
విశాఖపట్నం: వేడివేడి అన్నం ..ఆ తర్వాత స్వచ్ఛమైన నెయ్యి ..అందులో కాస్త ఆవకాయ ముక్కను కలుపుకొని తింటే... ఆహా! ఆ రుచిని వర్ణించలేం. మొదటి ముద్దతోనే నోరంతా పులకరించిపోతుంది. వేడి అన్నం, కమ్మటి నెయ్యి, ఘాటైన ఆవకాయ... ఈ మూడు రుచులు ఒకదానితో ఒకటి పోటీపడుతూ, నాలుకపై ఒక మాయాజాలాన్ని సృష్టిస్తాయి.
ఒక్కో ముద్ద తింటుంటే కడుపు నిండిపోతున్నా, ఆ రుచి మాత్రం వదలాలనిపించదు. కళ్లల్లో ఒక విధమైన మెరుపు, పెదాలపై చిరునవ్వు అదే వస్తుంది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సీజన్ ఆరంభం అవుతుంది. మహిళలు ఏడాది అంతా తినడానికి సరిపోయే విధంగా ఆవకాయ పెడతారు. ఆవకాయ పెట్టడానికి ఎంతో అనుభవం, నైపుణ్యం అవసరం. ఇటువంటి ఆవకాయ తయారీపై నగరంలో పోటీలు నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్‌లో రెడ్ ఎఫ్‌ఎం, త్రీ మేంగోస్ స్పైసెస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందమందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆవపొడి, కారం, ఉప్పు, నూనె సమపాళ్లలో కలిపి నోరూరించే ఆవకాయను క్షణాలలో సిద్ధం చేశారు. యువతుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొని, ఆవకాయ ఘాటును రుచిచూపించారు. ఆవకాయ తయారు చేసిన మహిళలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఆర్‌జేలు ప్రదీప్, కృష్ణ, షర్మిల, భావన, మధు కార్తీక్‌లతో పాటు ప్రోగ్రామింగ్ హెడ్ సుష్మ తదితరులు పాల్గొన్నారు.