కాలేయం కోసం కాస్త శ్రద్ధ ఇలా...

Fatty Liver And Liver Cirrhosis - Sakshi

మధ్యవయసు దాటాక వయసుతో పాటు దేహంలో కొవ్వు కూడా పెరుగుతుంది. ఇదే కొవ్వు కాలేయంలోని నార్మల్‌ కణాల్లో కూడా పెరుగుతూ, పేరుకుపోతూ ఉండవచ్చు. అదే ఫ్యాటీలివర్‌. కొన్నిసార్లు అది రక్తప్రవాహానికీ అడ్డురావచ్చు. అప్పుడు కాలేయం  ఆకృతి, దాని స్వాభావికమైన రంగు దెబ్బతినవచ్చు. కాస్త గట్టిగా లేదా  జిగురు జిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్‌ అంటారు. కొన్నిసార్లు దేహంలోకి చాలా ప్రమాదకరమైన విషాలు ప్రవేశించడం వల్ల గానీ, కొన్ని వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్‌ వల్ల, తగినంత ఆహారం తీసుకోకుండా, మితిమీరిన ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కూడా సిర్రోసిస్‌ రావచ్చు. 

అలాంటి సమయంల్లో దేహంపైన సాలీడు ఆకృతిలో రక్తనాళాలు బయటకు కనిపించవచ్చు. ఆకలి లేకపోవడం, నీరసం, నిస్సత్తువ, పొట్టలో విపరీతంగా గ్యాస్‌ పేరుకుపోవడం, కళ్లు పసుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటే  డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్‌లు లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ వంటి కొన్ని పరీక్షలు చేసి కాలేయం పనితీరు తెలుసుకుంటారు. కాలేయం పనితీరు బాగుంటే ఫరవాలేదు. ఒకవేళ ఫ్యాటీలివర్‌ ప్రాథమిక దశలో ఉన్నా అంతగా ప్రమాదం ఉండదు. బరువు పెరగడాన్ని నియంత్రించుకోవాలి. మద్యం పూర్తిగా మానేయాలి.

అన్నిరకాల పోషకాలు అందేలా... ముఖ్యంగా విటమిన్‌ బి లాంటివి అందేలా మంచి ఆహార నియమాలు పాటించాలి. రోజూ కొద్దిగా వ్యాయామం చేయాలి. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ ఉంటే కొద్దిపాటి మందులతోనే కాలేయం బాగుపడుతుంది,  బాగుంటుంది. సాధారణంగా కాలేయం తాను దెబ్బతిన్న భాగాన్ని తనంతట తానే బాగుచేసుకుంటుంది. అలా ఒకసారి అది తనను రిపేర్‌ చేసుకోలేనంతగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి తప్ప మరొక ప్రత్యామ్నాయం ఉండనందున... ఒక వయసుదాటాక కాలేయంపై శ్రద్ధ అవసరం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top