస్ట్‌ చేస్తూ ఆమె వైపు నిలబడ్డారు. సనాను వాళ్లు పీఎం అనుకోలేదు. సాటి అమ్మాయి అనుకున్నారు. అందుకే అంత సపోర్టు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top