అమ్మా... అలసిపోతున్నా...

emotional fatigue on school childrens - Sakshi

పేరెంటింగ్‌

స్కూల్‌కు పంపిస్తున్నాం. ఇంటికి తిరిగొస్తున్న పిల్లలు ఒళ్లు నొప్పులు అంటున్నారు. నిద్రొస్తోంది అంటున్నారు. కొందరికి కడుపులో అనీజీనెస్‌. ఇన్నాళ్లు ఇంట్లో ఉండి ఇప్పుడు స్కూల్‌కు వెళ్లడం వల్ల వాళ్లు అలసిపోతున్నారు అని మనం అనుకుంటున్నాం. కాని అది ‘ఎమోషనల్‌ ఫెటిగ్‌’ (భావోద్వేగ అలసట) అని నిపుణులు అంటున్నారు. పాతకు తిరిగి కొత్తగా వెళ్లాల్సి రావడం వల్లే ఈ అలసట. ఏం చేయాలి?

కేస్‌స్టడీ 1:
విశ్వాస్‌ తొమ్మిదో క్లాసు. స్కూల్‌ తిరిగి మొదలయ్యాక వెళ్లడం మొదలెట్టాడు. కాని రెండు మూడు రోజులకే ఆకలి లేదని అనడం మొదలెట్టాడు. కడుపులో బరువు ఉంటోంది అంటున్నాడు. అలసటగా సోఫాలో వాలిపోతున్నాడు. ప్రయివేట్‌ స్కూల్‌ అది. భోజనం గతంలో చేసిందే. ఇప్పుడూ చేస్తున్నాడు. కాని ఆ అన్నం పడట్లేదు అంటున్నాడు. తల్లిదండ్రులు స్కూల్‌ వాళ్లకు ఫోన్‌ చేసి కేటరింగ్‌ ఏదైనా మార్చారా, వేరే రకంగా వండుతున్నారా అని ప్రశ్నలు సంధించారు. నిజానికి స్కూలు సజావుగానే ఉంది. విశ్వాస్‌ గత 14 నెలలుగా ఇంట్లో భోజనం తిన్నాడు. పైగా అమ్మ కొసరి కొసరి తినిపిస్తుంటే తిన్నాడు. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్కూల్లో తినాల్సి వచ్చేసరికి అడ్జస్ట్ట్‌ కాలేకపోతున్నాడు. దానికి టైమ్‌ ఇవ్వాలి. ఆ టైమ్‌ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

కేస్‌స్టడీ 2:
జాహ్నవి 7వ క్లాసు. మాస్క్‌ పెట్టుకుని చక్కగా స్కూల్‌కు వెళుతోంది. కాని ఇంటికి వచ్చేసరికి పూర్తిగా అలసిపోతోంది. అసలు తిరుగు ప్రయాణంలో బస్‌ ఎక్కగానే నిద్రపోతోంది. ఇంట్లో వాళ్లు కంగారు పడి ‘వద్దులే.. ఆన్‌లైన్‌ ఆప్షన్‌ కూడా ఉంది కదా. ఇంట్లోనే ఉండి చదువుకో’ అని స్కూల్‌కి పంపడం లేదు. కాని జాహ్నవికి కన్‌ఫ్యూజన్‌. స్కూల్‌కి వెళ్లాలా... ఇంట్లో ఉండాలా? ఆ పాప అలసిపోతోంది శారీరకంగా కాదు. మళ్లీ రియల్‌ క్లాసెస్‌ని అటెండ్‌ కావడానికి అడ్జస్ట్‌ అవలేకపోవడం వల్లే.
ఈ రెండు కేసుల్లో పిల్లలు పడుతున్న అవస్థను నిపుణులు ‘ఎమోషనల్‌ ఫటీగ్‌’ అంటున్నారు.

అది గబగబ చేయమని.. ఇదీ చేయమని
ఆలోచించండి. పిల్లలు కరోనా కాలంలో ఎంత అవస్థ పడ్డారో. స్కూళ్లు మానేసి వాళ్లను త్వరత్వరగా ఆన్‌లైన్‌ క్లాసులకు అడ్జస్ట్‌ అవమన్నాం. చిన్న స్క్రీన్‌ ఉండే ఫోన్‌లలో, ల్యాప్‌టాప్‌లలో, కంప్యూటర్‌లలో వాళ్లను పాఠాలను వినమన్నాం. ఇంతకు మునుపు ఎప్పుడూ ఈ అనుభవం లేని పిల్లలు ఆ తెర మీద కనిపించే టీచర్‌ను చూడటానికి ఆ మైక్‌లో వినిపించే పాఠాలను అర్థం చేసుకోవడానికి అవస్థ పడ్డారు. వారిని ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ రాయమంటే చాలామంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల, తోబుట్టువుల, పుస్తకాల సాయంతోనే ఆ పరీక్షలు రాసి పాస్‌ అయ్యారు. క్లాస్‌ జరుగుతుంటే కెమెరా ఆఫ్‌ చేసి ఆడుకున్నారు.

క్లాస్‌ను గాలికి వదిలి గేమ్స్‌ ఆడుకున్నారు. ఇలా గడిచిపోయిన పిల్లలను ఇప్పుడు గబగబా మళ్లీ రియల్‌ స్కూల్‌కు అలవాటు కమ్మని చెప్పడం వల్లే వారు భావోద్వేగపరమైన అలసటకు గురవుతున్నారు. ఇన్నాళ్లు చిన్న చిన్న రూపాల్లో కనిపించిన క్లాస్‌రూమ్‌ను, టీచర్‌ను, క్లాస్‌మేట్స్‌ను వాళ్లు రియల్‌గా చూడాలి. రియల్‌గా మళ్లీ ఆ వాతావరణానికి అలవాటు పడాలి. పెద్దలు రోడ్డు మీద ఈ బస్సు ఆగిపోతే ఇంకో బస్సు ఎక్కినంత సులువుగా పిల్లలు ఈ అటుకులు చిటుకులు మారలేరు. వారి లోలోపల చాలా భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ వారిని ముప్పిరిగొంటాయి. దానివల్ల వచ్చే అలసటే ఇది అని అర్థం చేసుకోవాలి.

సమయం ఇవ్వడం ప్రధానం
కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే స్కూల్‌ మొదలైందిగా ఇంక అంతా నార్మల్‌ అయినట్టేనని ‘‘ఆ పాఠాలు చదివావా ఈ హోమ్‌ వర్క్‌ చేశావా అందులో ఒప్పజెప్పు... ఇది చేసి చూపించు’’ అని అడుగుతారు. టీచర్లు కూడా పరీక్షలు పెట్టేయొచ్చు, సిలబస్‌ గబగబా ముగించవచ్చు... పాత వైఖరిలోనే వ్యవహరించ వచ్చు అనుకుంటారు. కాని ఇప్పుడు క్లాసుల్లో ఉన్న పిల్లలు గతంలోని పిల్లలు ఏ మాత్రం కారు అని గ్రహించాలి.

ఒక సంవత్సరన్నర కాలం వారిని చాలా గందరగోళానికి, ఒంటరితనానికి, భయానికి, ఆందోళనకు గురించి చేసింది. ఆ సమయంలో ఏం చదివామో ఏం చదవలేదో అన్న బెంగ వారికి ఉంది. ఇప్పుడు స్కూల్లో తాము పరీక్షలకు, టీచర్ల ప్రశ్నలకు ఏ మాత్రం నిలబడతామోనన్న కంగారు వారికి ఉంటుంది. దాంతో వారు అలసిపోతున్నారు. సరిగ్గా తింటున్నా, ఇంట్లో తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నా అలసిపోతున్నారు. వీరికి సమయం ఇచ్చి మెల్లగా అడ్జస్ట్‌ అవ్వండి అని పదేపదే చెప్పడమే మందు.

అతి జాగ్రత్త.. అతి నిర్లక్ష్యమూ వద్దు
తల్లిదండ్రులు పిల్లల పట్ల అతి జాగ్రత్త వద్దు... అలాగే అతి నిర్లక్ష్యమూ వద్దు. స్కూళ్లకు అందరు పిల్లలూ వెళుతున్నా మన పిల్లల్ని కేవలం ఆన్‌లైన్‌ ఆప్షన్‌ ఉంది కదా అని దానికే పరిమితం చేయవద్దు. అలాగే నిర్లక్ష్యంగా గుంపులో ఎక్కువ మంది పిల్లలు ఉండే ఆటోల్లో పంపవద్దు. జాగ్రత్తలు తీసుకోవాలి... అలాగే స్కూల్‌కు తిరిగి అలవాటు చేయాలి. పిల్లలు పిల్లల లోకంలో ఉండటమే కరెక్ట్‌. ఆ పిల్లల లోకంలో వారుండగా మార్కులు, డిసిప్లిన్, పాఠాలు... త్వరత్వరగా అంటే అలసిపోతారు. టైమ్‌ ఇవ్వండి. వారిని నవ్వనివ్వండి. కొంచెం ఆడనివ్వండి. తర్వాత ఎలాగూ చదవాల్సిందేగా.       

తల్లిదండ్రులు పిల్లల పట్ల అతి జాగ్రత్త వద్దు... అలాగే అతి నిర్లక్ష్యమూ వద్దు. స్కూళ్లకు అందరు పిల్లలూ వెళుతున్నా మన పిల్లల్ని కేవలం ఆన్‌లైన్‌ ఆప్షన్‌ ఉంది కదా అని దానికే పరిమితం చేయవద్దు. పిల్లలు పిల్లల లోకంలో ఉండటమే కరెక్ట్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top